ఈవెంట్
బంగారు తెలంగాణపై కవి సమ్మేళనం
‘కామన్ డయాస్’ ఆధ్వర్యంలో నేడు ఉదయం 10 గంటలకు ‘బీసీ సాధికారత సంస్థ, హిమాయత్ నగర్’(తెలుగు అకాడమీ పక్కన)లో ‘బంగారు తెలంగాణ’పై కవి సమ్మేళనం జరగనుంది. మసన చెన్నప్ప, కాలువ మల్లయ్య, బీవీఆర్ చారి పాల్గొంటారు.
కవిత్వ కళా శిబిరం
‘తెలంగాణ రచయితల సంఘం’ ఆధ్వర్యంలో నేడు ఉదయం 10 గంటలకు కర్షక్ బీఈడీ. కళాశాల, కామారెడ్డిలో ‘కవిత్వ కళా శిబిరం- కవి సమ్మేళనం’ జరగనుంది. కీలకోపన్యాసం: నందిని సిధారెడ్డి. ప్రసంగాలు: నాళేశ్వరం శంకరం, ఎం.నారాయణశర్మ, అయాచితం నటేశ్వరశర్మ.
వెజిటేరియన్స్ ఓన్లీ ఆవిష్కరణ
ఓరియంట్ బ్లాక్ స్వాన్ ప్రచురించిన స్కైబాబా తెలుగు కథల ఆంగ్లానువాదం ‘వెజిటేరియన్స్ ఓన్లీ’ ఆవిష్కరణ నేడు ఉదయం 10 గంటలకు నల్లగొండ జిల్లా కేశరాజుపల్లిలో జరగనుంది. ఆవిష్కర్త: రచయిత అమ్మ హాజీబేగం. ఇందులో వేముల శేఖర్, పసునూరి రవీందర్, అంబటి సురేంద్రరాజు, గోరటి వెంకన్న, నోముల సత్యనారాయణ, సుంకిరెడ్డి నారాయణరెడ్డి, బెరైడ్డి కృష్ణారెడ్డి, కార్టూనిస్ట్ శంకర్, నిసార్, బెల్లి యాదయ్య, షాజహానా తదితరులు పాల్గొంటారు.
ఇస్మాయిల్ కవిత్వ పురస్కార సభ
2014 ఇస్మాయిల్ కవిత్వ పురస్కారాన్ని ‘నదీమూలం లాంటి ఆ ఇల్లు’ కవితాసంపుటికిగానూ యాకూబ్‌కు ప్రదానం చేయనున్నారు. ఇస్మాయిల్ మిత్రమండలి ఆధ్వర్యంలో నేడు ఉదయం 10:30కి కాకినాడలోని పి.ఆర్.ప్రభుత్వ కళాశాల సమావేశ మందిరంలో జరిగే ఈ కార్యక్రమంలో ధూళిపాళ అన్నపూర్ణ, వాడ్రేవు చినవీరభద్రుడు, పలమనేరు బాలాజీ, కొప్పర్తి వెంకటరమణమూర్తి, వాడ్రేవు వీరలక్ష్మీదేవి పాల్గొంటారు.
‘బతుకుముడి’కి వట్టికోట పురస్కారం
‘మంజీరా రచయితల సంఘం’ నిర్వహించిన వట్టికోట ఆళ్వార్‌స్వామి స్మారక కథా పురస్కారానికి నిజామాబాద్‌కు చెందిన బి.కళాగోపాల్ కథ ‘బతుకుముడి’ ఎంపికైంది. అలాగే, దిలావర్(ఖమ్మం) ‘మూడు తరాలు’, హుమాయూన్ సంఘీర్(నిజామాబాద్) ‘బూదెవ్వ’ ఉత్తమ కథలుగా ఎంపికయ్యాయని వేముగంటి రఘునందన్ తెలియజేస్తున్నారు. నందిని సిధారెడ్డి, దేవరాజు మహారాజు, సంగిశెట్టి శ్రీనివాస్ న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు.
ఇస్మాయిల్ అవార్డు-2015
తెలుగులో ఉత్తమ కవిత్వానికి గుర్తింపుగా ఇస్తున్న ఇస్మాయిల్ అవార్డుకు చామర్తి మానస ఎంపికైందని తమ్మినేని యదుకుల భూషణ్ తెలియజేస్తున్నారు. ‘తనదైన అనుభవాన్ని అనాయాసంగా దృశ్యమానం చేయగల ప్రతిభా వ్యుత్పన్నతలు నేటికాలపు కవులనుండి ఈమెను ఎడంగా నిలబెడతాయి’. గతంలో పాలపర్తి ఇంద్రాణి, గోపిరెడ్డి రామకృష్ణారావు, గరికపాటి పవన్‌కుమార్, పి.మోహన్, వైదేహి శశిధర్, గండేపల్లి శ్రీనివాసరావు, పద్మలత, తులసీ మోహన్, స్వాతికుమారి, మమతకు ఈ అవార్డ్ లభించింది.
ఉమ్మడిశెట్టి అవార్డు కోసం...
ఉమ్మడిశెట్టి సాహితీ అవార్డు-2015 కోసం కవుల నుండి 2015లో అచ్చయిన కవితాసంపుటాలను ఆహ్వానిస్తున్నారు అవార్డు వ్యవస్థాపకులు డాక్టర్ ఉమ్మడిశెట్టి రాధేయ. నాలుగు పుస్తకాలను 2016 జనవరి 31లోగా ‘రాధేయ, 13-1-606-1, షిర్డినగర్, రెవెన్యూ కాలనీ, అనంతపురం-515001’ చిరునామాకు పంపాలి. ఫోన్: 9985171411
ఫ్రీవర్స్ ఫ్రంట్ కవిత్వ బహుమతులు
గత 45 ఏళ్లుగా ప్రతి యేటా ఉత్తమ వచన కవితాసంపుటికి అవార్డులు యిస్తూవున్న ఫ్రీవర్స్ ఫ్రంట్ సంస్థ గత సంవత్సరానికీ, ఈ సంవత్సరానికీ ఉమ్మడిగా అవార్డుల్ని ప్రకటించింది. 2014 సంవత్సరానికిగానూ తుల్లిమల్లి విల్సన్ సుధాకర్ ‘మాకూ ఒక భాష కావాలి’ ఎంపికైందనీ, 2015కుగానూ ప్రసాదమూర్తి ‘పూలండోయ్ పూలు’ ఎంపికైందనీ శీలా వీర్రాజు తెలియజేస్తున్నారు. ఈ పురస్కారాల్ని డిసెంబర్ 18న దేవరాజు మహారాజు అధ్యక్షతన హైదరాబాద్‌లో జరిగే కార్యక్రమంలో దేవిప్రియ చేతుల మీదుగా అందజేస్తారు.