
ఒకే వేదికపై రతన్ టాటా, మోహన్ భగవత్..
సాక్షి, ముంబై : పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్‌తో ముంబైలో వచ్చే నెల జరగనున్న ఓ కార్యక్రమంలో ఒకే వేదికను పంచుకోనున్నారు. గత నెల నాగపూర్‌లో మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరెస్సెస్ కార్యక్రమంలో పాల్గొన్న నేపథ్యంలో తాజా పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం. రతన్ టాటా, భగవత్ ఆగస్ట్ 24న ముంబైలో నానా పాల్కర్ స్మృతి సమితి నిర్వహించే కార్యక్రమంలో పాల్గొంటారని సంఘ్ ప్రతినిధి వెల్లడించారు.
సంఘ్ ప్రచారక్ నానా పాల్కర్ పేరిట ఈ ఎన్జీవో ఏర్పాటైంది. ముంబైలోని టాటా మెమోరియల్ ఆస్పత్రికి సమీపంలో ఈ సంస్థ ప్రధాన కార్యాలయం ఉంది. ఈ ప్రాంగణం నుంచే క్యాన్సర్ వ్యాధిగ్రస్థులకు సమితి సేవలందిస్తోంది. రతన్ టాటా తమ ప్రాంగణాన్ని సందర్శించారని, సంస్థ కార్యకలాపాల గురించి ఆయనకు అవగాహన ఉందని సంఘ్ ప్రతినిధి పేర్కొన్నారు.