'నీట్' రాయాల్సిందే
దేశవ్యాప్తంగా ఒకటే ఎంబీబీఎస్, బీడీఎస్ ప్రవేశ పరీక్ష
► రెండు విడతలుగా పరీక్ష నిర్వహణకు ‘సుప్రీం’ ఆదేశం
► మే 1న జరిగే ఏఐపీఎంటీ మొదటి విడతగా పరిగణన
► మిగిలిన అభ్యర్థులకు జూలై 24న రెండో విడత నీట్
► రెండు విడతల నీట్ ఫలితాలు ఆగస్టు 17న ప్రకటన
► జాతీయ ర్యాంకుల ఆధారంగా విద్యార్థులకు ప్రవేశాలు
► కేంద్రం, సీబీఎస్ఈ షెడ్యూలుకు సుప్రీంకోర్టు ఆమోదం
► ఏపీ, తెలంగాణ, తమిళనాడు అభ్యంతరాల తిరస్కరణ
► తీర్పును సవాల్ చేయాలంటే సుప్రీంకోర్టుకే రావాలని నిర్దేశం
► పలు రాష్ట్రాలు, కాలేజీల ప్రత్యేక ప్రవేశ పరీక్షలు చెల్లనట్లే
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశానికి ఏకైక ఉమ్మడి ప్రవేశ పరీక్షగా నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్) నిర్వహించటానికి ఎటువంటి అవరోధాలూ లేవని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. ఈ ఏడాది (2016-17 విద్యా సంవత్సరం) ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాలకు గాను దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో రెండు విడతలుగా ‘నీట్’ నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం, సీబీఎస్ఈ, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలు సమర్పించిన షెడ్యూలును అత్యున్నత న్యాయస్థానం గురువారం ఆమోదించింది. ఆ షెడ్యూలు ప్రకారం.. ఇప్పటికే ప్రకటించిన ఏఐపీఎంటీ-2016 నోటిఫికేషన్లో భాగంగా మే 1వ తేదీన నిర్వహించనున్న ‘నీట్’ను తొలి విడతగా
పరిగణించాలని పేర్కొంది.
ఆ పరీక్షకు దరఖాస్తు చేసుకోని వారికి మళ్లీ అవకాశం ఇచ్చి దరఖాస్తులు ఆహ్వానించాలని, వారికి జూలై 24వ తేదీన రెండో విడత ‘నీట్’ నిర్వహించాలని నిర్దేశించింది. ఇలా రెండు విడతలుగా నిర్వహించే నీట్ ఫలితాలను ఆగస్టు 17న ప్రకటించాలని.. తద్వారా కోర్సుల్లో ప్రవేశాల ప్రక్రియను సెప్టెంబర్ 30వ తేదీ నాటికి పూర్తి చేయాలని ఆదేశించింది. నీట్ ఫలితాల్లో సీబీఎస్ఈ జాతీయ స్థాయి ర్యాంకులను ప్రకటిస్తుందని.. దాని ప్రకారం ఆయా రాష్ట్రాల్లో కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వాహకులు జాతీయ స్థాయి మెరిట్ ఆధారంగా అభ్యర్థులను కౌన్సిలింగ్ ప్రక్రియకు పిలుస్తారని పేర్కొంది.
రెండు విడతల నీట్ పరీక్షల నిర్వహణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, పోలీసు యంత్రాంగం, ఇతర శాఖలు సీబీఎస్ఈకి అండగా నిలవాలని చెప్పింది. నీట్ నిర్వహణను తమపై రుద్దజాలరన్న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు తదితర రాష్ట్రాలు, కర్ణాటక మెడికల్ కాలేజీల సంఘం, సీఎంసీ వెల్లూరు వంటి మైనారిటీ సంస్థలు వ్యక్తంచేసిన అభ్యంతరాలను సుప్రీంకోర్టు ధర్మాసనం తోసిపుచ్చింది. తమ ఉత్తర్వులను సవాల్ చేయాలనుకుంటే నేరుగా సుప్రీంకోర్టునే ఆశ్రయించాలని, ఇందులో ఏ హైకోర్టు అయినా జోక్యం చేసుకోజాలదని స్పష్టంచేసింది.
సుప్రీంకోర్టు తాజా ఉత్తర్వుల ప్రకారం.. అన్ని ప్రభుత్వ కాలేజీలు, డీమ్డ్ యూనివర్సిటీలు, ప్రయివేటు మెడికల్ కాలేజీలు నీట్ కిందకు వస్తాయి. ఆయా రాష్ట్రాలు, యూనివర్సిటీల్లో ప్రవేశాల కోసం వేరుగా నిర్వహించిన, నిర్వహించనున్న ప్రవేశ పరీక్షలు రద్దయినట్లే అవుతుంది.
నీట్‌ను ఈ ఏడాదే నిర్వహించాలని.. పలు రాష్ట్రాల్లో ప్రభుత్వ, ప్రయివేటు సంస్థలు నిర్వహించే పరీక్షల వల్ల విద్యార్థులు వ్యయప్రయాసలకు లోనవుతున్నారని, వాటన్నింటిపై స్టే విధించాలని కోరుతూ సంకల్ప్ చారిటబుల్ ట్రస్ట్ అనే స్వచ్ఛంద సంస్థ దాఖలు చేసిన పిటిషన్‌ను.. జస్టిస్ అనిల్ ఆర్ దవే, జస్టిస్ శివ కీర్తి సింగ్, జస్టిస్ ఆదర్శ్‌కుమార్ గోయల్‌లతో కూడిన ధర్మాసనం బుధవారం విచారణకు స్వీకరించింది. గురువారం మధ్యాహ్నం 12 గంటలకు తిరిగి వాదనలు విన్నది. మధ్యాహ్న విరామం అనంతరం ఉత్తర్వులు జారీచేసింది.
ఏపీ, తెలంగాణ అభ్యంతరాల తిరస్కరణ...
కేంద్ర ప్రభుత్వం తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ పింకీ ఆనంద్, ఎంసీఐ తరఫున సీనియర్ న్యాయవాది వికాస్‌సింగ్‌లు హాజరై వాదనలు వినిపించారు. మే 1వ తేదీన జరగనున్న నీట్‌కు 52 నగరాల్లోని 1,040 పరీక్షా కేంద్రాల్లో 6,67,637 మంది హాజరవుతున్నారని తెలిపారు. ఆ పరీక్షను నీట్-1 గా మార్చటం ద్వారా.. ఇప్పటికే పరీక్ష రాయటానికి సిద్ధమైన విద్యార్థుల ప్రయోజనాలను పరిరక్షించవచ్చని పేర్కొన్నారు. అయితే ఈ పిటిషన్లో కేంద్ర ప్రభుత్వంతో పాటు సీబీఎస్ఈ, ఎంసీఐ తదితర ప్రభుత్వ విభాగాలు ప్రతివాదులుగా ఉన్నా కానీ.. నీట్ నిర్వహణపై అభ్యంతరం వ్యక్తంచేస్తున్న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాలు ప్రతివాదులుగా ఉండేందుకు అవకాశం రాలేదు.
గ్రామీణ విద్యార్థులకు అన్యాయం జరుగుతుంది...
అయినప్పటికీ విచారణ సమయంలో ఆంధ్రప్రదేశ్ తరఫున సీనియర్ న్యాయవాది పి.పి.రావు తన వాదనలు వినిపించారు. రాష్ట్రంలో ఆర్టికల్ 371(డి) అమలులో ఉందని, దీని ద్వారా రాష్ట్రానికి ప్రత్యేక హక్కులు సంక్రమించాయని నివేదించారు. ‘నీట్’ పరీక్షను రాష్ట్రంలో అమలుచేయడం సాధ్యం కాదని చెప్పారు. పైగా ప్రవేశ పరీక్షల నిర్వహణ రాష్ట్రాల పరిధిలోని అంశమని, ఇప్పటికే పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని తెలిపారు. ఆయా రాష్ట్రాల్లో నిర్వహించే పరీక్షలు అంగ్ల భాషలో గానీ, మాతృభాషలో గానీ ఉంటాయని.. కానీ నీట్ పరీక్ష ఆంగ్ల, హిందీ భాషలో ఉంటే గ్రామీణ ప్రాంతాల వారికి అన్యాయం జరుగుతుందని వాదించారు.
అన్ని రాష్ట్రాల్లో సీబీఎస్ఈ సిలబస్ లేదని కూడా న్యాయస్థానం దృష్టికి తెచ్చారు. తెలంగాణ తరఫున సీనియర్ న్యాయవాది హరీన్‌రావెల్ కూడా ఇవే వాదనలు వినిపించారు. తెలంగాణకు 371(డి) ఆర్టికల్ ద్వారా ప్రత్యేక హక్కులు సంక్రమిస్తున్నందున నీట్ నిర్వహణ కుదరదని వాదించారు. ఉత్తరప్రదేశ్ న్యాయవాది కూడా నీట్ నిర్వహణను వ్యతిరేకించారు. ఇక తమిళనాడు తరఫున సీనియర్ న్యాయవాది ఎల్.నాగేశ్వరరావు వాదిస్తూ 2007 నుంచి తమిళనాడులో ఎలాంటి ప్రవేశపరీక్షలు నిర్వహించడం లేదని, ఇంటర్ మార్కుల ఆధారంగానే వైద్య విద్యలో ప్రవేశాలు కల్పిస్తున్నారని తెలిపారు. నీట్ కారణంగా విద్యార్థులు నష్టపోతారని వాదించారు.
ఇందులో రాష్ట్రాలు, కళాశాలలు ప్రతివాదులు కాదు...
ఈ దశలో ధర్మాసనం జోక్యం చేసుకుని ఈ పిటిషన్లో కేంద్రం, ఎంసీఐ, సీబీఎస్ఈ మాత్రమే ప్రతివాదులుగా ఉన్నారని, రాష్ట్రాలు గానీ కళాశాలలు గానీ లేవని పేర్కొంది. ఉత్తర్వులను రిజర్వ్‌లో ఉంచుతూ మధ్నాహ్నం 3.30 గంటలకు వెలువరించింది. రెండు విడతలుగా నీట్ నిర్వహణకు కేంద్రం ఇచ్చిన షెడ్యూలును ఆమోదించింది. దేశవ్యాప్తంగా ఏకైక ఉమ్మడి ప్రవేశపరీక్ష (నీట్) నిర్వహణకు కేంద్ర ప్రభుత్వం 2010 డిసెంబర్ 21న ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేస్తూ 2013 జూలై 18న సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో.. ఇప్పుడు మళ్లీ దేశవ్యాప్తంగా నీట్ నిర్వహణ సరికాదన్న వాదనను ధర్మాసనం తోసిపుచ్చింది. అప్పటి తీర్పును తాము ఈ ఏడాది ఏప్రిల్ 11న ఉపసంహరించినందున.. 2010 డిసెంబర్ నాటి కేంద్ర ప్రభుత్వ నోటిఫికేషన్ ఇప్పటికే అమలులో ఉన్నట్లే అవుతుందని పేర్కొంది.
‘‘క్రిస్టియన్ మెడికల్ కాలేజ్, వెల్లూరు అండ్ అదర్స్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అండ్ అదర్స్ కేసులో తీర్పును చూపుతూ ప్రస్తుత పిటిషన్‌తో సంబంధం లేని సంస్థలు (రాష్ట్రాలు, వైద్య కళాశాలలు) నీట్ నిర్వహణ సరికాదని, ఈ ఉత్తర్వులు పెండింగ్ విచారణలపై ప్రభావం చూపరాదని అభ్యర్థించాయి. అయితే మేం వారు చెప్పిన అంశంతో ఏకీభవించడం లేదు. ఆ తీర్పును 11.04.2016 నే రీకాల్ చేసినందున 21.12.2010 నాటి నోటిఫికేషన్ ప్రస్తుతం అమల్లో ఉంది’’ అని పేర్కొంది. కాబట్టి ఇక నీట్ నిర్వహణకు ఎటువంటి ఆటంకాలూ ఉండబోవని అభిప్రాయపడింది.
‘నీట్’ నిర్వహించరాదని గతంలో ఏ కోర్టు ఉత్తర్వులు జారీచేసినా వాటితో సంబంధం లేకుండా.. ప్రస్తుత ఉత్తర్వులు మాత్రమే అమల్లో ఉంటాయని స్పష్టం చేసింది. అయితే.. ఈ తీర్పు ఇప్పటికే సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉన్న పిటిషన్ల విచారణపై ప్రభావం చూపబోదని వివరణ ఇచ్చింది. ఈ ఉత్తర్వులపై ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు మరోసారి స్పష్టత కోసం పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి.
విజయవంతంగా నీట్ నిర్వహిస్తాం: కేంద్రం
సుప్రీంకోర్టు నిర్దేశించిన ప్రకారం దేశవ్యాప్తంగా ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సులకు ఏకైక ప్రవేశ పరీక్ష నీట్‌ను రెండు విడతలుగా నిర్వహించేందుకు తాము సంసిద్ధంగా ఉన్నామని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది. ఈ పరీక్ష నిర్వహణకు పలు సవాళ్లు ఉన్నప్పటికీ దీనని విజయవంతంగా నిర్వహించేందుకు కొంత కాలంగా ఏర్పాట్లు కొనసాగిస్తున్నామని ఆరోగ్యమంత్రి జె.పి.నడ్డా.. సుప్రీంకోర్టు ఆదేశాల అనంతరం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కోర్టు ఆదేశాలను ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు.