షెడ్యూల్ ప్రకారమే నీట్ పరీక్ష
న్యూఢిల్లీ : షెడ్యూల్ ప్రకారమే నీట్ పరీక్ష నిర్వహించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశానికి ఏకైక ఉమ్మడి ప్రవేశ పరీక్షగా నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్) నిర్వహించాల్సిందేనని ఉన్నత న్యాయస్థానం నిన్న ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం శుక్రవారం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
తొలి విడత నీట్ నిర్వహణపై మార్పు చేయాలన్న విజ్ఞప్తిని న్యాయస్థానం తోసిపుచ్చింది. మే 1వ తేదీన నిర్వహించే తొలివిడత పరీక్షపై స్టే విధించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. నిన్నటి ఆదేశాల ప్రకరమే షెడ్యూల్ ఉంటుందని స్పష్టీకరించింది. అలాగే ఉత్తర్వుల్లో సవరణలు కోరుతున్న వారినుంచి న్యాయస్థానం దరఖాస్తుల కోరింది. దరఖాస్తులు అందాక సరైన సమయంలో విచారణ చేపడతామని కోర్టు వెల్లడించింది..