Common Problems
-
చిన్నవాణ్ని పెళ్లాడితే... సమస్యలు వస్తాయా?
నా వయసు 24. ఏడాదిన్నర క్రితం పెళ్లయ్యింది. ఈ మధ్య నెలసరి తప్పడంతో డాక్టర్ దగ్గరకు వెళ్లాను. గర్భం దాల్చానని, మూడో నెల అని చెప్పారు డాక్టర్. కానీ స్కాన్ చేసిన తర్వాత ముత్యాల గర్భం, వెంటనే తీయించేసుకుంటే మంచిది అన్నారు. బిడ్డను కనాలని ఎంతో ఆశపడుతున్న నాకు ఆ మాట చాలా బాధ కలిగించింది. ముత్యాలగర్భం అసలెందుకు వస్తుంది? అది అంత ప్రమాదకరమా? తీయించేసుకోవడం తప్ప మరో మార్గం లేదా? - పి.రాగిణి, తూప్రాన్ పిండం గర్భాశయంలో పెరగకుండా చిన్న చిన్న ముత్యాల వంటి నీటి బుడగలుగా మాయ పెరుగుతూ పోవడాన్ని ముత్యాల గర్భం లేదా మోలార్ ప్రెగ్నెన్సీ అంటారు. కొందరి శరీర తత్వాన్ని బట్టి ఈ గర్భం చాలా త్వరగా పెరిగిపోతూ... గర్భాశయం బయటికి, ఇతర అవయవాలకి కూడా పాకడం జరుగుతుంది. దాన్ని అలానే వదిలేస్తే కడుపులో విపరీతమైన నొప్పి రావడంతో పాటు బ్లీడింగ్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. ఇందులో బిడ్డ పెరిగే అవకాశం లేదు కాబట్టి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా దీన్ని తీయించేసుకోవడం మంచిది. కొంతమందిలో అయితే దీన్ని ఒక్కసారే తీసేయడం వీలు కాదు. మొదట కొంత తీసి, తర్వాత మరోసారి తీయాల్సి వస్తుంది. మరికొంతమందికి అయితే తీసేసిన తర్వాత మళ్లీ గర్భాశయం లోపల పెరిగే అవకాశం ఉంటుంది. అందుకని ముత్యాల గర్భం తీసేసిన తర్వాత కనీసం ఆరు నెలల పాటు డాక్టర్ పర్యవేక్షణలో ఉండి... స్కానింగ్, బీహెచ్‌సీజీ బ్లడ్ టెస్ట్ వంటి పరీక్షలన్నీ క్రమం తప్పకుండా చేయించుకుంటూ చికిత్స తీసుకోవాలి. అలాగే ముత్యాల గర్భం పెరిగేటప్పుడు గర్భాశయం బాగా సాగి మెత్తగా అయిపోతుంది. దాంతో తీసేటప్పుడు అధిక రక్తస్రావం కావడం, గర్భాశయానికి చిల్లు పడటం వంటి సమస్యలు తలెత్తవచ్చు. అంతే కాదు, ఇరవై ఎనిమిది శాతం మందిలో ఈ గర్భం ఒక్కసారి వస్తే, మరోసారి వచ్చే అవకాశాలూ ఉన్నాయి. కాబట్టి ముత్యాల గర్భం అని తెలియగానే ముందు నుంచే డాక్టర్ పర్యవేక్షణలో ఉండి, స్కానింగ్ ద్వారా గర్భం ఎలా పెరుగుతుందో నిర్ధారించుకోవడం మంచిది. 0.5 శాతం మందిలో కొరియోపార్శినోమా అనే క్యాన్సర్ వచ్చే అవకాశాలూ ఉంటాయి. అందుకే ఓసారి ముత్యాల గర్భం వచ్చిన తర్వాత మళ్లీ సంవత్సరం వరకు గర్భం రాకుండా చూసుకోవడం మంచిది.ముత్యాల గర్భం రావడానికి కారణాలు పూర్తిగా నిర్ధారణ కాలేదు. పిండం ఏర్పడే సమయంలో నిర్వీర్యమైన అండంలో శుక్ర కణం ఫలదీకరణ చెందడం వల్ల... లేదా అండంలో రెండు శుక్రకణాలు ఫలదీకరణ చెందడం వల్ల ఇది రావొచ్చని అంచనా. అలాగే జన్యుపరమైన లోపాల వల్ల కూడా పిండం పెరగకుండా సంపూర్ణ ముత్యాల గర్భం ఏర్పడుతుంది. కొందరిలో బిడ్డతో పాటు మాయ కూడా ముత్యాల లాగా పెరుగుతుంది. కానీ బిడ్డ సరిగ్గా ఎదగకపోవడం, అవయవ లోపాలతో ఉండటం వంటివి జరుగుతాయి. దీన్ని అసంపూర్ణ ముత్యాల గర్భం అంటారు. మన దేశంలో ప్రతి నాలుగొందల మందిలో ఒకరికి ముత్యాల గర్భం రావొచ్చు. టీనేజీలో గర్భం దాల్చిన వారిలో, నలభయ్యేళ్లు పైబడిన వారిలో ఎక్కువగా రావొచ్చు. పర్యావరణ మార్పులు, ఏబీ బ్లడ్ గ్రూప్, మాంస కృత్తుల లోపం, విటమిన్ ఎ లోపం, వ్యాధి నిరోధక వ్యవస్థలో మార్పుల వల్ల కూడా ముత్యాల గర్భం ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి. నా వయసు 22. మేనమావను పెళ్లి చేసుకున్నాను. పెళ్లయిన ఏడు నెలలకే గర్భం దాల్చాను. ఎనిమిదో నెల వచ్చాక హఠాత్తుగా నొప్పులు వస్తే ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఏదో ఇంజెక్షన్ చేసి... హైబీపీ వచ్చిందని, పరిస్థితి ప్రమాదకరమని చెప్పారు. అంతలోనే బిడ్డ కడుపులోనే చనిపోయిందని చెప్పి ఆపరేషన్ చేసి తీసేశారు. ఇలా ఎందుకు జరిగింది అంటే బీపీ వల్ల అంటున్నారు. అదేదో గుర్రపు వాతమని కూడా చెబుతున్నారు. నాకేమీ అర్థం కావడం లేదు. అసలు నాకేమయ్యిందో మీరేమైనా అంచనా వేయగలరా? బీపీ వల్లే బిడ్డ చనిపోతుందా - శ్రీదేవి, రంపచోడవరం కొంతమందికి గర్భం దాల్చిన తర్వాత... వారి శరీర తత్వాన్ని బట్టి, బరువును బట్టి, హార్మోన్లలో మార్పులు, జన్యుపరమైన కారణాలు, రక్తనాళాలు సంకోచించడం వంటి పలు కారణాల వల్ల బీపీ పెరుగుతుంది. బీపీ ఎక్కువగా పెరిగేసరికి రక్తనాళాలు ఇంకా సంకోచించి... కిడ్నీ, మెదడు వంటి కీలకమైన అవయవాలకు రక్త ప్రసరణ తగ్గి, ఆ అవయవాలు దెబ్బతింటాయి. దానివల్ల యూరిన్‌లో ఆల్బుమిన్ పోవడం, ఫిట్స్ రావడం, ఒళ్లంతా నీరు చేరడం, కోమాలోకి వెళ్లిపోవడం వంటివి జరగవచ్చు. దీనినే ఎక్లాంప్సియా లేక గుర్రపువాతం అంటారు. బీపీ పెరిగేకొద్దీ కొందరిలో కిడ్నీలు దెబ్బతినడం, కళ్లు కనిపించకపోవడం, లివర్ పనితీరు దెబ్బతినడం, ప్లేట్లెట్స్ తగ్గిపోయి రక్తస్రావం జరగడం వంటి సమస్యలు తలెత్తి ప్రాణాపాయ స్థితి కూడా ఏర్పడ వచ్చు. రక్తనాళాలు సంకోచించడం వల్ల గర్భాశయంలోని శిశువుకి రక్త ప్రసరణ తగ్గిపోయి బిడ్డ బరువు పెరగకపోవడం, ఉమ్మనీరు తగ్గిపోవడం, బిడ్డ కడుపులోనే చనిపోవడం వంటివి జరగవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో గర్భంలోని శిశువును బయటకు తీస్తేనే గానీ తల్లి పరిస్థితి మెరుగు పడదు. మీరు చెప్పినదాన్ని బట్టి చూస్తే మీ విషయంలో ఇదే జరిగింది. రక్తనాళాలు సంకోచించడం వల్ల గర్భాశయంలోని శిశువుకి రక్త ప్రసరణ తగ్గిపోయి బిడ్డ బరువు పెరగకపోవడం, ఉమ్మనీరు తగ్గిపోవడం, బిడ్డ కడుపులోనే చనిపోవడం వంటివి జరగవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో గర్భంలోని శిశువును బయటకు తీస్తేనే గానీ తల్లి పరిస్థితి మెరుగు పడదు. నా వయసు 31. మావారికి 32. పెళై్ల ఆరేళ్లు అయ్యింది. ఇంతవరకూ పిల్లలు పుట్టలేదు. నాకు ఎప్పుడూ పెరుగులాంటి చిక్కటి వైట్ డిశ్చార్జి అవుతూనే ఉంటుంది. కలయిక సమయంలో కూడా విపరీతమైన కడుపునొప్పి వస్తూ ఉంటుంది. ఎన్ని మందులు వాడినా ఫలితం లేదు. నాకేదైనా సమస్య ఉందేమో, ఇక పిల్లలు పుట్టరేమో అనిపిస్తోంది. మరెవరినైనా పెళ్లి చేసుకొమ్మంటే మావారు వినడం లేదు. పిల్లలు లేకపోయినా నాతోనే ఉంటానంటున్నారు. ఆయన్ని తండ్రిని చేసే మార్గం ఉంటే - ఆర్.దేవిక, వెల్తూరు పెరుగులాంటి చిక్కని వైట్ డిశ్చార్జి అంటే చాలావరకు అది ఫంగల్ ఇన్ఫెక్షనే అయి ఉండవచ్చు. ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు కలయిక సమయంలో నొప్పి ఉండొచ్చు. మందులు వాడినా తగ్గట్లేదు అంటున్నారు కాబట్టి... మీరిద్దరూ కూడా నెల రోజుల పాటు యాంటి ఫంగల్ మందులు వాడుతూ, కలయికకు దూరంగా ఉండండి. తెలుపు అవ్వడం తగ్గాక కలవండి. మీరు స్పెక్యులమ్ ఎగ్జామ్, వెజైనల్ స్వాబ్ కల్చర్, షుగర్ టెస్ట్, సీబీపీ వంటి పరీక్షలు చేయించుకుంటే... ఇన్ఫెక్షన్ ఎటువంటిదో తెలుస్తుంది. దాన్ని బట్టి తగిన మందులు వాడవచ్చు. కొందరిలో రక్తహీనత, మధుమేహం వంటి వాటి వల్ల కూడా మాటిమాటికీ ఇన్ఫెక్షన్ వస్తూ ఉంటుంది. మీకు అవేమైనా ఉంటే వాటికి కూడా చికిత్స తీసుకోండి. కారణం తెలియకుండా ఎక్కువగా యాంటీ బయొటిక్స్ వాడటం వల్ల యోనిలో ఉండే ల్యాక్టోబాసిలీ అనే మంచి బ్యాక్టీరియా నశిస్తుంది. రోగాలను తెచ్చే క్రిములు, బ్యాక్టీరియా, ఫంగస్‌ను అరికట్టే లక్షణాలు దీనికి ఉంటాయి. అది నాశనం కావడం వల్ల ఫంగల్ ఇన్ఫెక్షన్లు రావొచ్చు. చికిత్సలో భాగంగా ల్యాక్టోబాసిలీ ఉండే మందులు, క్రీములు, వెజైనల్ వాష్‌ను వాడాల్సి ఉంటుంది. మీవారికి కూడా షుగర్ టెస్టులవీ చేయించండి. ఆయనకు షుగర్ ఉన్నా కూడా ఒకరి నుంచి ఒకరికి మాటి మాటికీ ఇన్ఫెక్షన్లు సోకుతూ ఉంటాయి. ఓసారి పూర్తిగా చికిత్స తీసుకున్న తర్వాత, పిల్లల గురించి మీకే సమస్యలు ఉన్నాయో వాటి విషయమై డాక్టర్‌ను సంప్రదించండి. అవసరమైన పరీక్షలు చేసి, తర్వాత ఏం చేయాలో చెబుతారు. అసలు డాక్టర్నే కలవకుండా, ఏ రకమైన చికిత్సా తీసుకోకుండా... మీకు మీరే పిల్లలు పుట్టరని నిర్ధారించేసుకుంటే ఎలా?! నా వయసు 23. నేనో అబ్బాయిని ప్రేమించాను. కానీ తర్వాత తెలిసింది తను నాకంటే ఏడాదిన్నర చిన్నవాడని. దాంతో నేను దూరమైపోవాలనుకున్నాను. కానీ తనకేమీ అభ్యంతరం లేదని, నాతోనే కలిసి బతకాలనుకుంటున్నానని ఆ అబ్బాయి అంటున్నాడు. అయితే విషయం తెలిసి మా ఇంట్లోవాళ్లు, వాళ్ల ఇంట్లోవాళ్లు కూడా కోప్పడ్డారు. మేం మాత్రం ఒకరినొకరు కావాలనుకుంటున్నాం. జీవితంలో సెటిలయ్యాక ఒక్కటవ్వాలనుకుంటున్నాం. మేం పెళ్లి చేసుకోవచ్చా? లేక మావాళ్లు అన్నట్టు ఏవైనా సమస్యలు వస్తాయా? ఓ సోదరి, ధవళేశ్వరం మీ ఇద్దరి మనసులూ కలిసి, ఒకరికొకరు నచ్చిన తర్వాత... వయసు పెద్ద సమస్య కాదు. అంతకంటే చిన్నవాళ్లను చేసుకున్న వాళ్లు కూడా ఉన్నారు. కాబట్టి తను ఏడాదిన్నర చిన్నవాడని ఆలోచించాల్సిన అవసరం లేదు. జీవితంలో సెటిలయ్యాక పెళ్లి అంటున్నారు కాబట్టి ఇంకా సమయం ఉంది కదా! ఈ లోపల పరిస్థితులు ఎలా ఉంటాయో చూడండి. మీ పెద్దవాళ్లను మెల్లగా ఒప్పించడానికి ప్రయత్నం చేయండి. అంతవరకు మీ ఆలోచనల్లో ఏ మార్పూ రాకుండా ఉంటే, మీ ప్రేమ అప్పటి కూడా ఇంతే దృఢంగా ఉంటే... నిరభ్యంతరంగా పెళ్లి చేసుకోవచ్చు. ఏడాదిన్నర చిన్నవాణ్ని చేసుకున్నంత మాత్రాన శారీరకంగా, ఆరోగ్యపరంగా ఎటువంటి సమస్యలూ రావు. కాబట్టి హ్యాపీగా పెళ్లి చేసుకోండి. ఆల్ ద బెస్ట్. డా వేనాటి శోభ లీలా హాస్పిటల్ మోతీనగర్, హైదరాబాద్ -
చాడీలు చెప్తోంది... మాన్పించేదెలా?
మా పాప వయసు పదేళ్లు. తను చాడీలు బాగా చెబుతోంది. నేను అన్నది వాళ్ల నాన్నకి, ఆయనన్నది నాకు, మా ఇద్దరి మీదా వాళ్ల తాతగారికి... ఇలా చెబుతూనే ఉంటుంది. స్కూలు టీచర్ల మీద, సాటి విద్యార్థుల మీద కూడా చెబుతూ ఉంటుంది. పైగా ఒక్కోసారి లేనివి కల్పించి చెబుతోంది. తనతో ఈ అలవాటు ఎలా మాన్పించాలి? - కృష్ణకుమార్, ఏలూరు ఈ అలవాటు ఇలా కంటిన్యూ అవ్వడం మంచిది కాదు. ఇవాళ ఇంట్లో చేస్తోంది. తరువాత బయట కూడా చేస్తుంది. కాబట్టి వెంటనే ఈ అలవాటును మాన్పించాలి. అది మీ చేతుల్లోనే ఉంది. తను ఇంట్లో ఎవరి మీద ఏం చెప్పినా ఎవరూ వినకండి. అసలు పట్టించుకోకండి. తను ఏదైనా చెప్పడం మొదలు పెట్టగానే మౌనంగా లేచి వెళ్లిపోండి. ఇంట్లోని ప్రతి ఒక్కరూ ఇలానే చేస్తే తర్వాత తనే ఆలోచిస్తుంది. ఏం చెప్పినా ఎవరూ వినరని అర్థమై చెప్పడం మానేస్తుంది. కాకపోతే దీనికి కాస్త సమయం పట్టవచ్చు. ఓపిగ్గా ప్రయత్నించండి. అలా కాకుండా మీరు కోప్పడినా, కొట్టినా, బెదిరించినా... ఆ పని మీ దగ్గర చేయడం మానేసి, బయట చేయడం మొదలు పెడుతుంది. కాబట్టి జాగ్రత్త! నేనూ మావారూ నాలుగున్నరేళ్ల క్రితం విడాకులు తీసుకున్నాం. మా ఐదేళ్ల బాబు నాతోనే ఉంటున్నాడు. అయితే ఈ మధ్య తరచూ వాళ్ల నాన్నను అడుగుతున్నాడు. మా అమ్మానాన్నలేమో బాబుని మావారి దగ్గరకు పంపడానికి ఇష్టపడరు. వాడేమో తరచూ నాన్న ఏడి? అంటుంటాడు. వాడికేది మంచిదో నాకు అర్థం కావడం లేదు. సలహా చెప్పండి. - ఓ సోదరి తల్లిదండ్రులు విడిపోయినా, సామ రస్యంగా ఉండక పోయినా ఎక్కువగా నష్టపోయేది పిల్లలే. అతిగా గొడవ పడకుండా, సంతోషంగా కలిసి మెలిసి ఉండే తల్లి దండ్రుల వద్ద పెరగడం పిల్లలకు చాలా మంచిది. కానీ ఏ కారణాల వల్ల అయినా అది వీలుకానప్పుడు, తల్లిదండ్రులు విడి పోయినప్పుడు పిల్లల గురించి తప్పక ఆలోచించాలి. పిల్లల జీవితాల్లో తల్లి దండ్రులిద్దరూ ఉండటం మంచిది. ఇద్దరూ కలిసి పిల్లల బాధ్యతను నిర్వర్తించడం మంచిది. ఒకరి మీద ఒకరు కోపంతో పిల్లలను దూరం చెయ్యడం వల్ల కానీ, పిల్లల మనసును విరి చెయ్యడం వల్ల కానీ ఏ ఉప యోగం ఉండదు సరికదా, పిల్లల మనసులపై అది దుష్ర్పభావం చూపిస్తుంది. మీరు మీ వ్యక్తిగత ద్వేషా లను, కోపాలను పక్కన పెట్టి ఆలోచించండి. ఆయన ఓ తండ్రిగా బాధ్యతగా ఉండే వ్యక్తే అయితే, ఆయన దగ్గరకు బాబును అప్పు డప్పుడూ పంపించండి. ఇద్దరినీ కలిసి సమయం గడపనివ్వండి. తనకు అమ్మానాన్నా ఇద్దరూ ఉన్నారన్న ఆనందం బాబు అభివృద్ధికి తోడ్పడుతుంది. అలాగే మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ తండ్రి గురించి బాబు దగ్గర చెడుగా మాట్లాడకండి. మీ తల్లిదండ్రులను కూడా మాట్లాడనివ్వ కండి. బాబు భవిష్యత్తుకు, మానసిక ఎదుగుదలకు అది ఎంతైనా అవసరం. మా అబ్బాయి ఆరో తరగతి చదువు తున్నాడు. చాలా బాగా చదువుతాడు. కానీ ఈ మధ్య వాడితో ఒక ఇబ్బంది వచ్చి పడింది. సైన్సు పాఠాలపై చాలా ఆసక్తి చూపిస్తున్నాడు. స్కూల్లో ఏవైనా ప్రయోగాల గురించి చెబితే ఇంటికి వచ్చి వాటిని చేయడానికి ట్రై చేస్తున్నాడు. ఈ మధ్య యాసిడ్‌తో ఏదో చేస్తుంటే చూసి అడిగాను. స్కూల్లో చెప్పిన సైన్స్ ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాను అన్నాడు. అలాగే కరెంటుతో కూడా ఏదో చేస్తుంటే నా భార్య చూసి అడ్డుకుంది. ఈ అత్యుత్సాహం వల్ల ఏదైనా ప్రమాదం కొని తెచ్చుకుంటా డేమోనని భయమేస్తోంది. ఏం చేయాలి? వాడు అలా చేయడం కరెక్టేనంటారా? లేక అదేమైనా సమస్యా? - శివరామ్, చెన్నై మీ అబ్బాయి స్కూల్లో చెప్పిన ప్రయో గాలు ట్రై చేయడం మంచి విషయమే. మీకు తను సేఫ్‌గా చేస్తున్నాడో లేదో అని అనుమానం వస్తే... మీరు కూడా బాబుతో ఉండండి. ప్రయోగాలు చేస్తున్నప్పుడు దగ్గరుండి పర్యవేక్షించండి. తనకు సేఫ్టీ గురించి వివరించి చెప్పండి. యాసిడ్, విద్యుత్ లాంటి వాటితో ప్రయోగాలు చేసేటప్పుడు పెద్దవాళ్లకు చెప్పమని, ఎవరో ఒకరిని దగ్గర ఉంచుకుని చేయ మని వివరించండి. లేదంటే ఎలాంటి ఇబ్బందులు ఎదురు కావొచ్చో వివరిం చండి. అంతే తప్ప బాబు ఉత్సాహాన్ని నీరుగార్చడం మంచిది కాదు. ఈరోజు తను చేసే ప్రయోగాలు రేపు తనని గొప్ప సైంటిస్టును చేయవచ్చేమో. కాబట్టి చక్కగా ప్రోత్సహించండి. ఇదేమీ మానసిక సమస్య కాదు. కాబట్టి చింతించకండి. -
ఆయన చెప్పే కారణం... సరైనదేనా?!
నా వయసు 21. పెళ్లై సంవత్సరం కావస్తోంది. మావారికి ఇద్దరు భార్యలు. నేను రెండో భార్యని. అయినా నన్ను బాగానే చూసుకుంటారు. కాకపోతే కలిసేటప్పుడు కండోమ్ వాడుతుంటారు. నాకు పిల్లలు కావాలి, కండోమ్ వాడొద్దు అని చెప్పాను. కానీ ఆయన... ఇద్దరితోనూ కలుస్తాను కదా, హెచ్ఐవీ వచ్చే అవకాశాలు ఉంటాయి, అందుకే కండోమ్ తప్పక వాడాలి అంటున్నారు. అది నిజమేనా? నాకు తల్లిని కావాలన్న కోరిక బలంగా ఉంది. ఇప్పుడు నేనేం చేయాలి? - స్వీటీ, మెయిల్ హెచ్ఐవీ ఇన్ఫెక్షన్ మీ ఆయనకో, ఆయన మొదటి భార్యకో ఉంటే... మీరు మీవారితో కలవడం వల్ల వస్తుంది. అంతే కానీ మీ ముగ్గురిలో ఎవరికీ హెచ్ఐవీ లేకపోతే ఇంకెక్కడి నుంచి వస్తుంది? కండోమ్స్ వాడటం వలన ఇంకా వేరే ఇన్ఫెక్షన్లు ఏమైనా వాళ్లిద్దరిలో ఉన్నా కూడా, అవి మీకు రాకుండా ఉంటాయి. మీవారు మీకు చెబుతున్నదాంట్లో వాస్తవం లేదు. ఆయన అలా చెప్పడానికి వేరే కారణాలు ఏవో ఉన్నాయని నాకు అనిపిస్తోంది. కాబట్టి మీకు పిల్లలు కావాలనిపిస్తే అతనితో మనసు విప్పి మాట్లాడండి. ఎందుకంటే అతనికి మీతో పిల్లలు కనాలన్న కోరిక అసలు ఉందో లేదో! లేకపోవడం వల్లే అలా ఇన్ఫెక్షన్ సాకు పెట్టుకుని కండోమ్స్ వాడుతున్నారేమోనన్న విషయం మనకు తెలియాలి కదా! ఒకవేళ ఆయనకు ఏ అభ్యంతరం లేకపోతే... ఏవైనా ఇన్ఫెక్షన్లు ఉన్నాయేమో మీరిద్దరూ ముందు పరీక్షలు చేయించుకోండి. ఏమీ లేకపోతే కండోమ్ లేకుండా ధైర్యంగా కలవండి. తద్వారా గర్భం ధరించేందుకు అవకాశం ఏర్పడుతుంది. మీవారు మీకు చెబుతున్నదాంట్లో వాస్తవం లేదు. ఆయన అలా చెప్పడానికి వేరే కారణాలు ఏవో ఉన్నాయని నాకు అనిపిస్తోంది. కాబట్టి మీకు పిల్లలు కావాలనిపిస్తే అతనితో మనసు విప్పి మాట్లాడండి. ఎందుకంటే అతనికి మీతో పిల్లలు కనాలన్న కోరిక అసలు ఉందో లేదో! నేను ఓ ప్రైవేటు కంపెనీలో పని చేస్తున్నాను. వయసు 29. నాకు ఎండో మెట్రియాసిస్ ఉంది. మందులు వాడుతున్నాను. ఈమధ్యే ఎక్కడో చదివాను... ఎండో మెట్రియాసిస్ ఉన్నవాళ్లకు కొన్ని రకాల క్యాన్సర్లు తేలికగా వస్తాయి అని. అది నిజమేనా? వస్తే ఎలాంటి క్యాన్సర్లు వస్తాయి? అసలు రాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవడం అవసరం? - ప్రీతి, హైదరాబాద్ ఎండో మెట్రియాసిస్ అనేది గర్భాశయం లోపల ఉండే పొర. అది అక్కడే కాకుండా మిగతా చోట్ల కూడా... అంటే పొత్తి కడుపులో, అండాశయాల పైన, పేగుల పైన, మూత్రాశయం పైన చిన్నగా పాతుకుని ఉంటుంది. ప్రతినెలా బ్లీడింగ్ అయినట్లే అక్కడ కూడా కొద్దిగా బ్లీడింగ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. అక్కడ ఆ రక్తం కొద్దికొద్దిగా గడ్డ కట్టడం వల్ల చుట్టూ ఉన్న అవయవాలు దగ్గరకు చేరి, అతుక్కుపోవడం జరగవచ్చు. ఈ ఎండోమెట్రియాసిస్ పొర పైన ఈస్ట్రోజన్ ప్రభావం దీర్ఘకాలంగా ఎక్కువ నిష్పత్తిలో పని చేసినప్పుడు కొందరిలో క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అయితే అది అరుదుగానే జరుగుతుంది. పిల్లలు లేనివారు, అధిక బరువు ఉండేవారు, రక్తంలో ఈస్ట్రోజన్ ఎక్కువ ఉన్నవారు, ఈస్ట్రోజన్ హార్మోన్ రీప్లేస్మెంట్ దీర్ఘకాలంగా చేయించుకున్నవారిలోనూ ఇలా ఎక్కువగా జరుగుతుంది. ఈస్ట్రోజన్ హార్మోన్ వల్ల ఎండో మెట్రియల్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్ వంటివి కొందరిలో ఎలా వస్తుంటాయో... అలాగే ఎండో మెట్రియాసిస్ ఉన్నవారిలో కూడా 1-2 శాతం మందిలో క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంటాయి. తరచుగా చెకప్, వెజైనల్ స్కానింగ్, అవసరమైతే ఇ్చ 125 లాంటి రక్త పరీక్షలు చేయించుకోవడం మంచిది. అవసరాన్ని బట్టి ఓరల్ కాంట్రాసెప్టివ్ పిల్స్ ఎక్కువ కాలం వాడటం మంచిది. ఎందుకంటే ఇవి ఎండో మెట్రియాసిస్ను యాక్టివ్ అవ్వకుండా అణచి వేస్తాయి. అలాగే అవసరమైతే ల్యాపరోస్కోపి ద్వారా నిర్ధారణ చేసుకుని, ఎండోమెట్రియాసిస్ ఆపరేషన్ కూడా చేయించేసుకోవచ్చు. మా పాప వయసు పదహారేళ్లు. మూడేళ్ల క్రితం మెచ్యూర్ అయ్యింది. అప్పుడు బ్లీడింగ్ చాలా ఎక్కువ అయ్యింది. ఎంతకీ ఆగకపోవడంతో హాస్పిటల్‌కి తీసుకెళ్లాం. రక్తం చాలా తక్కువ ఉంది, ప్లేట్లెట్ కౌంట్ కూడా చాలా తక్కువ ఉంది అన్నారు. ఆ సమస్య పేరు Thrombo cytopenia అని చెప్పారు. Wysolone ట్యాబ్లెట్స్ ఇచ్చారు. అప్పటి నుంచి పీరియడ్స్ వచ్చిన ప్రతిసారీ ఆ ట్యాబ్లెట్ వేస్తేనే బ్లీడింగ్ ఆగుతోంది. లేకపోతే అవుతూనే ఉంటోంది. ఈ సమస్యకు పరిష్కారం ఏమిటి? - పద్మావతి, మందమర్రి Thrombo cytopenia అంటే రక్తంలో ప్లేట్లెట్స్ తక్కువగా ఉండటం. రక్తంలో అనేక రకాల కణాలు ఉంటాయి. వాటిలో ఒక రకమైన కణాలనే ప్లేట్లెట్స్ అంటారు. వీటివల్ల రక్తానికి గడ్డకట్టే గుణం ఏర్పడుతుంది. ఇవి కనుక తక్కువ ఉంటే... చిన్న దెబ్బ తగిలి బ్లీడింగ్ మొదలైనా అది ఆగకుండా అవుతూనే ఉంటుంది. అనేక కారణాల వల్ల రక్తంలో ప్లేట్లెట్స్ తగ్గిపోవచ్చు. కొంతమందిలో అయితే ప్లేట్‌లెట్స్‌ను నాశనం చేసే యాంటి బాడీస్ రక్తంలో తయారవుతూ ఉంటాయి. ఈ యాంటీ బాడీస్ తయారు కాకుండా Wysolone ట్యాబ్లెట్స్ అడ్డుపడుతూ ఉంటాయి. మీరు ఓసారి మీ పాపను మంచి హెమటాలజిస్టుకు చూపించి, అన్ని రకాల పరీక్షలూ చేయించండి. పాపలో ప్లేట్లెట్స్ తక్కువగా ఉండటానికి కారణం ఏమిటో తెలుసుకుని, చికిత్స చేస్తారు. అయితే ఇటువంటి సమస్యలకు దీర్ఘకాలం చికిత్స తీసుకోవాల్సి వస్తుంది. నా వయసు 25. బరువు 58 కిలోలు. మావారి వయసు 40. మాకు పెళ్లై ఆరేళ్లయ్యింది. కానీ ఇంతవరకూ పిల్లలు లేరు. నాకు పీసీఓడీ ఉంది. ల్యాపరోస్కోపీ, హిస్టరోస్కోపీ, మూడుసార్లు ఐయూఐ చేశారు. మా వారికి షుగర్ ఉంది కానీ ఎప్పుడూ కంట్రోల్లోనే ఉంటుంది. కాకపోతే ఆయన స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉందట. అలాగే వీర్యంలో ఇన్ఫెక్షన్ కూడా ఉందని అంటున్నారు డాక్టర్. ఇప్పుడు మేమేం చేయాలి? ఏం చేస్తే పిల్లలు కలుగుతారు? - స్వాతి, నల్గొండ కొంతమందిలో షుగర్ వల్ల స్పెర్మ్ కౌంట్ తక్కువ ఉండవచ్చు. మరికొంత మందిలో ఇన్ఫెక్షన్ వల్ల కూడా వీర్యకణాల సంఖ్య తక్కువ ఉండటం, వాటి కదలిలు సరిగ్గా లేకపోవడం, వాటిలో నాణ్యత లేకపోవడం వంటివి జరగవచ్చు. మీవారి సీమన్ కల్చర్ చేయిస్తే... అందులో ఏ ఇన్ఫెక్షన్ ఉంది, అది ఏ మందులతో తగ్గుతుంది అనేది తెలుస్తుంది. దాన్నిబట్టి మందులు వాడవచ్చు. ఇన్ఫెక్షన్ పూర్తిగా తగ్గిపోయిన తర్వాత వీర్యకణాల సంఖ్య, కదలిక, నాణ్యత పెరగవచ్చు. అలాగే కొందరిలో హార్మోన్ల తేడా వల్ల లేదా వృషణాల్లో వాపు, వేరికోసిల్ వంటి సమస్యల వల్ల కూడా స్పెర్మ కౌంట్ తగ్గవచ్చు. కాబట్టి ఓసారి మీవారిని డాక్టర్‌కి చూపించి, అవసరమైన పరీక్షలు చేయించి, తగిన చికిత్స ఇప్పించండి. మూడు నెలల వ్యవధి తీసుకుని, తర్వాత కణాలు కొద్దిగానైనా పెరిగాయేమో పరీక్ష చేయించుకోండి. పెరిగితే ఐయూఐ మరో మూడుసార్లు ప్రయత్నించవచ్చు. లేకపోతే ఐవీఎఫ్ చికిత్సకు వెళ్లవచ్చు. నా వయసు 25. నాకు మూడు నెలల నుంచి పదిహేను రోజులకోసారి నెలసరి వస్తోంది. పైగా వచ్చిన ప్రతిసారీ తొమ్మిది రోజులు అవుతోంది. డాక్టర్ దగ్గరకు వెళ్తే... ఐదు నెలలు చూడు, అప్పటికీ అలాగే వస్తే అప్పుడు పరీక్ష చేస్తాను అన్నారు. కానీ నాకెందుకో భయంగా ఉంది. ఇప్పటికే మూడు నెలల నుంచి ఇలా జరుగుతోంది. ఇంకా వెయిట్ చేయడం కరెక్టేనా? నాకింకా పెళ్లి కాలేదు. దీన్నిలా వదిలేస్తే పెళ్లయ్యాక సమస్యలేమైనా వస్తాయంటారా? - సుప్రజ, కర్నూలు పీరియడ్స్ సక్రమంగా రాకపోవడానికి థైరాయిడ్, ప్రొలాక్టిన్, ఈస్ట్రోజన్ వంటి ఎన్నో హార్మోన్లు సమతుల్యంగా ఉండటం అవసరం. వాటి అసమతుల్యతతో పాటు అండాశయాల్లో నీటి తిత్తులు, నీటి బుడగలు, అధిక బరువు, గర్భాశయంలో గడ్డలు, ఇన్ఫెక్షన్లు వంటి ఎన్నో అంశాలు పీరియడ్స్ సక్రమంగా రాకపోవడానికి కారణమవుతాయి. మూడు నెలల నుంచి సమస్య ఉంది కాబట్టి ఇంకో రెండు నెలలు ఆగే ఓపిక లేకపోతే... ముందే హార్మోన్ పరీక్షలు, స్కానింగ్ వంటివి చేయించుకోండి. అప్పుడు సమస్య ఎక్కడ ఉందో తెలిసిపోతుంది. దానికి తగ్గ చికిత్స తీసుకోవచ్చు. పీరియడ్స్ సక్రమంగా రావడం మొదలైతే పెళ్లి తర్వాత ఇక ఏ సమస్యలూ ఉండవు. నా వయసు 21. ఇంకా పెళ్లి కాలేదు. నాకు పీరియడ్స్ వచ్చి ఆగాక, ఐదు రోజుల పాటు వైట్ డిశ్చార్జి అవుతోంది. చాలా దుర్వాసన కూడా వస్తోంది. అలాగే చాలాసార్లు యూరిన్‌కి వెళ్లాల్సి వస్తోంది. ఐదు రోజుల పాటే ఇలా ఉంటోంది. తర్వాత ఏ సమస్యా ఉండటం లేదు. ఎందుకిలా అవుతోంది? - పి.శ్వేత, కర్నూలు పీరియడ్స్ సమయంలో నాలుగైదు రోజుల పాటు న్యాప్కిన్స్ పెట్టుకునే ఉండటం వల్ల గాలి సోకక, ఏదైనా ఇన్ఫెక్షన్ రావొచ్చు. దానివల్ల పీరియడ్స్ ఆగిన తర్వాత దుర్వాసనతో కూడిన తెల్లబట్ట అవ్వవచ్చు. బ్లీడింగ్ సమయంలో న్యాప్కిన్స్ తరచుగా మార్చుకోవడం మంచిది. యోనిని ఎప్పటికప్పుడు శుభ్రంగా కడుక్కుని, క్యాండిడ్ డస్టింగ్ పౌడర్ని యోని చుట్టూ చల్లుకోవాలి. ఒకవేళ రక్తహీనత ఉన్నా, రోగనిరోధక శక్తి తక్కువ ఉన్నా కూడా ఇన్ఫెక్షన్లు మాటిమాటికీ వస్తుంటాయి. కాబట్టి మంచి పౌష్టికాహారం తీసుకోవడంతో పాటు రోజూ తగినన్ని మంచినీళ్లు తాగుతూ ఉండాలి. మీ బరువు ఎంతో రాయలేదు. బరువు ఎక్కువగా ఉన్నా కూడా ఇలాంటి సమస్యలు రావొచ్చు. డా॥వేనాటి శోభ లీలా హాస్పిటల్ మోతీనగర్, హైదరాబాద్