ఆయన చెప్పే కారణం... సరైనదేనా?! | Medical Issues | Sakshi
Sakshi News home page

ఆయన చెప్పే కారణం... సరైనదేనా?!

Published Sat, Jan 23 2016 10:24 PM | Last Updated on Sun, Sep 3 2017 4:10 PM

ఆయన చెప్పే కారణం... సరైనదేనా?!

ఆయన చెప్పే కారణం... సరైనదేనా?!

నా వయసు 21. పెళ్లై సంవత్సరం కావస్తోంది. మావారికి ఇద్దరు భార్యలు. నేను రెండో భార్యని. అయినా నన్ను బాగానే చూసుకుంటారు. కాకపోతే కలిసేటప్పుడు కండోమ్ వాడుతుంటారు. నాకు పిల్లలు కావాలి, కండోమ్ వాడొద్దు అని చెప్పాను. కానీ ఆయన... ఇద్దరితోనూ కలుస్తాను కదా, హెచ్‌ఐవీ వచ్చే అవకాశాలు ఉంటాయి, అందుకే కండోమ్ తప్పక వాడాలి అంటున్నారు. అది నిజమేనా? నాకు తల్లిని కావాలన్న కోరిక బలంగా ఉంది. ఇప్పుడు నేనేం చేయాలి?
 - స్వీటీ, మెయిల్
 హెచ్‌ఐవీ ఇన్ఫెక్షన్ మీ ఆయనకో, ఆయన మొదటి భార్యకో ఉంటే... మీరు మీవారితో కలవడం వల్ల వస్తుంది. అంతే కానీ మీ ముగ్గురిలో ఎవరికీ హెచ్‌ఐవీ లేకపోతే ఇంకెక్కడి నుంచి వస్తుంది? కండోమ్స్ వాడటం వలన ఇంకా వేరే ఇన్ఫెక్షన్లు ఏమైనా వాళ్లిద్దరిలో ఉన్నా కూడా, అవి మీకు రాకుండా ఉంటాయి. మీవారు మీకు చెబుతున్నదాంట్లో వాస్తవం లేదు. ఆయన అలా చెప్పడానికి వేరే కారణాలు ఏవో ఉన్నాయని నాకు అనిపిస్తోంది. కాబట్టి మీకు పిల్లలు కావాలనిపిస్తే అతనితో మనసు విప్పి మాట్లాడండి. ఎందుకంటే అతనికి మీతో పిల్లలు కనాలన్న కోరిక అసలు ఉందో లేదో! లేకపోవడం వల్లే అలా ఇన్ఫెక్షన్ సాకు పెట్టుకుని కండోమ్స్ వాడుతున్నారేమోనన్న విషయం మనకు తెలియాలి కదా! ఒకవేళ ఆయనకు ఏ అభ్యంతరం లేకపోతే... ఏవైనా ఇన్ఫెక్షన్లు ఉన్నాయేమో మీరిద్దరూ ముందు పరీక్షలు చేయించుకోండి. ఏమీ లేకపోతే కండోమ్ లేకుండా ధైర్యంగా కలవండి. తద్వారా గర్భం ధరించేందుకు అవకాశం ఏర్పడుతుంది.

 మీవారు మీకు చెబుతున్నదాంట్లో వాస్తవం లేదు. ఆయన అలా చెప్పడానికి వేరే కారణాలు ఏవో ఉన్నాయని నాకు అనిపిస్తోంది. కాబట్టి మీకు పిల్లలు కావాలనిపిస్తే అతనితో మనసు విప్పి మాట్లాడండి. ఎందుకంటే అతనికి మీతో పిల్లలు కనాలన్న కోరిక అసలు ఉందో లేదో!

 

నేను ఓ ప్రైవేటు కంపెనీలో పని చేస్తున్నాను. వయసు 29. నాకు ఎండో మెట్రియాసిస్ ఉంది. మందులు వాడుతున్నాను. ఈమధ్యే ఎక్కడో చదివాను... ఎండో మెట్రియాసిస్ ఉన్నవాళ్లకు కొన్ని రకాల క్యాన్సర్లు తేలికగా వస్తాయి అని. అది నిజమేనా? వస్తే ఎలాంటి క్యాన్సర్లు వస్తాయి? అసలు రాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవడం అవసరం?
 - ప్రీతి, హైదరాబాద్
 ఎండో మెట్రియాసిస్ అనేది గర్భాశయం లోపల ఉండే పొర. అది అక్కడే కాకుండా మిగతా చోట్ల కూడా... అంటే పొత్తి కడుపులో, అండాశయాల పైన, పేగుల పైన, మూత్రాశయం పైన చిన్నగా పాతుకుని ఉంటుంది. ప్రతినెలా బ్లీడింగ్ అయినట్లే అక్కడ కూడా కొద్దిగా బ్లీడింగ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. అక్కడ ఆ రక్తం కొద్దికొద్దిగా గడ్డ కట్టడం వల్ల చుట్టూ ఉన్న అవయవాలు దగ్గరకు చేరి, అతుక్కుపోవడం జరగవచ్చు. ఈ ఎండోమెట్రియాసిస్ పొర పైన ఈస్ట్రోజన్ ప్రభావం దీర్ఘకాలంగా ఎక్కువ నిష్పత్తిలో పని చేసినప్పుడు కొందరిలో క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అయితే అది అరుదుగానే జరుగుతుంది. పిల్లలు లేనివారు, అధిక బరువు ఉండేవారు, రక్తంలో ఈస్ట్రోజన్ ఎక్కువ ఉన్నవారు, ఈస్ట్రోజన్ హార్మోన్ రీప్లేస్‌మెంట్ దీర్ఘకాలంగా చేయించుకున్నవారిలోనూ ఇలా ఎక్కువగా జరుగుతుంది. ఈస్ట్రోజన్ హార్మోన్ వల్ల ఎండో మెట్రియల్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్ వంటివి కొందరిలో ఎలా వస్తుంటాయో... అలాగే ఎండో మెట్రియాసిస్ ఉన్నవారిలో కూడా 1-2 శాతం మందిలో క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంటాయి. తరచుగా చెకప్, వెజైనల్ స్కానింగ్, అవసరమైతే ఇ్చ 125 లాంటి రక్త పరీక్షలు చేయించుకోవడం మంచిది. అవసరాన్ని బట్టి ఓరల్ కాంట్రాసెప్టివ్ పిల్స్ ఎక్కువ కాలం వాడటం మంచిది. ఎందుకంటే ఇవి ఎండో మెట్రియాసిస్‌ను యాక్టివ్ అవ్వకుండా అణచి వేస్తాయి. అలాగే అవసరమైతే ల్యాపరోస్కోపి ద్వారా నిర్ధారణ చేసుకుని, ఎండోమెట్రియాసిస్ ఆపరేషన్ కూడా చేయించేసుకోవచ్చు.
 
  మా పాప వయసు పదహారేళ్లు. మూడేళ్ల క్రితం మెచ్యూర్ అయ్యింది. అప్పుడు బ్లీడింగ్ చాలా ఎక్కువ అయ్యింది. ఎంతకీ ఆగకపోవడంతో హాస్పిటల్‌కి తీసుకెళ్లాం. రక్తం చాలా తక్కువ ఉంది, ప్లేట్‌లెట్ కౌంట్ కూడా చాలా తక్కువ ఉంది అన్నారు. ఆ సమస్య పేరు Thrombo cytopenia అని చెప్పారు. Wysolone ట్యాబ్లెట్స్ ఇచ్చారు. అప్పటి నుంచి పీరియడ్స్ వచ్చిన ప్రతిసారీ ఆ ట్యాబ్లెట్ వేస్తేనే బ్లీడింగ్ ఆగుతోంది. లేకపోతే అవుతూనే ఉంటోంది. ఈ సమస్యకు పరిష్కారం ఏమిటి?
 - పద్మావతి, మందమర్రి
  Thrombo cytopenia అంటే రక్తంలో ప్లేట్‌లెట్స్ తక్కువగా ఉండటం. రక్తంలో అనేక రకాల కణాలు ఉంటాయి. వాటిలో ఒక రకమైన కణాలనే ప్లేట్‌లెట్స్ అంటారు. వీటివల్ల రక్తానికి గడ్డకట్టే గుణం ఏర్పడుతుంది. ఇవి కనుక తక్కువ ఉంటే... చిన్న దెబ్బ తగిలి బ్లీడింగ్ మొదలైనా అది ఆగకుండా అవుతూనే ఉంటుంది. అనేక కారణాల వల్ల రక్తంలో ప్లేట్‌లెట్స్ తగ్గిపోవచ్చు. కొంతమందిలో అయితే ప్లేట్‌లెట్స్‌ను నాశనం చేసే యాంటి బాడీస్ రక్తంలో తయారవుతూ ఉంటాయి. ఈ యాంటీ బాడీస్ తయారు కాకుండా Wysolone ట్యాబ్లెట్స్ అడ్డుపడుతూ ఉంటాయి. మీరు ఓసారి మీ పాపను మంచి హెమటాలజిస్టుకు చూపించి, అన్ని రకాల పరీక్షలూ చేయించండి. పాపలో ప్లేట్‌లెట్స్ తక్కువగా ఉండటానికి కారణం ఏమిటో తెలుసుకుని, చికిత్స చేస్తారు. అయితే ఇటువంటి సమస్యలకు దీర్ఘకాలం చికిత్స తీసుకోవాల్సి వస్తుంది.
 
   నా వయసు 25. బరువు 58 కిలోలు. మావారి వయసు 40. మాకు పెళ్లై ఆరేళ్లయ్యింది. కానీ ఇంతవరకూ పిల్లలు లేరు. నాకు పీసీఓడీ ఉంది. ల్యాపరోస్కోపీ, హిస్టరోస్కోపీ, మూడుసార్లు ఐయూఐ చేశారు. మా వారికి షుగర్ ఉంది కానీ ఎప్పుడూ కంట్రోల్‌లోనే ఉంటుంది. కాకపోతే ఆయన స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉందట. అలాగే వీర్యంలో ఇన్ఫెక్షన్ కూడా ఉందని అంటున్నారు డాక్టర్. ఇప్పుడు మేమేం చేయాలి? ఏం చేస్తే పిల్లలు కలుగుతారు?
 - స్వాతి, నల్గొండ
 కొంతమందిలో షుగర్ వల్ల స్పెర్మ్ కౌంట్ తక్కువ ఉండవచ్చు. మరికొంత మందిలో ఇన్ఫెక్షన్ వల్ల కూడా వీర్యకణాల సంఖ్య తక్కువ ఉండటం, వాటి కదలిలు సరిగ్గా లేకపోవడం, వాటిలో నాణ్యత లేకపోవడం వంటివి జరగవచ్చు. మీవారి సీమన్ కల్చర్ చేయిస్తే... అందులో ఏ ఇన్ఫెక్షన్ ఉంది, అది ఏ మందులతో తగ్గుతుంది అనేది తెలుస్తుంది. దాన్నిబట్టి మందులు వాడవచ్చు. ఇన్ఫెక్షన్ పూర్తిగా తగ్గిపోయిన తర్వాత వీర్యకణాల సంఖ్య, కదలిక, నాణ్యత పెరగవచ్చు. అలాగే కొందరిలో హార్మోన్ల తేడా వల్ల లేదా వృషణాల్లో వాపు, వేరికోసిల్ వంటి సమస్యల వల్ల కూడా స్పెర్‌‌మ కౌంట్ తగ్గవచ్చు. కాబట్టి ఓసారి మీవారిని డాక్టర్‌కి చూపించి, అవసరమైన పరీక్షలు చేయించి, తగిన చికిత్స ఇప్పించండి. మూడు నెలల వ్యవధి తీసుకుని, తర్వాత కణాలు కొద్దిగానైనా పెరిగాయేమో పరీక్ష చేయించుకోండి. పెరిగితే ఐయూఐ మరో మూడుసార్లు ప్రయత్నించవచ్చు. లేకపోతే ఐవీఎఫ్ చికిత్సకు వెళ్లవచ్చు.
 
  నా వయసు 25. నాకు మూడు నెలల నుంచి పదిహేను రోజులకోసారి నెలసరి వస్తోంది. పైగా వచ్చిన ప్రతిసారీ తొమ్మిది రోజులు అవుతోంది. డాక్టర్ దగ్గరకు వెళ్తే... ఐదు నెలలు చూడు, అప్పటికీ అలాగే వస్తే అప్పుడు పరీక్ష చేస్తాను అన్నారు. కానీ నాకెందుకో భయంగా ఉంది. ఇప్పటికే మూడు నెలల నుంచి ఇలా జరుగుతోంది. ఇంకా వెయిట్ చేయడం కరెక్టేనా? నాకింకా పెళ్లి కాలేదు. దీన్నిలా వదిలేస్తే పెళ్లయ్యాక సమస్యలేమైనా వస్తాయంటారా?
 - సుప్రజ, కర్నూలు
 పీరియడ్స్ సక్రమంగా రాకపోవడానికి థైరాయిడ్, ప్రొలాక్టిన్, ఈస్ట్రోజన్ వంటి ఎన్నో హార్మోన్లు సమతుల్యంగా ఉండటం అవసరం. వాటి అసమతుల్యతతో పాటు అండాశయాల్లో నీటి తిత్తులు, నీటి బుడగలు, అధిక బరువు, గర్భాశయంలో గడ్డలు, ఇన్ఫెక్షన్లు వంటి ఎన్నో అంశాలు పీరియడ్స్ సక్రమంగా రాకపోవడానికి కారణమవుతాయి. మూడు నెలల నుంచి సమస్య ఉంది కాబట్టి ఇంకో రెండు నెలలు ఆగే ఓపిక లేకపోతే... ముందే హార్మోన్ పరీక్షలు, స్కానింగ్ వంటివి చేయించుకోండి. అప్పుడు సమస్య ఎక్కడ ఉందో తెలిసిపోతుంది. దానికి తగ్గ చికిత్స తీసుకోవచ్చు. పీరియడ్స్ సక్రమంగా రావడం మొదలైతే పెళ్లి తర్వాత ఇక ఏ సమస్యలూ ఉండవు.
 
 
  నా వయసు 21. ఇంకా పెళ్లి కాలేదు. నాకు పీరియడ్స్ వచ్చి ఆగాక, ఐదు రోజుల పాటు వైట్ డిశ్చార్జి అవుతోంది. చాలా దుర్వాసన కూడా వస్తోంది. అలాగే చాలాసార్లు యూరిన్‌కి వెళ్లాల్సి వస్తోంది. ఐదు రోజుల పాటే ఇలా ఉంటోంది. తర్వాత ఏ సమస్యా ఉండటం లేదు. ఎందుకిలా అవుతోంది?
 - పి.శ్వేత, కర్నూలు
 పీరియడ్స్ సమయంలో నాలుగైదు రోజుల పాటు న్యాప్‌కిన్స్ పెట్టుకునే ఉండటం వల్ల గాలి సోకక, ఏదైనా ఇన్ఫెక్షన్ రావొచ్చు. దానివల్ల పీరియడ్స్ ఆగిన తర్వాత దుర్వాసనతో కూడిన తెల్లబట్ట అవ్వవచ్చు. బ్లీడింగ్ సమయంలో న్యాప్‌కిన్స్ తరచుగా మార్చుకోవడం మంచిది. యోనిని ఎప్పటికప్పుడు శుభ్రంగా కడుక్కుని, క్యాండిడ్ డస్టింగ్ పౌడర్‌ని యోని చుట్టూ చల్లుకోవాలి. ఒకవేళ రక్తహీనత ఉన్నా, రోగనిరోధక శక్తి తక్కువ ఉన్నా కూడా ఇన్ఫెక్షన్లు మాటిమాటికీ వస్తుంటాయి. కాబట్టి మంచి పౌష్టికాహారం తీసుకోవడంతో పాటు రోజూ తగినన్ని మంచినీళ్లు తాగుతూ ఉండాలి. మీ బరువు ఎంతో రాయలేదు. బరువు ఎక్కువగా ఉన్నా కూడా ఇలాంటి సమస్యలు రావొచ్చు.
 
 డా॥వేనాటి శోభ
 లీలా హాస్పిటల్
 మోతీనగర్, హైదరాబాద్

 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement