చాడీలు చెప్తోంది... మాన్పించేదెలా?
మా పాప వయసు పదేళ్లు. తను చాడీలు బాగా చెబుతోంది. నేను అన్నది వాళ్ల నాన్నకి, ఆయనన్నది నాకు, మా ఇద్దరి మీదా వాళ్ల తాతగారికి... ఇలా చెబుతూనే ఉంటుంది. స్కూలు టీచర్ల మీద, సాటి విద్యార్థుల మీద కూడా చెబుతూ ఉంటుంది. పైగా ఒక్కోసారి లేనివి కల్పించి చెబుతోంది. తనతో ఈ అలవాటు ఎలా మాన్పించాలి?
- కృష్ణకుమార్, ఏలూరు
ఈ అలవాటు ఇలా కంటిన్యూ అవ్వడం మంచిది కాదు. ఇవాళ ఇంట్లో చేస్తోంది. తరువాత బయట కూడా చేస్తుంది. కాబట్టి వెంటనే ఈ అలవాటును మాన్పించాలి. అది మీ చేతుల్లోనే ఉంది. తను ఇంట్లో ఎవరి మీద ఏం చెప్పినా ఎవరూ వినకండి. అసలు పట్టించుకోకండి. తను ఏదైనా చెప్పడం మొదలు పెట్టగానే మౌనంగా లేచి వెళ్లిపోండి. ఇంట్లోని ప్రతి ఒక్కరూ ఇలానే చేస్తే తర్వాత తనే ఆలోచిస్తుంది. ఏం చెప్పినా ఎవరూ వినరని అర్థమై చెప్పడం మానేస్తుంది. కాకపోతే దీనికి కాస్త సమయం పట్టవచ్చు. ఓపిగ్గా ప్రయత్నించండి. అలా కాకుండా మీరు కోప్పడినా, కొట్టినా, బెదిరించినా... ఆ పని మీ దగ్గర చేయడం మానేసి, బయట చేయడం మొదలు పెడుతుంది. కాబట్టి జాగ్రత్త!
నేనూ మావారూ నాలుగున్నరేళ్ల క్రితం విడాకులు తీసుకున్నాం. మా ఐదేళ్ల బాబు నాతోనే ఉంటున్నాడు. అయితే ఈ మధ్య తరచూ వాళ్ల నాన్నను అడుగుతున్నాడు. మా అమ్మానాన్నలేమో బాబుని మావారి దగ్గరకు పంపడానికి ఇష్టపడరు. వాడేమో తరచూ నాన్న ఏడి? అంటుంటాడు. వాడికేది మంచిదో నాకు అర్థం కావడం లేదు. సలహా చెప్పండి.
- ఓ సోదరి
తల్లిదండ్రులు విడిపోయినా, సామ రస్యంగా ఉండక పోయినా ఎక్కువగా నష్టపోయేది పిల్లలే. అతిగా గొడవ పడకుండా, సంతోషంగా కలిసి మెలిసి ఉండే తల్లి దండ్రుల వద్ద పెరగడం పిల్లలకు చాలా మంచిది. కానీ ఏ కారణాల వల్ల అయినా అది వీలుకానప్పుడు, తల్లిదండ్రులు విడి పోయినప్పుడు పిల్లల గురించి తప్పక ఆలోచించాలి. పిల్లల జీవితాల్లో తల్లి దండ్రులిద్దరూ ఉండటం మంచిది. ఇద్దరూ కలిసి పిల్లల బాధ్యతను నిర్వర్తించడం మంచిది. ఒకరి మీద ఒకరు కోపంతో పిల్లలను దూరం చెయ్యడం వల్ల కానీ, పిల్లల మనసును విరి చెయ్యడం వల్ల కానీ ఏ ఉప యోగం ఉండదు సరికదా, పిల్లల మనసులపై అది దుష్ర్పభావం చూపిస్తుంది. మీరు మీ వ్యక్తిగత ద్వేషా లను, కోపాలను పక్కన పెట్టి ఆలోచించండి. ఆయన ఓ తండ్రిగా బాధ్యతగా ఉండే వ్యక్తే అయితే, ఆయన దగ్గరకు బాబును అప్పు డప్పుడూ పంపించండి. ఇద్దరినీ కలిసి సమయం గడపనివ్వండి. తనకు అమ్మానాన్నా ఇద్దరూ ఉన్నారన్న ఆనందం బాబు అభివృద్ధికి తోడ్పడుతుంది. అలాగే మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ తండ్రి గురించి బాబు దగ్గర చెడుగా మాట్లాడకండి. మీ తల్లిదండ్రులను కూడా మాట్లాడనివ్వ కండి. బాబు భవిష్యత్తుకు, మానసిక ఎదుగుదలకు అది ఎంతైనా అవసరం.
మా అబ్బాయి ఆరో తరగతి చదువు తున్నాడు. చాలా బాగా చదువుతాడు. కానీ ఈ మధ్య వాడితో ఒక ఇబ్బంది వచ్చి పడింది. సైన్సు పాఠాలపై చాలా ఆసక్తి చూపిస్తున్నాడు. స్కూల్లో ఏవైనా ప్రయోగాల గురించి చెబితే ఇంటికి వచ్చి వాటిని చేయడానికి ట్రై చేస్తున్నాడు. ఈ మధ్య యాసిడ్‌తో ఏదో చేస్తుంటే చూసి అడిగాను. స్కూల్లో చెప్పిన సైన్స్ ఎక్స్‌పెరిమెంట్ చేస్తున్నాను అన్నాడు. అలాగే కరెంటుతో కూడా ఏదో చేస్తుంటే నా భార్య చూసి అడ్డుకుంది. ఈ అత్యుత్సాహం వల్ల ఏదైనా ప్రమాదం కొని తెచ్చుకుంటా డేమోనని భయమేస్తోంది. ఏం చేయాలి? వాడు అలా చేయడం కరెక్టేనంటారా? లేక అదేమైనా సమస్యా?
- శివరామ్, చెన్నై
మీ అబ్బాయి స్కూల్లో చెప్పిన ప్రయో గాలు ట్రై చేయడం మంచి విషయమే. మీకు తను సేఫ్‌గా చేస్తున్నాడో లేదో అని అనుమానం వస్తే... మీరు కూడా బాబుతో ఉండండి. ప్రయోగాలు చేస్తున్నప్పుడు దగ్గరుండి పర్యవేక్షించండి. తనకు సేఫ్టీ గురించి వివరించి చెప్పండి. యాసిడ్, విద్యుత్ లాంటి వాటితో ప్రయోగాలు చేసేటప్పుడు పెద్దవాళ్లకు చెప్పమని, ఎవరో ఒకరిని దగ్గర ఉంచుకుని చేయ మని వివరించండి. లేదంటే ఎలాంటి ఇబ్బందులు ఎదురు కావొచ్చో వివరిం చండి. అంతే తప్ప బాబు ఉత్సాహాన్ని నీరుగార్చడం మంచిది కాదు. ఈరోజు తను చేసే ప్రయోగాలు రేపు తనని గొప్ప సైంటిస్టును చేయవచ్చేమో. కాబట్టి చక్కగా ప్రోత్సహించండి. ఇదేమీ మానసిక సమస్య కాదు. కాబట్టి చింతించకండి.