Common Service Rules
-
‘కామన్ సర్వీస్ రూల్స్ ఏర్పాటు చేయాలి’
హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలల్లో పనిచేస్తున్న 50 వేల మంది లెక్చరర్లకు ప్రభుత్వం ఉద్యోగ భద్రత కల్పిం చి, కామన్ సర్వీస్ రూల్స్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలల టీచర్స్ అసోసియేషన్ జేఏసీ డిమాండ్ చేసింది. ఆదివారం బషీర్‌బాగ్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో జేఏసీ అధ్యక్షుడు రామకృష్ణారెడ్డి మాట్లాడారు. ఇంజనీరింగ్ లెక్చరర్స్‌కు కళాశాలల యజమాన్యాలు అతి తక్కువ వేతనాలు చెల్లించి తమ శ్రమను దోపిడీ చేస్తున్నాయన్నారు. ఏఐసీటీఈ ప్రకారం పర్మినెంట్ లెక్చరర్స్‌తో సమానంగా వేతనాలను చెల్లించాలని అన్నారు. యాజమాన్యాలు విద్యార్థుల నుంచి కోట్లాది రూపాయలు వసూలు చేస్తూ.. తమకు మాత్రం జీతాల విషయంలో అన్యాయం చేస్తున్నాయని ఆరోపించారు. ఇలా చేస్తున్న కళాశాల యాజమాన్యాలపై సీబీఐ విచారణ జరిపించాలని ప్రభుత్వాన్ని కోరారు. అలాగే టీచర్స్ వెల్ఫేర్ బోర్డును ఏర్పాటు చేయాలని, లేనిపక్షంలో జేఎన్టీయూ నిర్వహించిన పరీక్షల వాల్యుయేషన్‌ను నిలిపివేస్తామని హెచ్చరించారు. -
జీఓల విడుదలపై టీచర్ల హర్షం
అనంతపురం ఎడ్యుకేషన్: 25 ఏళ్లకు పైగా ఎదురు చూస్తున్న ఉమ్మడి సర్వీస్ రూల్స్ అమలు కొలిక్కిరావడంతో ఉపాధ్యాయుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల రాష్ట్రపతి ఉత్తర్వులు వెలువడిన తర్వాత తాజాగా బుధవారం రాష్ట్ర ప్రభుత్వం 72, 73, 74 జీఓలను విడుదల చేసింది. ఏకీకృత సర్వీస్ రూల్స్ 1998 నుంచి అమలు చేస్తూ 72 జీఓ, గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల నుంచి డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వరకు పదోన్నతులు కల్పించేందుకు 73 జీఓ, ఎస్జీటీ నుంచి స్కూల్ అసిస్టెంట్‌గా పదోన్నతులు కల్పించేందుకు 74 జీఓను విడుదల చేసింది. ఇప్పటికైనా ఆలస్యం చేయకుండా అన్ని కేడర్ల పోస్టులకు పదోన్నతులు కల్పించాలని ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ముఖ్యంగా ఏళ్ల తరబడి ఖాళీగా ఉన్న డైట్ అధ్యాపకులు, జూనియర్ అధ్యాపకులు, డెప్యూటీ డీఈఓ పోస్టుల భర్తీకి మార్గం సుగమమైందని నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఆప్టా జిల్లా అధ్యక్ష, ప్రధానకార్యదర్శులు రజనీకాంత్‌రెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి, రాష్ట్ర కోశాధికారి విష్ణువర్ధన్‌రెడ్డి, పీఆర్టీయూ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రామకృష్ణారెడ్డి, శ్రీధర్‌రెడ్డి, ఏపీటీఎఫ్(1938) జిల్లా అధ్యక్ష, ప్రధానకార్యదర్శులు కులశేఖర్‌రెడ్డి, వెంకటసుబ్బయ్య, ఎస్టీయూ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గోవిందు, రామన్న, బీఈడీ ఉపాధ్యాయ సంఘం నారాయణస్వామి తదితరులు హర్షం వ్యక్తం చేశారు. -
బ్రేక్!
ఉపాధ్యాయ బదిలీలు తాత్కాలిక నిలుపుదల? – ఏకీకృత సర్వీసు రూల్స్ ఫైల్‌పై రెండు, మూడు రోజుల్లో రాష్ట్రపతి ముద్ర – సర్వీసు రూల్స్ కారణంతో తెలంగాణలో బదిలీలు నిర్వహించని ప్రభుత్వం – ఏపీలో ముందస్తు కసరత్తు లేకుండా బదిలీల షెడ్యూల్ – ఉపాధ్యాయుల నుంచి వ్యతిరేకత రావడంతో పునరాలోచన కర్నూలు(సిటీ): రెండు దశాబ్దాలుగా పాఠశాల విద్యాశాఖలో పెండింగ్‌లో ఉన్న ప్రభుత్వ, పంచాయతీరాజ్ ఉపాధ్యాయుల ఏకీకృత సర్వీసు నిబంధనల సమస్యకు రెండు మూడు రోజుల్లో తెరపడనుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల నుంచి బదిలీలపై తీవ్ర వ్యతిరేకత రావడంతో సర్వీసు రూల్స్ ఆమోదాన్ని అడ్డు పెట్టుకొని వాయిదా వేసేందుకు ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. వాస్తవానికి ఏకీకృత సర్వీసు రూల్స్‌పై కేంద్ర ప్రభుత్వం ఇటీవలే పరిష్కారం చేసేందుకు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే మంగళవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ఫైల్‌పై సంతకం చేయడంతో ఇక ఉమ్మడి సర్వీసు నిబంధనలకు మార్గం సుగమమైంది. రాష్ట్రపతి ఆమోదం కోసం రాష్ట్రపతి భవన్‌కు ఈ ఫైలు చేరింది. దీనిపై రెండు మూడు రోజుల్లో రాష్ట్రపతి ఆమోద ముద్ర వేయనున్నారు. ఈ విషయం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు ముందుగానే సమాచారం ఉంది. అయితే తెలంగాణ ప్రభుత్వం సర్వీసు రూల్స్ ఫైల్ ఆమోదం పొందితే ఉపాధ్యాయుల బదిలీలకు ఇబ్బందులు వస్తాయనే కారణంతో వాయిదా వేసింది. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం ఎలాంటి కసరత్తు లేకుండా ఉపాధ్యాయుల బదిలీలు, హేతుబద్ధీకరణపై షెడ్యూల్ జారీ చేసింది. ఈ షెడ్యూల్ జారీ అయినప్పటి నుంచి ఉపాధ్యాయ వర్గాల్లో తీవ్ర గందరగోళం నెలకొంది. దీంతో పాటు ఇందుకు జారీ చేసిన మార్గదర్శకాలపై ఉపాధ్యాయ వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుంది. ఈ వ్యతిరేకత నుంచి ప్రభుత్వం బయటపడేందుకు కొత్త ఎత్తుగడ వేసినట్లు సమాచారం. ఇందులో భాగంగానే బదిలీల షెడ్యూల్లో రోజుకో రకమైన ఉత్తర్వులు ఇస్తున్నారనే విమర్శలు ఉపాధ్యాయ వర్గాల నుంచి వ్యక్తమవుతున్నాయి. తప్పుని కప్పిపుచ్చుకునేందుకే బదిలీల షెడ్యూల్ టీచర్ల బదిలీలు, హేతుబద్ధీకరణపై ముందుగా ఉపాధ్యాయ సంఘాలతో సమావేశం ఏర్పాటు చేసి వేసవిలోనే చేస్తామని మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు పదో తరగతి పరీక్షలు జరుగుతున్న సమయంలో ప్రకటించారు. అయితే ఆర్థిక వెసలుబాటు, అధికార పార్టీ నాయకుల అండదండలతో కొంతమంది ఉపాధ్యాయులు తమకు అవసరమైన స్కూళ్లకు బదిలీ చేయించుకునేందుకు అడ్డదారులు తొక్కారు. ఇందుకు అధికార పార్టీకి చెందిన ఓ మంత్రి తన బామ్మర్ది ద్వారా ఒక్కో బదిలీకి రూ.2లక్షల నుంచి రూ.3.50 లక్షలు మామూళ్లు తీసుకొని బదిలీ చేయిస్తున్నారనే విషయమై విమర్శలు రావడం, ఈ విషయంపై సీఎం సైతం సదరు మంత్రిపై అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. బదిలీల కోసం ఒక్క ఏప్రిల్ నెలలోనే 2వేలకు పైగా దరఖాస్తులు రావడంతో రాష్ట్ర వ్యాప్తంగా భారీగానే అక్రమ బదిలీలు జరిగినట్లు విమర్శలు వచ్చాయి. వీటి నుంచి బయటపడేందుకే ప్రభుత్వం స్కూళ్లు పునఃప్రారంభించే ముందు హడావుడిగా ఎలాంటి ముందస్తు కసరత్తు లేకుండా బదిలీలు, హేతుబద్ధీకరణ షెడ్యూల్ జారీ చేయడంతోనే తీవ్ర గందరగోళం నెలకొంది. దీని నుంచి బయట పడేందుకు ప్రభుత్వం ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపి రాష్ట్రపతి ముద్ర కోసం వెళ్లిన ఏకీకృత సర్వీసు రూల్స్ నిబంధనల ఫైల్‌ను తనకు అనుకూలంగా మార్చుకునేందుకే తాత్కాలికంగా ఉపాధ్యాయుల బదిలీలు నిలుపుదల చేయాలనే ఆలోచనకు వచ్చినట్లు తెలిసింది. బుధవారం బదిలీల్లో వెబ్ కౌన్సెలింగ్, పని ఆధారిత పాయింట్లను రద్దు చేయాలని ఫ్యాప్టో–జాక్టోల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా డీఈఓల కార్యాలయాల ముట్టడితోనే ప్రభుత్వం ఈ నిర్ణయానికి వచ్చినట్లు ఉపాధ్యాయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఏకీకృత సర్వీసు ఫైల్ ఆమోదం పొందితే.. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న డైట్, బీఎడ్ కళాశాలల ప్రిన్సిపాళ్లు, అధ్యాపకుల ఖాళీల భర్తీలో భాగంగా హైస్కూళ్ల టీచర్లు, హెచ్ఎంలకు అవకాశం లభిస్తుంది. అదేవిధంగా రెగ్యులర్ ఎంఈఓల నియామకం చేపట్టే వీలుంటుంది. ఎస్జీటీలకు స్కూల్ అసిస్టెంట్లుగా ప్రమోషన్ వస్తుంది. ఆ తర్వాత సీనియార్టీ జాబితా తయారు చేసి పదోన్నతులు, బదిలీలు చేపట్టాల్సి ఉంటుంది. ఇదిలాఉంటే ప్రస్తుతం నిర్వహిస్తున్న హేతుబద్ధీకరణ మాత్రం యథావిధిగా సాగుతుంది. -
కామన్ సర్వీసు రూల్స్‌ను అమలు చేయాలి
సారంగాపూర్ : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ యాజామాన్యల కింద పనిచేస్తున్న ఉపాద్యాయులకు కామన్ సర్వీసు రూల్స్‌ను అమలు చేయాలని డీటీఎఫ్ నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాల అధ్యక్షులు చంద్రశేఖర్, సుధాకర్‌లు అన్నారు. మండలంలోని జామ్ సారంగాపూర్, తదితర గ్రామాల్లో బుధవారం పర్యటించి డిసెంబరు 10, 11, 12వతేదీల్లో నల్గొండలో జరిగే డీటీఎఫ్ 4వ మహాసభ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యారంగ సమస్యలను ప్రభుత్వం పట్టించుకోక పోవడంతో రాష్ర్టం సంక్షోభంలో కూరుకుపోతోందని అన్నారు. ఎన్నో యేళ్లుగా ఎదిరిచూస్తున్న కామన్ సర్వీస్ రూల్స్‌ను అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే కంట్రీబ్యూటరి పెన్షన్ విధానం రద్దు చేసీ పీఈటీలకు, పండిత్‌లను అప్‌గ్రెడేషన్ చేయాలని కోరారు. పీఆర్సీ బకాయిల చెల్లింపు విషయంలో ప్రభుత్వం తీవ్ర జాప్యం చేస్తోందని దీనివల్ల ఉపాద్యాయులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. విద్యారంగ సమస్యల పరిష్కారంలో డీటీఎఫ్ ఎప్పుడు ముందుంటుందని తెలిపారు. ప్రస్తుతం ఉపాద్యాయలు ఎదుర్కొంటున్న ధీర్ఘకాలిక సమస్యలపై పోరాటం సాగించి వాటి పరిష్కారానికి కృషిచేస్తామని వ్యాఖ్యానించారు. ఈ మహాసభలకు ఉపాద్యాయులు భారీగా తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో డీటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి దత్తాద్రి, జామ్ ఉన్నత పాఠశాల ప్రధానోపాద్యాయులు రమేష్‌రావు, ఉపాద్యాయులు తదితరులు పాల్గొన్నారు.