బ్రేక్!
Published Wed, Jun 21 2017 10:53 PM | Last Updated on Tue, Sep 5 2017 2:08 PM
ఉపాధ్యాయ బదిలీలు తాత్కాలిక నిలుపుదల?
– ఏకీకృత సర్వీసు రూల్స్ ఫైల్‌పై రెండు, మూడు రోజుల్లో రాష్ట్రపతి ముద్ర
– సర్వీసు రూల్స్ కారణంతో తెలంగాణలో బదిలీలు నిర్వహించని ప్రభుత్వం
– ఏపీలో ముందస్తు కసరత్తు లేకుండా బదిలీల షెడ్యూల్
– ఉపాధ్యాయుల నుంచి వ్యతిరేకత రావడంతో పునరాలోచన
కర్నూలు(సిటీ): రెండు దశాబ్దాలుగా పాఠశాల విద్యాశాఖలో పెండింగ్‌లో ఉన్న ప్రభుత్వ, పంచాయతీరాజ్ ఉపాధ్యాయుల ఏకీకృత సర్వీసు నిబంధనల సమస్యకు రెండు మూడు రోజుల్లో తెరపడనుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల నుంచి బదిలీలపై తీవ్ర వ్యతిరేకత రావడంతో సర్వీసు రూల్స్ ఆమోదాన్ని అడ్డు పెట్టుకొని వాయిదా వేసేందుకు ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. వాస్తవానికి ఏకీకృత సర్వీసు రూల్స్‌పై కేంద్ర ప్రభుత్వం ఇటీవలే పరిష్కారం చేసేందుకు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే మంగళవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ఫైల్‌పై సంతకం చేయడంతో ఇక ఉమ్మడి సర్వీసు నిబంధనలకు మార్గం సుగమమైంది. రాష్ట్రపతి ఆమోదం కోసం రాష్ట్రపతి భవన్‌కు ఈ ఫైలు చేరింది.
దీనిపై రెండు మూడు రోజుల్లో రాష్ట్రపతి ఆమోద ముద్ర వేయనున్నారు. ఈ విషయం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు ముందుగానే సమాచారం ఉంది. అయితే తెలంగాణ ప్రభుత్వం సర్వీసు రూల్స్ ఫైల్ ఆమోదం పొందితే ఉపాధ్యాయుల బదిలీలకు ఇబ్బందులు వస్తాయనే కారణంతో వాయిదా వేసింది. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం ఎలాంటి కసరత్తు లేకుండా ఉపాధ్యాయుల బదిలీలు, హేతుబద్ధీకరణపై షెడ్యూల్ జారీ చేసింది. ఈ షెడ్యూల్ జారీ అయినప్పటి నుంచి ఉపాధ్యాయ వర్గాల్లో తీవ్ర గందరగోళం నెలకొంది. దీంతో పాటు ఇందుకు జారీ చేసిన మార్గదర్శకాలపై ఉపాధ్యాయ వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుంది. ఈ వ్యతిరేకత నుంచి ప్రభుత్వం బయటపడేందుకు కొత్త ఎత్తుగడ వేసినట్లు సమాచారం. ఇందులో భాగంగానే బదిలీల షెడ్యూల్‌లో రోజుకో రకమైన ఉత్తర్వులు ఇస్తున్నారనే విమర్శలు ఉపాధ్యాయ వర్గాల నుంచి వ్యక్తమవుతున్నాయి.
తప్పుని కప్పిపుచ్చుకునేందుకే బదిలీల షెడ్యూల్
టీచర్ల బదిలీలు, హేతుబద్ధీకరణపై ముందుగా ఉపాధ్యాయ సంఘాలతో సమావేశం ఏర్పాటు చేసి వేసవిలోనే చేస్తామని మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు పదో తరగతి పరీక్షలు జరుగుతున్న సమయంలో ప్రకటించారు. అయితే ఆర్థిక వెసలుబాటు, అధికార పార్టీ నాయకుల అండదండలతో కొంతమంది ఉపాధ్యాయులు తమకు అవసరమైన స్కూళ్లకు బదిలీ చేయించుకునేందుకు అడ్డదారులు తొక్కారు. ఇందుకు అధికార పార్టీకి చెందిన ఓ మంత్రి తన బామ్మర్ది ద్వారా ఒక్కో బదిలీకి రూ.2లక్షల నుంచి రూ.3.50 లక్షలు మామూళ్లు తీసుకొని బదిలీ చేయిస్తున్నారనే విషయమై విమర్శలు రావడం, ఈ విషయంపై సీఎం సైతం సదరు మంత్రిపై అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది.
బదిలీల కోసం ఒక్క ఏప్రిల్ నెలలోనే 2వేలకు పైగా దరఖాస్తులు రావడంతో రాష్ట్ర వ్యాప్తంగా భారీగానే అక్రమ బదిలీలు జరిగినట్లు విమర్శలు వచ్చాయి. వీటి నుంచి బయటపడేందుకే ప్రభుత్వం స్కూళ్లు పునఃప్రారంభించే ముందు హడావుడిగా ఎలాంటి ముందస్తు కసరత్తు లేకుండా బదిలీలు, హేతుబద్ధీకరణ షెడ్యూల్ జారీ చేయడంతోనే తీవ్ర గందరగోళం నెలకొంది. దీని నుంచి బయట పడేందుకు ప్రభుత్వం ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపి రాష్ట్రపతి ముద్ర కోసం వెళ్లిన ఏకీకృత సర్వీసు రూల్స్ నిబంధనల ఫైల్‌ను తనకు అనుకూలంగా మార్చుకునేందుకే తాత్కాలికంగా ఉపాధ్యాయుల బదిలీలు నిలుపుదల చేయాలనే ఆలోచనకు వచ్చినట్లు తెలిసింది. బుధవారం బదిలీల్లో వెబ్ కౌన్సెలింగ్, పని ఆధారిత పాయింట్లను రద్దు చేయాలని ఫ్యాప్టో–జాక్టోల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా డీఈఓల కార్యాలయాల ముట్టడితోనే ప్రభుత్వం ఈ నిర్ణయానికి వచ్చినట్లు ఉపాధ్యాయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
ఏకీకృత సర్వీసు ఫైల్ ఆమోదం పొందితే..
రాష్ట్రంలో ఖాళీగా ఉన్న డైట్, బీఎడ్ కళాశాలల ప్రిన్సిపాళ్లు, అధ్యాపకుల ఖాళీల భర్తీలో భాగంగా హైస్కూళ్ల టీచర్లు, హెచ్‌ఎంలకు అవకాశం లభిస్తుంది. అదేవిధంగా రెగ్యులర్ ఎంఈఓల నియామకం చేపట్టే వీలుంటుంది. ఎస్జీటీలకు స్కూల్ అసిస్టెంట్‌లుగా ప్రమోషన్ వస్తుంది. ఆ తర్వాత సీనియార్టీ జాబితా తయారు చేసి పదోన్నతులు, బదిలీలు చేపట్టాల్సి ఉంటుంది. ఇదిలాఉంటే ప్రస్తుతం నిర్వహిస్తున్న హేతుబద్ధీకరణ మాత్రం యథావిధిగా సాగుతుంది.
Advertisement
Advertisement