అధికారంలోకి రావాలంటే ఏం చేద్దాం!
కాంగ్రెస్ నేతలతో కుంతియా
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావాలంటే ఏం చేయాలన్న అంశంపై పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి రామచంద్ర కుంతియా ఆదివారం గాంధీభవన్‌లో ముఖ్యనేతలతో సమాలోచనలు జరిపారు. మల్లు భట్టివిక్రమార్క, పొన్నాల లక్ష్మయ్య, రేణుకాచౌదరి, దామోదర రాజనర్సింహ, దానం నాగేందర్, పొన్నం ప్రభాకర్, జగ్గారెడ్డి, పొంగులేటి సుధాకర్‌రెడ్డి తదితరులతో ఆయన విడివిడిగా సమావేశమై వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు.
రాష్ట్రంలో టీఆర్ఎస్ వైఫల్యాలపై పాదయాత్ర చేస్తానని పార్టీ ఇన్చార్జి కుంతియాకు చెప్పినట్టుగా టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టివిక్రమార్క వెల్లడించారు. పార్టీ ముఖ్యనేతలందరినీ కలుపుకొని పోవాలని మాజీ ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ సూచించారు. ప్రస్తుత నాయకత్వం ఏకపక్షంగా పనిచేస్తోందని ఆరోపించారు. మూడు నెలలకోసారి భారీ బహిరంగసభను నిర్వహించాలని, ఒక్కో జిల్లాలో ఒక్కో అంశంపై సభను పెట్టాలని జగ్గారెడ్డి సూచించారు.