మరోసారి నేపాల్ ప్రధానిగా ప్రచండ ఎన్నిక
ఖాట్మండ్ : నేపాల్ నూతన ప్రధానమంత్రిగా మావోయిస్టు పార్టీ చీఫ్ పుష్ప కమాల్ దహాల్ అలియాస్ ప్రచండ మరోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీంతో ఆయన రెండోసారి నేపాల్ ప్రధాని పీఠాన్ని అధిరోహించనున్నారు. చివరి నిమిషంలో సీపీఎన్-యూఎంఎల్ ప్రధాని పోటీ నుంచి తప్పుకుంది. దీంతో ప్రచండ ఎన్నిక ఏకగ్రీవం అయింది.
కాగా మధేసి ప్రాంత పార్టీల నుంచి కీలక మద్దతు లభించడంతో ప్రచండ మంగళవారం నామినేషన్ వేసిన విషయం తెలిసిందే. ప్రచండ అభ్యర్థిత్వాన్ని నేపాలీ కాంగ్రెస్ (ఎన్సీ) నేత దేవ్బా ప్రతిపాదించగా మావోయిస్టు నేత మహరా బలపరిచారు. కొత్త ప్రభుత్వానికి మధేసి పార్టీలు మద్దతిచ్చేలా, మావోయిస్టు పార్టీలు ఒప్పందం చేసుకున్నాయి. 595 మంది సభ్యులున్న పార్లమెంట్లో మధేసీ పార్టీల బలం 42 మంది. ప్రభుత్వంలోనూ చేరతామని ఇవి సంకేతాలిచ్చాయి. మావోయిస్టు పార్టీ మద్దతు వాపసుతో యూఎంఎల్ నేత ఓలి ప్రధాని పదవికి గతవారం రాజీనామా చేశారు.
దేశ రాజ్యాంగాన్ని అనుసరించి సభలో మెజారిటీని నిరూపించుకోవాల్సి ఉండగా.. 61 ఏళ్ల సీపీఎన్-మావోయిస్టు సెంటర్ చీఫ్‌కు అనుకూలంగా 363 ఓట్లు రాగా, వ్యతిరేకంగా 210 ఓట్లు వచ్చాయి. మొత్తం 595 మంది సభ్యులకుగాను 22 మంది ఓటు వేయలేదు. సభలో అతి పెద్ద పార్టీ అయిన నేపాలీ కాంగ్రెస్‌తోపాటు యునెటైడ్ డెమొక్రటిక్ మధేసి ఫ్రంట్, ఫెడరల్ అలయెన్స్‌లకు చెందిన సభ్యులు, మరికొన్ని చిన్న పార్టీలు ప్రచండకు మద్దతు పలికాయి.
ప్రచండ ఎన్నికైనట్టు స్పీకర్ ఒన్సారి ఘర్తీ ప్రకటించారు. ప్రచండ దేశ 39వ ప్రధానిగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఎన్నిక నేపథ్యంలో ప్రచండ మాట్లాడుతూ.. దేశాన్ని ఆర్థికాభివృద్ధి పథంలో నడిపిస్తానని హామీ ఇచ్చారు. దేశంలోని ప్రతి ఒక్కర్నీ ఏకం చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నానని, ఈ సమస్యను పరిష్కరించే బాధ్యతను తాను తీసుకుంటానని చెప్పారు. కొత్త రాజ్యాంగాన్ని తీవ్రంగా నిరసిస్తున్న వర్గాలమధ్య వారధిగా నిలుస్తానని భరోసా ఇచ్చారు.
ప్రధానిగా రెండోసారి...
ప్రచండ ప్రధాని పదవిని అధిష్టించబోవడం ఇది రెండోసారి. ఆయన గతంలో 2008 నుంచి 2009 మధ్యకాలంలో ప్రధానిగా కొద్దికాలం పనిచేశారు. దేశ ప్రధాని పీఠాన్ని రెండుసార్లు అధిరోహిస్తున్న ఏకైక కమ్యూనిస్టు నేత ఆయనే. గత నెలలో మావోయిస్టు పార్టీ మద్దతు ఉపసంహరించడంతో సీపీఎన్-యూఎంఎల్ చైర్మన్ కేపీ శర్మ ప్రధాని పదవికి రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో ప్రచండ సారథ్యంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన బలం కోసం నేపాలీ కాంగ్రెస్, మావోయిస్టు పార్టీలు మధేసి ఫ్రంట్‌తో మూడు సూత్రాల ఒప్పందం చేసుకున్నాయి.
మధేసి ఉద్యమం సందర్భంగా చనిపోయినవారిని అమరులుగా గుర్తించాలని, గాయపడిన వారికి ఉచిత చికిత్స అందించాలన్న డిమాండ్‌తోపాటు ప్రొవిన్షియల్ సరిహద్దులను మార్చుతూ రాజ్యాంగాన్ని సవరించాలనేది మధేసి ఫ్రంట్ డిమాండ్. కాగా మావోయిస్టుపార్టీ, నేపాలీ కాంగ్రెస్, సీపీఎన్-యునెటైడ్, రాష్ట్రీయ ప్రజాతంత్ర పార్టీలకు చెందిన వారితో చిన్న మంత్రివర్గాన్ని ప్రచండ గురువారం ప్రకటించే అవకాశముంది.
ప్రచండకు మోదీ ఫోన్
ను భారత ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు. మోదీ స్వయంగా ఫోన్ చేసి ప్రచండకు శుభాకాంక్షలు తెలియజేశారు. భారత పూర్తి మద్దతు నేపాల్‌కు ఉంటుందని హామీఇచ్చారు. భారత్‌ను సందర్శించాల్సిందిగా కూడా ప్రచండను ఆయన ఆహ్వానించారు.