బీజేపీపై లెఫ్ట్ మాటల దాడి
రిఫరెండం కాదనడం
బీజేపీ అసమర్ధతకు నిదర్శనం
న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ(బీజేపీ)పై కమ్యూనిస్తు పార్టీలు పదునైన మాటలతో విమర్శల వర్షం కురిపించాయి. ఈ ఎన్నికల ఫలితాలతో బీజేపీ చరిత్రను తిరగరాసిందని, ఇది మోదీ పాలనపై రిఫరెండం కాదనడం వారి అసమర్థతకు నిదర్శనమని వ్యాఖ్యానించాయి. ఈ తొమ్మిది నెలల కాలంలో బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ల సేవలో తరించిందనే సత్యాన్ని ప్రజలు ఈ ఎన్నికల్లో నిర్మొహమాటంగా తెలియజేశారని సీపీఐ(ఎం), సీపీఐ పార్టీలు విమర్శించాయి. కేవలం మూడు స్థానాల్లో గెలవడం ద్వారా లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్కు ఎదురైన పరాభవాన్ని మించిన ఓటమిని బీజేపీ మూటగట్టుకుందన్నాయి.
అప్పటి ఫలితంతో కాంగ్రెస్కు ప్రతిపక్ష హోదా కూడా లభించలేదని, ఇప్పుడు ఢిల్లీ ఎన్నికలతో బీజేపీ కూడా ప్రతిపక్షహోదా కోల్పోయిందని చెప్పాయి. ఈ మేరకు సీపీఐ(ఎం) పోలిట్ బ్యూరో సభ్యుడు సీతారాం ఏచూరి ‘పీపుల్స్ డెమోక్రసీ’ అనే ఎడిటోరియల్ వ్యాసంలో పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో ఎదురైన ఫలితంతో బీజేపీ నాయకులు మోదీని కాపాడేందుకు ఇది కేంద్ర పాలనపై రిఫరెండం కాదని చెబుతున్నారన్నారు. ఎవరు ఏం చెప్పినా ఈ ఎన్నికలు ఆర్ఎస్ఎస్, బీజేపీపై ప్రభావం చూపడం మాత్రం వాస్తవమన్నారు. బీజేపీని తీవ్రంగా వ్యతిరేకించడం ద్వారా నరేంద్రమోదీకి ఇక్కడి ప్రజలు గుణపాఠం చెప్పారని తెలిపారు. ఈ ఎన్నికల విజయం చేకూర్చడం ద్వారా ఆమ్ ఆద్మీ పార్టీపై ప్రజలు పెద్ద బాధ్యత మోపారని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో ప్రజల ఆశలను ఏవిధంగా ఆప్ ప్రభుత్వ నెరవేరుస్తుందనే విషయాన్ని కాలమే నిర్ణయిస్తుందన్నారు.
మరోవైపు సీపీఐ... ‘న్యూ ఏజ్’ పత్రిక ఎడిటోరియల్లో బీజేపీపై విమర్శలు కురిపించింది. గత తొమ్మిది నెలల కాలంలో కార్పొరేట్, విదేశీ పెట్టుబడిదారులకు మాత్రమే అనుకూలంగా బీజేపీ వ్యవహరించిందనే విషయాన్ని ఈ ఎన్నికల ద్వారా ఇక్కడి ఓటర్లు తెలియజెప్పారంది. నల్లధనం, అవినీతి, ధరల పెరుగుదలను నియంత్రిస్తామని చేసిన హామీలను బీజేపీ విస్మరించిందని పేర్కొంది.