అకృత్యాలకు అడ్డుకట్ట కార్నర్ మీటింగ్స్
ముంబైలోని మురికివాడల్లో ఉదయం పూట మహిళాపోలీసులు ‘కార్నర్ మీటింగ్స్’ నిర్వహిస్తున్నారు. ప్రతి వీధిలోని ఒక మూల మీద అక్కడ పోగైన స్త్రీలకు, పిల్లలకు ‘గుడ్ టచ్, బ్యాడ్ టచ్’తో మొదలు డ్రగ్స్, ట్రాఫికింగ్, సైబర్ క్రైమ్ల గురించి వివరిస్తున్నారు. పెద్దగా చదువులేని మహిళలకు ఈ వీధిమలుపు మీటింగ్లు మేలుచేస్తున్నాయి. నిజానికి ప్రతి రాష్ట్రంలో, ప్రతి బస్తీల్లో ఇలాంటి కార్నర్ మీటింగ్ల అవసరం ఉంది.
నగరాల్లోని గేటెడ్ కమ్యూనిటీల్లో ఉన్న స్త్రీల భద్రత గురించి కొంతైనా నిశ్చింత ఉంది. కాని ఇవే నగరాల్లో, పెద్ద పట్టణాల్లోని మురికివాడల్లోని, బస్తీల్లోని స్త్రీల, పసిపిల్లల భద్రత చాలా కష్టతరమైనది. చట్టపరంగా ఎంత కట్టుదిట్టాలు ఉన్నా స్వీయ అవగాహన లేకపోతే ప్రమాదం తప్పదు. మన దేశంలో నిత్యం పసి పిల్లల మీద అకృత్యాలు పెరుగుతూనే ఉన్నాయి.
తప్పిపోతున్న పిల్లల సంఖ్య తీవ్రంగా ఉంది. మరోవైపు అసంఘటిత రంగాల్లో స్త్రీలపై లైంగిక దాష్టికాలు కొనసాగుతూనే ఉన్నాయి. చదువు లేని స్త్రీలు ఈ విషయమై ఎవరితో చెప్పుకోవాలో తెలియక బాధ పడతారు, ఆందోళన చెందుతారు. అందుకే ముంబైలో మహిళా పోలీసులు ‘కార్నర్ మీటింగ్’ లు నిర్వహిస్తున్నారు.
సంవత్సరం క్రితం
సంవత్సరం క్రితం పోలీసు అధికారుల సూచన మేరకు మహిళా పోలీసులతో మొదలైన ఈ పని సత్ఫలితాలను ఇస్తోంది. ముంబైలోని అతి పెద్ద మురికివాడలకు రోజూ ఉదయం పూట మహిళా పోలీసు బృందాలు చేరుకుని వీధి మూలల్లో ఆడవాళ్లను కూడేసి జాగ్రత్తలు చెప్పడమే ఈ కార్నర్ మీటింగ్ల ఉద్దేశం. ఆడపిల్లలకు అర్థమయ్యేలా ‘గుడ్ టచ్ బ్యాడ్ టచ్’ల గురించి చెప్పడం మరో ముఖ్య ఉద్దేశం.
అపరిచితులకు పిల్లల్ని అప్పగించి పనుల్లోకి వెళ్లకుండా చూడటం, మొబైల్ ఫోన్లలో వచ్చే కేటుగాళ్ల కాల్స్ వల్ల ఆర్థికంగా నష్టపోకుండా చూడటం కూడా కార్నర్ మీటింగ్ల ముఖ్యవిధిగా ఉంది. ‘రోజూ పది నుంచి పదకొండు గంటల మధ్య బస్తీ స్త్రీలు ఖాళీగా దొరుకుతారు. వారికి అన్ని విధాలా కౌన్సెలింగ్ ఇచ్చి అలెర్ట్ చేస్తాం. చిన్నచిన్న ఫ్యాక్టరీల్లో పని చేసే స్త్రీలు లైంగికపరంగా వేధింపులను ఎదుర్కొంటే ఫిర్యాదు చేయమని చెబుతాం. దీని వల్ల దౌర్జన్యకారుల్లో భయం ఏర్పడుతోంది’ అంటున్నారు మహిళా పోలీసులు.
అలాగే వ్యభిచార వృత్తిలోకి ఈడ్చబడే స్త్రీల, బాలికలను కాపాడే బాధ్యత వారి గురించి సమాచారం ఇచ్చే చైతన్యం కూడా బస్తీ మహిళలకు కలిగిస్తున్నారు. మత్తు పదార్థాల వల్ల జరిగే హాని చెబుతున్నారు. నిజానికి ఈ పని ముంబైలోనే కాదు దేశంలోని ప్రతి నగరంలో చదువులేని బీదసాదలు ఉండే అన్నీ ఊళ్ల వాడల్లో జరగాలి. సత్ఫలితాలు ఇస్తున్న ఈ పనిని మిగిలిన రాష్ట్రాల్లోని పోలీసులు కూడా అనుసరిస్తే బాగుంటుంది.