కష్టపడితే కోటీశ్వరులవుతారు
సాక్షి, హైదరాబాద్: ‘రైతు ఆత్మహత్యలు జరగాలని ఎవరూ కోరుకోరు. కొంతమంది ఆత్మహత్యలకు పాల్పడటం బాధాకరం. కష్టపడితేనే రైతులు కోటీశ్వరులవుతారు. ప్రభుత్వం ఎవరికీ కూర్చో పెట్టి తిండిపెట్టదు. రాయితీలు ఇచ్చి తోవ చూపిస్తుంది’ అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. బుధవారం హైదరాబాద్ పాత పబ్లిక్ గార్డెన్స్‌లో జరిగిన ‘పాలీహౌస్ రైతులు, పాలీహౌస్‌లు నిర్మించే కంపెనీల పరిచయ వేదిక’లో మంత్రి పాల్గొన్నారు.
పాలీహౌస్ నిర్మాణ కంపెనీలు ఏర్పాటు చేసిన స్టాళ్లను సందర్శించిన అనంతరం వివిధ జిల్లాల నుంచి తరలి వచ్చిన రైతులను ఉద్దేశించి మంత్రి ప్రసంగించారు. ‘ప్రభుత్వ కార్యక్రమాల్లో లోపాల వల్లే ఆత్మహత్యలు జరుగుతున్నాయి. ఏటా పెట్టుబడి కోసం అప్పులు చేస్తుండటంతో రైతులకు ఏమీ మిగలడం లేదు. అధికారులు వారి భుజం తట్టి ప్రోత్సహించాలి.
రైతులు సాగు మానేస్తే దేశం తలకిందులవుతుంది. రాయితీలు, ప్రభుత్వ పథకాల కోసం దరఖాస్తు చేసుకునే రైతులకు తక్షణమే పరిష్కారం చూపాలి. లేదంటే పరిశ్రమల శాఖ తరహాలో సకాలంలో సమస్యలు పరిష్కరించని అధికారులకు జరిమానా విధిస్తాం’ అని పోచారం హెచ్చరించారు.
నాబార్డు నుంచి వెయ్యి కోట్ల రూపాయలు
ఈ ఏడాది 55 వేల హెక్టార్లకు డ్రిప్ ఇరిగేషన్ సౌకర్యం కల్పించాలని లక్ష్యంగా పెట్టుకోగా, 1.25 లక్షల ఎకరాల మేర దరఖాస్తులు అందాయని, అందరికీ రాయితీనిచ్చేందుకు నాబార్డు నుంచి రూ.వేయి కోట్లు సాయం కోరాం’ అని మంత్రి పోచారం వెల్లడించారు. పాలీహౌస్ నిర్మాణాలకు గతంలో గరిష్టంగా ఎకరం విస్తీర్ణంలో అనుమతి ఇవ్వగా, ప్రస్తుతం మూడు ఎకరాలకు పెంచామన్నారు.
సబ్సిడీని 50 నుంచి 75శాతానికి పెంచినట్లు చెప్పారు. రాష్ట్రంలో 40 లక్షల ఎకరాలను డ్రిప్, పాలీహౌస్ సాగు పరిధిలోకి తీసుకు రావడం లక్ష్యంగా పనిచేస్తామన్నారు. పంటల బీమా పథకం లోపభూయిష్టంగా వున్న విషయాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని మంత్రి పోచారం వెల్లడించారు.