ఆమె ఇంటర్ ఫెయిల్.. ఐటీ కంపెనీ ఎండీనా
మాది జమ్మికుంట మండలం చల్లూరు. అమ్మనాన్న సరోజన–బక్కారెడ్డి. నేను ఇంట్లో మూడో కూతుర్ని. అమ్మ నాన్న వ్యవసాయం చేసేవారు. అందరిలాగానే నేను ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నా. 1993–94లో పదో తరగతిలో సాధారణ మార్కులతోనే పాస్ అయ్యాను. 1994–96 జమ్మికుంటలోని ప్రభుత్వ కాలేజీలో ఇంటర్ హెచ్ఈసీ చదివాను. చదువుపై పెద్దగా ఆసక్తి చూపకపోవడంతో ఇంటర్ ఫెయిల్ అయ్యాను. అయినా బాధపడలేదు. కానీ అమ్మనాన్న నాకు పెళ్లి చేయాలని నిశ్చయించారు. వారి మాట కూడా కాదనలేదు. గోదావరిఖనికి చెందిన సింగరేణి కార్మికుడు శంకర్‌రెడ్డి కుమారుడు సంపత్‌రెడ్డికి ఇచ్చి 1997లో పెళ్లి చేశారు.
సాక్షి,పెద్దపల్లి:
కాలక్షేపం కోసం టైలరింగ్..
పెళ్లి అయినా నా ఆలోచన ఎప్పుడూ ఏదైనా సాధించాలని ఉండేది. గృహిణిగా ఇంట్లో కాలక్షేపం కాకపోవడంతో స్నేహితురాళ్లతో కలిసి కుట్టు పని నేర్చుకున్నా. ఇంట్లోనే లేడీస్ టైలర్ నడిపించాను. మధ్యలో ఆగిన చదువు గురించి బెంగ పెట్టుకోకుండా తిరిగి ప్రారంభించాలనుకున్నా. 2003లో కాకతీయ ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీలో చేరా. మూడేళ్లలో 2006లో అన్ని సబ్జెక్టులు పాస్ అయ్యాను.
కంప్యూటర్ టీచర్‌గా...
2006లో భర్త, పిల్లలం కరీంనగర్‌కు షిఫ్ట్ అయ్యాం. అక్కడే ఓ ప్రైవేటు స్కూల్లో కంప్యూటర్ టీచర్‌గా రూ.1500 జీతానికి పనిచేశాను. టీచర్‌గా పని చేస్తూనే ఎస్ఆర్ఎం పీజీ కాలేజీలో ఎంబీఏ పూర్తి చేశాను. కాకతీయ ఓపెన్ యూనివర్సిటీలో టాపర్‌గా నిలిచాను. జమ్మికుంటకు చెందిన డిగ్రీ లెక్చరర్ మల్లికార్జున్‌రావు, ఎంబీఏ ప్రొఫెసర్ శ్రీధర్ నాలోని ప్రతిబను గుర్తించి ప్రోత్సహించారు. వారిని ఎప్పటికీ మర్చిపోను. 2008లో కుటుంబంతో కలిసి హైదరాబాద్ వెళ్లాం. ఓ ఐటీ కంపెనీలో ఇంటర్వ్యూకు వెళ్లాను. హెచ్ఆర్గా ఎంపికయ్యాను. 2010లో మలేషియా, సింగపూర్‌లో జరిగిన ఐటీ కంపెనీల సెమినార్లో పాల్గొన్నాను. అక్కడికి వచ్చిన ప్రతినిధులను చూసి నాకూ ఓ కంపెనీ ఏర్పాటు చేయాలనే ఆలోచన వచ్చింది.
డెర్రాన్ ఐటీ సొల్యూషన్స్..
సింగపూర్ నుంచి హైదరాబాద్ తిరిగొచ్చిన తర్వాత 2011లో డెర్రాన్ ఐటీ సొల్యూషన్స్ పేరుతో కంపెనీ ప్రారంభించాను. ఉద్యోగం చేసి సంపాదించిన మొత్తంతోపాటు భర్త ఆర్థిక సహకారం.. అత్తింటివారి ప్రోత్సాహం నాకు కలిసి వచ్చాయి. సింగపూర్‌లో ఏర్పడిన వివిధ కంపెనీల ప్రతినిధుల పరిచయాలతో ఓ మల్టీనేషనల్ కంపెనీలతో అనుబంధం ఏర్పాటు చేసుకున్నాం. అయినా ప్రాజక్టు పనుల కోసం రెండు మూడేళ్లు ఇబ్బంది పడ్డాం. పెళ్లి సమయంలో అమ్మానాన్న పెట్టిన నగలు కూడా బ్యాంకులో కుదువ పెట్టాను. కరెంటు బిల్లు కట్టేందుకు డబ్బులు లేకపోతే మా అక్కలు ఇద్దరు సహాయం చేశారు.
రాత్రి రెండు గంటల వరకు కూడా ఆఫీసులో పనిచేసిన సందర్భాలు అనేకం.. ఓసారి ముంబయి కంపెనీకి చెందిన వారు బిజినెస్ గురించి మాట్లాడుతూ కనీసం కారు లేదు.. బిల్లులు ఎలా పేమెంట్ చేస్తారంటూ ఎగతాళి చేశారు. ఇలాంటి సంఘటనలు నాలో పట్టుదలను మరింత పెంచాయి. ప్రాజెక్టులు రాక ప్రారంభమైన తర్వాత.. ఉద్యోగుల సహకారంతో ఎలాంటి ఎర్రర్స్ లేకుండా తయారు చేసి ఇచ్చాం. దీంతో కంపెనీలకు నమ్మకం పెరిగింది. ఆ తర్వాత వెనుదిరిగి చూసుకోలేదు. అప్లికేషన్ డెవలప్మెంట్, ఈ పబ్లికేషన్స్, మొబైల్ అప్లికేషన్స్, మార్కెటింగ్ ప్రాజెక్టు తయారు చేసి అందిస్తున్నాం. తొమ్మిదేళ్లుగా విజయవంతంగా ప్రాజెక్టులు తయారు చేస్తున్నాం.
20 మందితో కంపెనీ ప్రారంభం..
ఓ ఐటీ కంపెనీలో పనిచేసిన అనుభవం సొంతగా ఐటీ కంపెనీ ఏర్పాటుకు ప్రోత్సహించింది. హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో 20 మందితో ఐటీ కంపెనీ స్థాపించాను. ప్రాజెక్టులు పెరిగే క్రమంలో వందలాది మందికి ఉద్యోగాలు కల్పించాం. హైటెక్‌సిటీ, సైబర్టవర్స్లో కంపెనీ నడిపించిన సమయంలో ఆటుపోట్లు ఎదుర్కొన్నాను. ప్రాజెక్టులు రాకపోయినా ఉద్యోగులకు జీతాలు ఇవ్వాల్సి వచ్చేది. మా సంస్థలో పనిచేసి అవకాశాలు పొందిన సుమారు రెండు వేల మందికి ప్రముఖ కంపెనీల్లో అవకాశం రావడంతో విదేశాల్లో స్థిరపడ్డారు. ఏడాది క్రితం వైజాగ్‌లో మార్కెటింగ్ బ్రాంచ్ ప్రారంభించాం. ప్రస్తుతం రెండు బ్రాంచిల్లో కలిపి 200 మంది పనిచేస్తున్నారు. తొమ్మిది సంవత్సరాలుగా సోషల్‌వర్కర్‌గా పనిచేస్తున్నా. నాకు ఉమెన్ ప్రొటెక్షన్ కౌన్సిల్లో షీటీంలో సలహాదారుగా అవకాశం కల్పించారు. యాంటీ కరప్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా(ఏసీసీఐ) తెలంగాణ రాష్ట్ర చైర్‌పర్సన్‌గా పనిచేస్తున్నా.
కుటుంబం..
మంజుల భర్త సంపత్‌రెడ్డి హైదరాబాద్‌లోని ఓ మీడియా సంస్థలో పనిచేస్తున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. కూతురు దీప్తి ప్రస్తుతం ఎంబీబీఎస్ ఫైనలియర్ చదువుతోంది. కుమారుడు నిఖిల్‌రెడ్డి ఇంజినీరింగ్ ఫైనలియర్ చదువుతున్నాడు.
లక్ష్యం ఉంటే ఏదైనా సాధ్యమే..
టెన్త్, ఇంటర్లలో తప్పినంత మాత్రాన బాధపడాల్సిన అవసరం లేదు. ఏడాది, రెండేళ్లు గ్యాప్ తీసుకుని తిరిగి చదువుకుంటే అనుకున్న లక్ష్యాన్ని చేరుకోగలుగుతాం. గ్యాప్ తీసుకోవడం ద్వారా దీక్ష పెరుగుతుంది. సులభంగా పై చదువులకు వెళ్లగలుగుతాం. నాతోపాటు చాలామంది ఇదే విధంగా పైకి వచ్చిన వారు ఉన్నారు. ఒక గృహిణిగా ఉంటూ చదువుల తల్లి ప్రసన్నం పొందాను. ఐటీ కంపెనీ స్థాపించి 200 మందికి ఉద్యోగాలు కల్పించాను. మా సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులు రెండు పీజీలు చేసిన వారు సైతం ఉన్నారు. అందులో పరీక్షలు తప్పి తిరిగి పాసై ఆపైన జీవితంలో సక్సెస్ అయిన వారు చాలామంది ఉన్నారు.
– మంజుల, ఐటీ కంపెనీ ఎండీ