మహిళా ఉద్యోగులపై ఎండీ అఘాయిత్యం
ఆయన ఓ కంపెనీకి ఎండీ. దేశంలోని వివిధ ప్రాంతాలకు అధికారిక పర్యటనల కోసం తనతో పాటు కొంతమంది ఉద్యోగినులను కూడా తీసుకెళ్లేవాడు. అలా వెళ్లినపుడు మత్తు మందు ఇచ్చి వారిపై అత్యాచారం చేయడమే కాక, దాన్ని వీడియో కూడా తీసేవాడు. ఈ విషయమై కంపెనీ ఉద్యోగినులు ముగ్గురు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతడిని అరెస్టు చేయడానికి రంగం సిద్ధమైంది. బెంగళూరులోని మైకో లే అవుట్ ప్రాంతానికి చెందిన భానుప్రకాష్.. ఎంజీ రోడ్డులో ప్రైవేటు హెల్త్ కన్సల్టెన్సీ నిర్వహిస్తాడు. టెలి మార్కెటింగ్ ఉద్యోగాలంటూ అతడు అమ్మాయిలను నియమించుకుంటాడు.
శిక్షణ పేరు చెప్పి వాళ్లను వివిధ ప్రాంతాలకు తీసుకెళ్లేవాడు. వాళ్లకు మత్తుమందు ఇచ్చి తన హోటల్ గదిలో అత్యాచారం చేసేవాడు. పోలీసులకు ఫిర్యాదు చేస్తామని వాళ్లు అంటే.. వాళ్లకు వీడియో చూపించి.. దాన్ని ఇంటర్‌నెట్‌లో పెడతానని తమను బెదిరించేవాడని బాధిత యువతులు వాపోయారు. ఆ తర్వాత కూడా పదే పదే వాళ్లను బెదిరిస్తూ తన కోరిక తీర్చుకునేవాడట. ఎట్టకేలకు ధైర్యం చేసిన బాధితులు.. నగర పోలీసు కమిషనర్‌ను ఆశ్రయించారు. ఈ ఘటనపై వెంటనే విచారణ జరపాలని ఆయన సంబంధిత అధికారులను ఆదేశించారు.