కల్లుతాగి వ్యక్తి మృతి
♦ కల్తీ కల్లే కారణమని బంధువుల ఆందోళన
♦ కల్లు కంపౌండ్ ధ్వంసం, మృతదేహంతో రాస్తారోకో
♦ పోలీసుల జోక్యంతో శాంతించిన కుటుంబసభ్యులు
వికారాబాద్ రూరల్ : కల్లుతాగి కిందపడి ఓ వ్యక్తి మృతి చెందాడు. మృతుడి కుటుంబీకులు ఆగ్రహంతో కల్లు కంపౌండ్ ధ్వంసం చేసి మృతదేహంతో రాస్తారోకో నిర్వహించారు. ఈ సంఘటన వికారాబాద్ మున్సిపల్ పరిధిలో శుక్రవారం చోటు చేసుకుంది. వివరాలు.. మున్సిపల్ పరిధిలోని కొత్తగడి గ్రామానికి చెందిన నూరోద్దీన్(30) శుక్రవారం ఉదయం సమీపంలోని కంపౌండ్‌లో కల్లు తాగి బయటకు వచ్చి కిందపడిపోయాడు. గమనించిన స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలించే యత్నం చేయగా అంతలోనే మృతి చెందాడు. దీంతో ఆగ్రహించిన మృతుడి కుటుంబీకులు, స్థానికులు కల్లు కంపౌండ్‌ను ధ్వంసం చేశారు.
కల్లు సీసాలు పగులగొట్టారు. కల్తీకల్లుతోనే నూరోద్దీన్ మృతిచెందాడని మండిపడ్డారు. మృతదేహంతో వికారాబాద్-సదాశివపేట రో డ్డుపై బైఠాయించి రాస్తారోకో చేశారు. సుమారు రెండు గంటల పాటు వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. పోలీసులు సముదాయించినా ఆందోళనకారులు వినిపించుకోలేదు. న్యాయం జరిగేలా చూస్తామని సీఐ రవి వారికి సర్దిచెప్పారు. దీంతో మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. ఈమేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ప్రయాణికుల ఇబ్బందులు
రాస్తారోకోతో దాదాపు రెండు గంటల పాటు వాహనాలు పూర్తిగా స్తంభించిపోయాయి. సుమారు 2 కిలో మీటర్ల మేర నిలిచిపోయాయి. ఈ రహదారి వికారాబాద్, సదాశివపేటకు ప్రధాన రహదారి కావడం మరో దారి వెళ్లడానికి లేక వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అనంతరం పోలీసులు ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు.