computer education
-
అనుకోకుండా అదృష్టం.. సెల్ఫీలతో కోటీశ్వరుడు అయ్యాడు
డబ్బులు సంపాదించడానికి మార్గాలు అనేకం. ఈ ఇన్స్టంట్ రోజుల్లో.. ఈజీగా మనీని, అదీ చిన్నవయసులో సంపాదించేవాళ్లను సైతం చూస్తున్నాం. వీళ్లలో చాలామంది కష్టంతో ఎదిగిన వాళ్లు ఉండొచ్చు!. కానీ, కష్టపడకుండా కేవలం ఫోటోలతో.. కోట్లు సంపాదించి మిలీయనీర్‌గా ఎదిగిన వ్యక్తి గురించి ఎప్పుడైనా మీరు విన్నారా!. సుల్తాన్ గుస్తాఫ్ అల్ ఘోజాలీ.. ఇండోనేషియా సెంట్రల్ సిటీ ఆఫ్ సెమరాంగ్ యూనివర్సిటీ కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్. ఘోజాలి గత ఐదేళ్లుగా దాదాపు ప్రతిరోజూ తన కంప్యూటర్ ముందు కూర్చొని సెల్ఫీలు తీసుకునేవాడు. ఇలా అతను దాదాపు వెయ్యి సెల్ఫీలను తీసుకున్నాడు. పైగా తన గ్రాడ్యుయేషన్ డే కోసం టైమ్‌లాప్స్ వీడియోను కూడా రూపొందించాలని ప్లాన్ చేశాడు. ఈలోపు సరదాగా బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ గురించి తెలుసుకుని.. అందులో తన సెల్ఫీలను ఆన్లైన్లో ఎన్ఎఫ్టీలుగా విక్రయించాలని నిర్ణయించుకున్నాడు. తన సెల్ఫీలను ఎవరు కొంటారో చూద్దాం అని తమషాగా చేశాడు. సెల్ఫీని కేవలం మూడు డాలర్లు(రూ.223)గా కోట్ చేశాడు. కానీ, అతను కూడా ఊహించని రేంజ్లో సెల్పీలకు డిమాండ్ పెరిగింది. మరోవైపు క్రిప్టోకరెన్సీ ‘ఈథర్’ ఎఫెక్ట్‌తో ఒక్కో సెల్ఫీ రూ 60 వేలు పలికింది. ఈ క్రమంలో ఒక ప్రముఖ సెలబ్రిటీ చెఫ్ తన సోషల్ మీడియా ఖాతాలో ఘోజాలీ సెల్ఫీని ప్రమోట్ చేశాడు. ఆ ప్రభావంతో ఘోజాలీ సెల్ఫీ అమ్మకాలు అమాంతం ఊపందుకున్నాయి. దీంతో ఘోజాలీ సుమారు రూ 7 కోట్లు పైనే సంపాదించగలిగాడు. ఏదిఏమైన సరదాగా తమాషాకి చేసిన పని అతన్ని కోటీశ్వరుడిగా చేయడం విశేషం. (చదవండి: ఆ పుర్రే పురాతన కాలం నాటి అడ్వాన్స్డ్ సర్జరీకి ప్రతీక!) -
ఒక వ్యాను.. కొన్ని ల్యాప్ టాప్స్
నోయిడా: ‘మా స్కూళ్లో 9వ తరగతి నుంచి కంప్యూటర్ నేర్పిస్తారు. కానీ నేను ల్యాప్ టాప్ ఆపరేట్ చేయడం 8వ తరగతిలోనే నేర్చుకుంటున్నా’ అని 8వ తరగతి చదువుతున్న సులేఖా కుమారి గర్వంగా చెప్పడం మనకు కాస్త వింతగానే ఉండొచ్చు. ఇక డాక్టర్ చదవాలనుకుంటున్న 12వ తరగతి విద్యార్థని రుచికి అయితే ఇప్పటివరకు కంప్యూటర్ గురించి ఎలాంటి అవగాహనా లేదు. ఈ 12 ఏళ్ల కాలంలో ఆమెకు ఎక్కడా కంప్యూటర్ శిక్షణ ఇవ్వలేదు. ప్రైమరీ స్థాయిలోనే కంప్యూటర్ అవసరమైన ఈ రోజుల్లో ఇంకా ఇలాంటివారు ఉన్నారంటే ఆశ్చర్యం కలగక మానదు. ప్రస్తుతం ఏడెనిమిదేళ్ల లోపు చిన్నారులు సైతం కంప్యూటర్ ను చాలా చక్కగా ఆపరేట్ చేసేస్తున్నారు. దాదాపు అన్ని స్కూళ్లలోనూ చిన్నప్పటి నుంచే కంప్యూటర్ నేర్పించడం తప్పనిసరి అయింది. కానీ నోయిడా సెక్టార్ లోని గార్హి చౌఖండి అనే గ్రామం మాత్రం ఈ విషయంలో చాలా వెనకపడి పోయింది. 9వ తరగతిలోకి వచ్చిన తర్వాతే వారికి కంప్యూటర్ పాఠాలు ప్రారంభమవుతున్నాయి. దీంతో పట్టణ ప్రాంత విద్యార్థులతో పోలిస్తే ఈ గ్రామానికి చెందిన విద్యార్థులు చాలా వెనకబడి ఉంటున్నారు.కానీ ఇదంతా రెండు నెలల క్రితం సంగతి. ‘కంప్యూటర్ క్లాసెస్ ఆన్ వీల్స్’ పేరుతో ఓ మొబైల్ శిక్షణ కేంద్రం ఈ గ్రామానికి రావడంతో వీరి జీవితాల్లో ఓ నూతన అధ్యాయం మొదలైంది. నిరుపేదలైన విద్యార్థినులకు కంప్యూటర్ బోధన అందించాలనే లక్ష్యంతో శ్రీ నారాయణ్ సాంస్క్రతిక్ చేతన ట్రస్ట్ రెండు నెలల క్రితం ఈ మొబైల్ శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించింది. ‘మా స్కూళ్లో కూడా కొన్ని కంప్యూటర్లు ఉన్నాయి. కానీ వాటిలో ఏదీ సరిగా పనిచేయదు. దీంతో మాకు పుస్తకాల ద్వారానే కంప్యూటర్ గురించి నేర్పిస్తారు. మా నాన్న వడ్రంగి పని చేస్తాడు. ఈ క్లాస్ కు వచ్చేవరకు కూడా నాకు లాప్టాప్ ఎలా ఆపరేట్ చేయాలో తెలియదు’ అని విద్యార్థిని సులేఖ చెప్పింది. ప్రస్తుతం సులేఖతో పాటు 80 మంది విద్యార్థినులు ఇక్కడ శిక్షణ పొందుతున్నారు. ‘నేను డాక్టర్ కావాలనుకుంటున్నాను. కానీ అది అంత సులభం కాదన్న సంగతి నాకు తెలుసు. పట్టణ ప్రాంత విద్యార్థులతో పోలిస్తే ఇంగ్లిష్, కంప్యూటర్ వంటి విషయాల్లో నేను చాలా వెనకబడి ఉన్నాననే విషయమూ తెలుసు. అందువల్ల ఇప్పుడు కంప్యూటర్ పై కనీస అవగాహన కలిగి ఉండటం నాకు చాలా ముఖ్యం’ అని రుచి అంటోంది. సులేఖ, రుచి వంటి పేద విద్యార్థినులకు దీపమాల రాణి అండగా నిలబడ్డారు. ప్రతిరోజూ నాలుగు బ్యాచ్ ల విద్యార్థినులకు కంప్యూటర్ పాఠాలు బోధిస్తూ వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తున్నారు. వెబ్ డిజైనింగ్ లో డిప్లమో గ్రాడ్యయేట్ అయిన రాణి.. పేద విద్యార్థినులకు అండగా నిలవాలని ఎప్పుడో నిర్ణయించుకున్నారు. తన చదువు పూర్తికాగానే ఎలాంటి ఆలస్యం చేయకుండా రంగంలోకి దిగారు. ‘నేను నోయిడాలో కొన్నాళ్లు ఉన్నాను. నగరంతో పోలిస్తే అక్కడి విద్యార్థినులకు కంప్యూటర్ బోధన అవకాశాలు చాలా పరిమితం. అందువల్లే నేను టీచర్ గా పనిచేయాలని నిర్ణయించుకున్నా. నా చదువు అక్కడి విద్యార్థినులకు ఉపయోగించడం నాకు ఎనలేని ఆనందాన్నిస్తోంది‘ అని రాణి చెబుతున్నారు. ‘సమాజంలోని పేదవర్గాలకు సహాయం చేసేందుకు ఈ ట్రస్ట్ నెలకొల్పాం. మేం ఓసారి గర్హి చౌఖండి గ్రామాన్ని సందర్శించినప్పడు అక్కడి విద్యా వ్యవస్థ సక్రమంగా లేదనే విషయాన్ని గుర్తించాం. అందుకే ఓ కంప్యూటర్ స్కూల్ నడపాలని నిర్ణయించాం‘ అని ట్రస్ట్ వ్యవస్థాపకుడు రాజన్ శ్రీవాత్సవ తెలిపారు.