ఒక వ్యాను.. కొన్ని ల్యాప్ టాప్స్
ఒక వ్యాను.. కొన్ని ల్యాప్ టాప్స్
Published Fri, Sep 23 2016 4:59 PM | Last Updated on Mon, Sep 4 2017 2:40 PM
నోయిడా: ‘మా స్కూళ్లో 9వ తరగతి నుంచి కంప్యూటర్ నేర్పిస్తారు. కానీ నేను ల్యాప్ టాప్ ఆపరేట్ చేయడం 8వ తరగతిలోనే నేర్చుకుంటున్నా’ అని 8వ తరగతి చదువుతున్న సులేఖా కుమారి గర్వంగా చెప్పడం మనకు కాస్త వింతగానే ఉండొచ్చు. ఇక డాక్టర్ చదవాలనుకుంటున్న 12వ తరగతి విద్యార్థని రుచికి అయితే ఇప్పటివరకు కంప్యూటర్ గురించి ఎలాంటి అవగాహనా లేదు. ఈ 12 ఏళ్ల కాలంలో ఆమెకు ఎక్కడా కంప్యూటర్ శిక్షణ ఇవ్వలేదు. ప్రైమరీ స్థాయిలోనే కంప్యూటర్ అవసరమైన ఈ రోజుల్లో ఇంకా ఇలాంటివారు ఉన్నారంటే ఆశ్చర్యం కలగక మానదు. ప్రస్తుతం ఏడెనిమిదేళ్ల లోపు చిన్నారులు సైతం కంప్యూటర్ ను చాలా చక్కగా ఆపరేట్ చేసేస్తున్నారు.
దాదాపు అన్ని స్కూళ్లలోనూ చిన్నప్పటి నుంచే కంప్యూటర్ నేర్పించడం తప్పనిసరి అయింది. కానీ నోయిడా సెక్టార్ లోని గార్హి చౌఖండి అనే గ్రామం మాత్రం ఈ విషయంలో చాలా వెనకపడి పోయింది. 9వ తరగతిలోకి వచ్చిన తర్వాతే వారికి కంప్యూటర్ పాఠాలు ప్రారంభమవుతున్నాయి. దీంతో పట్టణ ప్రాంత విద్యార్థులతో పోలిస్తే ఈ గ్రామానికి చెందిన విద్యార్థులు చాలా వెనకబడి ఉంటున్నారు.కానీ ఇదంతా రెండు నెలల క్రితం సంగతి. ‘కంప్యూటర్ క్లాసెస్ ఆన్ వీల్స్’ పేరుతో ఓ మొబైల్ శిక్షణ కేంద్రం ఈ గ్రామానికి రావడంతో వీరి జీవితాల్లో ఓ నూతన అధ్యాయం మొదలైంది. నిరుపేదలైన విద్యార్థినులకు కంప్యూటర్ బోధన అందించాలనే లక్ష్యంతో శ్రీ నారాయణ్ సాంస్క్రతిక్ చేతన ట్రస్ట్ రెండు నెలల క్రితం ఈ మొబైల్ శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించింది. ‘మా స్కూళ్లో కూడా కొన్ని కంప్యూటర్లు ఉన్నాయి. కానీ వాటిలో ఏదీ సరిగా పనిచేయదు. దీంతో మాకు పుస్తకాల ద్వారానే కంప్యూటర్ గురించి నేర్పిస్తారు. మా నాన్న వడ్రంగి పని చేస్తాడు. ఈ క్లాస్ కు వచ్చేవరకు కూడా నాకు లాప్టాప్ ఎలా ఆపరేట్ చేయాలో తెలియదు’ అని విద్యార్థిని సులేఖ చెప్పింది.
ప్రస్తుతం సులేఖతో పాటు 80 మంది విద్యార్థినులు ఇక్కడ శిక్షణ పొందుతున్నారు. ‘నేను డాక్టర్ కావాలనుకుంటున్నాను. కానీ అది అంత సులభం కాదన్న సంగతి నాకు తెలుసు. పట్టణ ప్రాంత విద్యార్థులతో పోలిస్తే ఇంగ్లిష్, కంప్యూటర్ వంటి విషయాల్లో నేను చాలా వెనకబడి ఉన్నాననే విషయమూ తెలుసు. అందువల్ల ఇప్పుడు కంప్యూటర్ పై కనీస అవగాహన కలిగి ఉండటం నాకు చాలా ముఖ్యం’ అని రుచి అంటోంది. సులేఖ, రుచి వంటి పేద విద్యార్థినులకు దీపమాల రాణి అండగా నిలబడ్డారు. ప్రతిరోజూ నాలుగు బ్యాచ్ ల విద్యార్థినులకు కంప్యూటర్ పాఠాలు బోధిస్తూ వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తున్నారు.
వెబ్ డిజైనింగ్ లో డిప్లమో గ్రాడ్యయేట్ అయిన రాణి.. పేద విద్యార్థినులకు అండగా నిలవాలని ఎప్పుడో నిర్ణయించుకున్నారు. తన చదువు పూర్తికాగానే ఎలాంటి ఆలస్యం చేయకుండా రంగంలోకి దిగారు. ‘నేను నోయిడాలో కొన్నాళ్లు ఉన్నాను. నగరంతో పోలిస్తే అక్కడి విద్యార్థినులకు కంప్యూటర్ బోధన అవకాశాలు చాలా పరిమితం. అందువల్లే నేను టీచర్ గా పనిచేయాలని నిర్ణయించుకున్నా. నా చదువు అక్కడి విద్యార్థినులకు ఉపయోగించడం నాకు ఎనలేని ఆనందాన్నిస్తోంది‘ అని రాణి చెబుతున్నారు. ‘సమాజంలోని పేదవర్గాలకు సహాయం చేసేందుకు ఈ ట్రస్ట్ నెలకొల్పాం. మేం ఓసారి గర్హి చౌఖండి గ్రామాన్ని సందర్శించినప్పడు అక్కడి విద్యా వ్యవస్థ సక్రమంగా లేదనే విషయాన్ని గుర్తించాం. అందుకే ఓ కంప్యూటర్ స్కూల్ నడపాలని నిర్ణయించాం‘ అని ట్రస్ట్ వ్యవస్థాపకుడు రాజన్ శ్రీవాత్సవ తెలిపారు.
Advertisement
Advertisement