కంప్యూటర్ విద్య.. అదో మిథ్య
పెనుమంట్ర, న్యూస్‌లైన్ : విద్యార్థులకు ప్రాథమిక దశనుంచే కంప్యూటర్ విద్యపై అవగాహన కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో ప్రవేశపెట్టిన కంప్యూటర్ విద్య మిథ్యగా మారింది. కేంద్ర ప్రభుత్వం కోట్లాది రూపాయలు వెచ్చించి అమల్లోకి తెచ్చిన ఈ కార్యక్రమం విద్యార్థులకు ఉపయోగపడకపోగా, మరోవైపు వందలాది మంది కంప్యూటర్ ఫ్యాకల్టీ (బోధనా సిబ్బంది)ని రోడ్డున పడేసింది. కంప్యూటర్ విద్య అటకెక్కడంతో ఇప్పటికే 440 మంది బోధకులు ఉద్యోగాలను కో ల్పోగా, వచ్చే నెలలో మరో 24మంది రోడ్డున పడనున్నారు.
మూడేళ్ల ముచ్చట...
జిల్లాలో 279 ఉన్నత పాఠశాలల్లో 2010లో కంప్యూటర్ విద్యాబోధన చేపట్టారు. ఇందుకోసం ప్రతి పాఠశాలకు ఇద్దరు చొప్పున ఫ్యాకల్టీలను నియమించారు. ఐదేళ్లపాటు విద్యార్థులకు కంప్యూటర్ పాఠాలు బోధించే బాధ్యతను ఒక ప్రైవేటు కంపెనీకి అప్పగించారు. ఆ కంపెనీ ఒక్కొక్క పాఠశాలకు ఒక జనరేటర్, 11 కంప్యూటర్లు, ఫ్యాన్లు, ఫర్నిచర్‌ను సరఫరా చేయడంతోపాటు, ఇద్దరేసి ఫ్యాకల్టీలను కూడా నియమించింది. వారికి తొలుత రూ.1,400 జీతం నిర్ణయించగా, కొంతకాలానికి రూ.2వేలకు పెంచారు. 2011లో కంప్యూటర్ టీచర్స్ 3 నెలలకు పైగా సమ్మె చేయడంతో జీతాన్ని రూ.2,600కు పెంచింది. ఈ ఏడాది సెప్టెంబర్ 15న 196, నవంబర్ 15 నాటికి 24 పాఠశాలలకు కంపెనీ కాంట్రాక్టు పూర్తికావడంతో కంప్యూటర్ ల్యాబ్‌లకు తాళంవేసి కంప్యూటర్లను ప్రధానోపాధ్యాయులకు సదరు కంపెనీ అప్పగించింది. ఫ్యాకల్టీలను విధుల నుంచి తప్పించింది. దీంతో 440 మంది ఉద్యోగులు రోడ్డునపడాల్సి వచ్చింది. మిగిలిన 12 పాఠశాలల్లో పనిచేస్తున్న 24 మంది జనవరి 30నాటికి కాంట్రాక్ట్ ముగియనుండటంతో వారుకూడా నిరుద్యోగులుగా మారనున్నారు. మరో 47 పాఠశాలల కు మాత్రం 2014 చివరి వరకూ గడువు వుంది. ఇదిలావుండగా, కంప్యూటర్ ల్యాబ్‌లు మూతపడటం, ఫ్యాకల్టీలను తొలగించడంతో 232 పాఠశాలల్లో కంప్యూటర్ విద్యాబోధన నిలిచిపోరుుంది.