విందామా... ప్రకృతి గీతం
ప్రకృతి నుండి వచ్చే వివిధ వైవిధ్యభరితమైన ధ్వనులు...... పక్షుల కువకువలు, నదీ ప్రవాహాలు, గాలి వీచికలు, సాగర ఘోషలు, జలపాత జోరులు, తుమ్మెద ఝంకారాలు, కీటక శబ్దాలు... వెరసి భూమి మనకు అందించే సంగీత కచేరి. ఆ దృష్ట్యా చూసేవారికీ భూమి అద్భుత సంగీతకారిణిగా గోచరిస్తుంది. నదులు, వాగులు, సాగరాలను, సెలయేళ్ల గలగలలను వివిధ సంగీత సాధనాలను వాయించే సంగీతకారులుగా చేసి, పక్షుల కుహూ కుహూలను గాత్రధారులను చేసి, ఈ అద్భుత మేళవింపుతో మనకు సంగీతాన్ని వినిపించే గొప్ప సంగీతవేత్త. శోధించ గలిగేవారికి మరెన్నో వివిధ సంప్రదాయ సంగీతాలు, అనేక రాగాలను శ్రవణానందకరంగా వినిపించే గొప్ప సంగీత దర్శకురాలు.
అవును. భూమికి సంగీతం ఉంది. వినగలిగేవారికి అది సంగీతాన్ని వినిపిస్తుంది. అయితే మనం దృష్టి సారించి చూసి, తెలుసుకోగలగాలి. వినగలగాలి. అసలు మనకు జిజ్ఞాస, వినే మనస్సుండాలి.
ఈ భూమి, దీని మీద నివసించే మానవులు, ప్రకృతి జంతుకోటి చేసే కదలికలకు, శబ్దాలకు లేదా ధ్వనులకు, ఓ తూగు, ఊగు, లయ ఉంటుంది. వాటికి మనస్సును పులకింపచేసే ఒక శక్తి ఉంది. అవి వీనులకు విందు కలిగిస్తాయి. ఓ హాయినిస్తాయి. మనస్సుకు ఒక ప్రశాంతతనిచ్చి, ఒక అలౌకిక ఆనందానికి లోను చేస్తాయి. అనేకమంది కవులు, రచయితలు భూమి వినిపించే సంగీతం గురించి చక్కగా వర్ణించారు విశ్వవ్యాప్తంగా. అది వాల్మీకి, వ్యాసుడు, కాళిదాసు, షేక్స్పియర్, కీట్స్, వర్డ్స్వర్త్ లాంటి వాళ్ళు ఎవరైనా కావచ్చు.
నదులు ప్రవాహపు తీరు వినసొంపుగా ఉంటుంది. ప్రవహించే భూ విస్తీర్ణాన్ని బట్టి వివిధ రకాలుగా నది ధ్వనిస్తుంటుంది. అవన్నీ చెవులకు హాయినిస్తాయి. నదులను తనలో కలుపుకునే సముద్రం నిరంతరం గర్జిస్తూనే ఉంటుంది. పర్వతాల, కొండల మీదనుండి భూమి ఒడిని చేరాలని తహతహలాడుతూ దుందుడుకుగా దూకే ఝరులు వీక్షకుల గుండెలను ఝల్లుమనిపిస్తూ విభ్రాంతిని కలిగించినా శ్రవణాలకు ఒకే సంగీత వాద్యాన్ని వందలమంది వాయించినంత అనుభూతినిస్తాయి. ఇహపరమైన ఇక్కట్లను, బాధను కొద్దిసేపైనా మనం మరిచేటట్టు చేస్తుంది. శ్రవణానందకరమైన ఏ శబ్దమైనా మనసును రసమయం చేయగల మహత్తును కలిగి ఉంటుంది. గాలి ఈలలు వేస్తుందని, ఎన్నెన్నో ఊసులు చెప్పగలదని ఎంతమందికి తెలుసు? వేసవి తాపాన్ని తొలగిస్తూ మనస్సులను ఝల్లుమనిపిస్తూ భూమిని ముద్దాడటానికి అనూహ్యమైన వేగంతో వచ్చే తొలకరిజల్లు శ్రవణ పేయమై మన ఉల్లాన్ని ఆనందలహరిలో ప్రవహింప చేయదూ!
తెలతెలవారుతుండగానే చెట్ల మీద ఉండే పక్షులు బద్ధకాన్ని వదిలించుకునే క్రమంలో ఒళ్ళు విరుచుకుంటూ, రెక్కల సవరింపులో చేసే విదిలింపులు, టపటపలు, గొంతు సవరించుకుంటూ చేసే కిల కిలకిలలు ఉదయపు నడకలో ఉన్నవారికి నిత్యానుభవమే. తెల్లవారుతోందన్న సంగతిని సూచిస్తూ... కొక్కోరో కో.. అని కుక్కుటం చేసే శబ్దం మేలుకొలుపుకు చిహ్నం. సూర్యాస్తమయాన్ని సూచించే ఇంటికి వడివడిగా చేరుకునే పశువుల గిట్టల శబ్దాలు ఒక వింత ధ్వనిని చేస్తూ... ముచ్చటను కలుగచేస్తాయి.
ఈ భూమి మీద జంతువులు కూడ నివసిస్తున్నాయి. మనుషుల స్వరాలలోని వైచిత్రి వాటిలో కూడ చూస్తాము. అడవికి రాజుగా భాసిల్లే సింహం చేసే గర్జన, మదమెక్కిన గజరాజు పెట్టే ఘీంకారం, చెడు భావనను కలిగించే నక్కల ఊళలు, పాము బుసలు, శిరోభారాన్ని, చికాకును కలిగించే కీచురాళ్ళ ధ్వనులు మనలను భీతిల్లేటట్లు చేస్తాయి.
మానవ ప్రమేయం లేక ప్రకృతి చేసే శబ్దాలను అనాహతమని, మానవ ప్రేరితంగా వచ్చే శబ్దాలను లేదా ఆహతమని అంటారు. మన ఊపిరి నిలిపేందుకు నిరంతరం పరిశ్రమించే ఊపిరితిత్తుల ఉచ్వాస నిశ్వాసాలలో ఓ లయ ఉంది. శ్రుతి ఉంది. ఇవి సంగీత ధ్వనులే. మన ప్రాణాన్ని నిలిపే గుండె లబ్.. డబ్ ల ధ్వనిని ఎంత లయబద్ధంగా చేస్తుంది! శ్రుతి లయలలో రవ్వంత అపశ్రుతి వచ్చినా ఫలితం మరణమే కదా! మన శరీరాన్ని.. నాదమయం.. అన్నారు ప్రాజ్ఞలు. నాదం ఒక ప్రాణశక్తి.
సంగీతానికి మనసును పరవశింపచేసే శక్తి ఉంది. ఒక గొప్ప సంగీత గాత్రధారి ఆలాపన చాలు మనల్ని తన్మయులను చేయటానికి. మాటను చక్కగా ఉచ్చరిస్తూ, కావలసిన ఊనికనిస్తూ మాటలలోని భావాన్ని గొంతులో పలికిస్తూ భాషించే వ్యక్తి సంభాషణ శ్రోతలనలరిస్తుంది. ఈ పోహళింపులకు మాధుర్యాన్ని జోడిస్తూ పాడగల పశువుల కాపరి పాట మనలను ఎంతగా అలరించగలదో, అంతగానే ఉన్నత శ్రేణి కి చెందిన సంగీతకళాకారుని త్యాగరాజ కీర్తన కూడ.
ఇంతటి మహత్తును కలిగి ఉన్న సంగీతాన్ని భూమి మనకు నాదరూపంలో అందిస్తుంది. దీన్ని ఆనందించి పరవశించి, దాన్ని ఒక అనుభూతి చేసుకుని మనసు పొరల్లో పొదవుకోగల ఏకైక బుద్ధిజీవి మానవుడు ఒక్కడే. భూమి తన సంగీతంతో మన మనస్సుకు ఎంతో ప్రశాంతతను, సాంత్వన చేకూర్చి మనలను ఆనంద రసజగత్తులోవిహరించేయగల ఓ గొప్ప సంగీతజ్ఞురాలు. ఈ ఆనందస్థితిలో మనిషి తన విధిని చక్కగా నిర్వర్తించగలడు. ఈ ఆనందమే స్వర్గమైతే దీన్ని మనకు అందచేసే భూమి స్వర్గ తుల్యమే. దీన్ని మనం కాపాడుకోవాలి. సంరక్షించుకోవాలి. జీవనశైలి, నాగరికత, సాంకేతికతలనే పేరుతో దీన్ని విధ్వంసం చేసే హక్కు మనకెక్కడుంది? ఇప్పటికే ఈ గ్రహం మీద మన జీవితాన్ని నరకప్రాయం చేసుకున్నాం. ఈ భూ గ్రహాన్ని పూర్తిగా ఓ అగ్నిగుండంగా మార్చి భావితరానికి కానుకగా ఇద్దామా!
ప్రస్తుతానికి మనిషి నివసించే, నివసించగల ఒకే ఒక గ్రహం ఈ భూమి. మన ముందు తరాలు, మన తరం నివసించిన ఈ.. ఆనందనిలయాన్ని... ముందు తరాలకు అందించే బాధ్యత మనందరిదీ.
పక్వానికొచ్చిన పంటను పడతులు ఒకచేత ఒడుపుగా పట్టుకుని మరొక చేత కొడవలితో కోసే వేళ అది చేసే శబ్దంలో క్రమముంటుంది. అది సంగీతమే! కోసిన కంకులను మోపులుగా కళ్లాలలో కర్రలతో కొడుతున్నవేళ, తూర్పార పట్టే వేళ చేట చెరుగుళ్ల శబ్దాలు ఒక వింత ధ్వనిని చేస్తాయి. ఎంత ఆహ్లాదాన్నిస్తాయి! ఒకనాటి పల్లెటూళ్లు చక్కని సంగీత కచేరిలు చేస్తుండేవి. పాలు పితికే క్షణాన ఆ ధార పాత్రను తాకుతున్నప్పుడు వచ్చే ధ్వనికి ఓ లయ ఉంది. తరుణులు పెరుగును చిలికే వేళ కవ్వం, కవ్వపు తాడు చేసే ధ్వని, కవ్వపు గుత్తి కుండను తాకే శబ్దానికి ఎంత లయ! వీటికి తోడు అ ఆ మగువల చేతిగాజులు చేసే ధ్వని ఓ నాదమే.
–బొడ్డపాటి చంద్రశేఖర్, ఆంగ్లోపన్యాసకులు