యుద్ధం జరుగుతోందనుకున్నాం
పారిస్ : పారిస్ నగరంలో జరిగిన ఉగ్రదాడికి బలైన ప్రదేశాల్లో బాటాక్లాన్ కూడా ఒకటి. అక్కడో సంగీత కార్యక్రమం జరుగుతోంది. అక్కడంతా కోలాహలంగా ఉంది. చాలా ఉత్సాహంగా, మ్యూజిక్ బ్యాండ్‌తో హోరెత్తుతోంది. ఇంతలో అక్కడ ఒక్కసారిగా కాల్పుల మోతతో దద్దరిల్లిపోయింది. అక్కడి ప్రత్యక్ష సాక్షుల కథనాలను బీబీసీ రిపోర్టు చేసింది.
మ్యూజిక్ కన్సర్ట్ చాలా ఉత్సాహంగా ఉంది.. పెద్ద సౌండుతో సంగీతం వినిపిస్తోంది. ఇంతలో సడన్‌గా కాల్పులు వినిపించాయి. భీకరమైన అరుపులు. చుట్టూ చూశా.. ముసుగు ధరించిన ఉన్న ఒక నీడ లాంటి రూపం నావైపు చూస్తోంది. అంతోలోనే నా వైపు గురి పెట్టి కాల్పులు జరిపింది. తృటిలో నేను బతికిపోయాను. కానీ పక్కన వ్యక్తి చనిపోయాడు..
ఏం జరుగుతోందో అర్థం కాలేదు.. భీకరమైన కాల్పులు. దాదాపు అందరూ నేలపైన పడుకున్నారు. మరికొంతమంది ఇక్కడ యుద్ధం జరుగుతోందని అరుస్తూ నాలుగు వైపులా భయాందోళనలతో పరుగులు తీస్తున్నారు. మేం పక్కనే ఉన్న కెఫే లో దాక్కున్నాం. యుద్ధం జరుగుతోందని ఎవరో అరవగానే అందరూ నమ్మారు. ఎక్కడివాళ్లక్కడ నేలమీద పడుకుండిపోయాం.. భారీ ఎత్తున సైరన్ లు వినిపిస్తున్నాయి... భయంతో వణికిపోయాం. తర్వాత వెనక డోర్ నుంచి మమ్మల్ని తప్పించారంటూ కాల్పుల నుంచి తృటిలో తప్పించుకున్న వారు చివురుటాకుల్లా వణికిపోతూ బీబీసీ న్యూస్ తో తమ భయంకరమైన అనుభవాలను గుర్తు చేసుకున్నారు.