బెజవాడలో హోంగార్డ్ అభ్యర్థుల ఆందోళన
విజయవాడ : విజయవాడలో సీఐడీ హోంగార్డ్ అభ్యర్థుల ఎంపికలో గందరగోళం నెలకొంది. చివరి నిమిషంలో ఇంటర్వ్యూలు వాయిదా పడ్డాయి. దాంతో అభ్యర్థులు ఇందిరా స్టేడియం వద్ద శనివారం ఉదయం రాస్తారోకోకి దిగి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా బందర్ రోడ్డులో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. 32 పోస్టుల కోసం సుమారు 3500 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఇంటర్వ్యూ వాయిదాపై తమకు ఎలాంటి సమాచారం లేదని, చివరి నిమిషంలో వాయిదా వేయటంపై అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఐడీ డౌన్ డౌన్ ...అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా ఏసీపీ లావణ్య లక్ష్మి ఘటనా స్థలానికి చేరుకుని, అభ్యర్థులకు నచ్చచెప్పారు. 32 పోస్టుల కోసం సుమారు 25వేల అప్లికేషన్లు వచ్చాయని, అయితే వాటిని ఇంకా వెరిఫై చేసే ప్రక్రియ పూర్తి కానందున ఇంటర్వ్యూలు వాయిదా పడినట్లు చెప్పారు. ఈ సమాచారాన్ని డిసెంబర్ 24న అన్ని దినపత్రికల్లో ప్రకటన ఇచ్చినట్లు ఏసీపీ తెలిపారు. అయితే అభ్యర్థులకు సమాచారం అందటంలో లోపం వల్లే ఈ గందరగోళం నెలకొందని ఆమె వివరణ ఇచ్చారు. ఇంటర్వ్యూలు తిరిగి ఎప్పుడు నిర్వహిస్తారనేది త్వరలోనే వెల్లడిస్తామనివ లావణ్య లక్ష్మి తెలిపారు. దాంతో చేసేది లేక అభ్యర్థులు నిరాశతో వెనుదిరిగారు.