Conflicts raise
-
జనసేనలో భగ్గుమన్న విభేదాలు
సాక్షి, మదనపల్లె: జనసేన పార్టీలో కార్యకర్తల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. మదనపల్లెలోని పార్టీ కార్యాలయంలో జనసేన రాయలసీమ కో–కన్వీనర్ గంగారపు రాందాస్‌చౌదరి కళ్లెదుటే చేనేత విభాగం రాష్ట్ర కార్యదర్శి అడపా సురేంద్రపై జిల్లా ప్రధాన కార్యదర్శి దారం అనిత దూషిస్తూ దాడికి దిగారు. తన జోలికి వస్తే ఎవరినీ వదిలేది లేదంటూ చివరికి ఘటనను కవరేజ్ చేస్తున్న మీడియాను సైతం దూషించారు. వీరిద్దరి మధ్య కొంత కాలంగా విభేదాలు ఉన్నాయి. పార్టీలో దారం అనిత ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, కార్యకర్తలను పార్టీకి దూరం చేస్తోందని అడపా సురేంద్ర రాష్ట్ర కార్యవర్గానికి ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో పార్టీ అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌పై రాష్ట్ర మంత్రులు చేసిన వ్యాఖ్యలపై మదనపల్లెలో సోమవారం జనసేన రాయలసీమ కో–కన్వీనర్ గంగారపు రాందాస్‌చౌదరి, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి జంగాలశివరాం ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. దీనికి అడపా సురేంద్ర హాజరుకాగా దారం అనిత రాలేదు. సమావేశం ముగిసి కార్యకర్తలు బయలుదేరే సమయానికి కార్యాలయానికి వచ్చిన అనిత నేరుగా అడపాసురేంద్రపై బూతులు మాట్లాడుతూ దాడికి దిగారు. అక్కడే ఉన్న కార్యకర్తలు అడ్డుకునేందుకు ప్రయత్నిస్తే వారిని బూతులు తిడుతూ వీరంగం ప్రదర్శించారు. పార్టీలో తనకు అన్యాయం చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. హఠాత్తుగా జరిగిన ఈ పరిణామంతో కార్యకర్తలు, నాయకులు విస్తుపోయారు. దాడి చేసిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. పరువు పోయిందని భావించిన రాందాస్‌చౌదరి ఇరువురి మధ్య రాజీ ప్రయత్నాలు ప్రారంభించారు. చదవండి: (సీఐ గారి రైస్‌మిల్ కథ!.. సుప్రియ పేరుతో) -
ఎవరితోనూ విభేదాలు లేవు
సాక్షి, గద్వాల: పార్టీలో కానీ, మా మధ్య ఎలాంటి విబేధాలు లేవని ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, అబ్రహాం అన్నారు. గత రెండు రోజులుగా పత్రికల్లో వస్తున్న విషయాలను ఎమ్మెల్యేలు ఇరువురూ ఖండించారు. ఆదివారం సాయంత్రం స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీ, మంత్రి, మా మధ్య కానీ బేధాభిప్రాయాలు లేవన్నారు. వ్యక్తిగత కారణాలతోనే గన్మెన్లను సరెండర్ చేశానని తెలియజేశారు. ప్రజాస్వామ్యంలో భద్రత అవసరం లేదని భావించినట్లు పేర్కొన్నారు. ఈ విషయంలో పార్టీకి, మంత్రులకు ఎలాంటి సంబంధం లేదన్నారు. పార్టీని, సీఎం కేసీఆర్, పార్టీ అధ్యక్షులు కేటీఆర్‌ను గౌరవిస్తామని, వారి ఆదేశానుసారం నడిగడ్డ అభివృద్ధికి పని చేస్తామన్నారు. నడిగడ్డపై అభిమానంతో సీఎం కేసీఆర్ అడిగిన వెంటనే తుమ్మిళ్ల, గట్టు ఎత్తిపోతల పథకాలు, సుమారు కోట్లాది నిధులు ఇచ్చారని తెలిపారు. సాంకేతిక కారణాలు, పరిపాలన పరమైన కారణాలతోనే సీఈఓ మార్పు జరిగిందని స్పష్టం చేశారు. అన్ని రంగాల్లో అభివృద్ధికి కృషి అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహం మాట్లాడుతూ కేసీఆర్, కేటీఆర్‌లు మాపై గురుత్వర బాధ్యతలు పెట్టారని అన్నారు. పార్టీ భీ–ఫామ్‌లు ఇచ్చిన కాంగ్రెస్ కంచుకోటగా ఉన్న గద్వాల, అలంపూర్ ప్రాంతాల్లో గులాబీ జెండా ఎగురవేసేలా చేశారన్నారు. జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామన్నారు. నడిగడ్డకు ఇద్దరు ఎమ్మెల్యేలు రెండు కళ్లలాగా ఉండి పని చేస్తామని చెప్పారు. మాలో గ్రూపులు లేవు, తగాదాలు అసలే లేవన్నారు. మమ్మల్ని నమ్మి నడిగడ్డ ప్రజలు అవకాశం కల్పించారని, వారి నమ్మకాన్ని నిలబెడుతూ సీఎం కేసీఆర్ కలలు గంటున్న బంగారు తెలంగాణ దిశగా పని చేస్తామన్నారు. సమావేశంలో జడ్పీ మాజీ చైర్మన్ బండారి భాస్కర్, జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు బీఎస్.కేశవ్, ఎంపీపీలు తిరుమల్‌రెడ్డి, విజయ్, జెడ్పీటీసీ సభ్యుడు ప్రభాకర్‌రెడ్డి, మాజీ ఎంపీపీ సుభాన్ తదితరులు పాల్గొన్నారు. -
టిఫిన్‌బాక్స్ గొడవతో విమానం ఆలస్యం
యశవంతపుర: టిఫిన్ బాక్స్‌ను శుభ్రం చేయడంపై విమానం పైలట్, క్యాబిన్ క్రూ సిబ్బందికి మధ్య జరిగిన గొడవ కారణంగా ఎయిరిండియా విమానం రెండు గంటలు ఆలస్యంగా బయల్దేరింది. సోమవారం బెంగళూరు నుంచి కోల్‌కతా వెళ్లాల్సిన ఏఐ–772 విమానంలో ఈ ఘటన జరిగింది. ఘటనను సీరియస్‌గా తీసుకున్న ఎయిరిండియా విచారణకు రావాల్సిందిగా పైలట్, సిబ్బందిని ఆదేశించింది. మొదట తెచ్చిన లంచ్ చల్లబడటం వల్ల దీనిని వేడి చేసి ఇవ్వాలని కెప్టెన్ విమానంలోని ఓ పురుష అటెండెంట్‌కు సూచించారు. సిబ్బంది అలాగేనని వేడి చేసి తెచ్చిచ్చారు. లంచ్ ఆరగించిన కెప్టెన్, ఖాళీ బాక్స్‌ను శుభ్రం చేసి ఇవ్వాలని ఓ సిబ్బందిని కోరారు. పదేపదే పనులు పురమాయిస్తున్నారంటూ సిబ్బంది కెప్టెన్‌తో ఘర్షణకు దిగాడు. ఇద్దరి మధ్య వాగ్వాదం తీవ్రస్థాయికి చేరింది. కెప్టెన్ అసలు పనిని వదిలేసి గొడవలో మునిగిపోవడంతో విమానం రెండు గంటలు నేలమీదనే ఉండిపోయింది. -
జన్మభూమిలో గందరగోళం
పిట్టలవానిపాలెం: మండలంలోని చందోలు గ్రామంలో బుధవారం జరిగిన జన్మభూమి మాఊరు ఐదవ విడత కార్యక్రమం గందరగోళంగా ముగిసింది. సభ ప్రారంభం వైఎస్సార్ సీపీ, టీడీపీ వర్గీయుల మధ్య వాదనలు, ఘర్షణలు చోటు చేసుకున్నాయి. దీంతో సభలో కొద్ది సేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద జన్మభూమి గ్రామ సభను నిర్వహించకుండా నీలిబంగారయ్య జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో నిర్వహించడం ఏమిటంటూ వైఎస్సార్ సీపీ ముస్లిం మైనార్టీ సెల్ కార్యదర్శి అహ్మద్ హుస్సేన్, గ్రామ పార్టీ అధ్యక్షులు అబ్దుల్ రహీమ్, అజీమ్,రజాక్‌లు అధికారులను నిలదీశారు. గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద సమావేశం నిర్వహణకు స్థలం తక్కువగా ఉండడం వలన పాఠశాల ఆవరణలో నిర్వహించాల్సి వచ్చిందని అధికారులు తెలిపారు. జన్మభూమి గ్రామ సభ గురించి స్థానిక ఎంపీటీసీ సభ్యులకు సమాచారం ఇవ్వలేదని, ప్రోటోకాల్ పాటించకుండా తమను అవమానపరచారని ఎంపీటీసీ సభ్యులు షేక్ బాజి, చేబ్రోలు వీరయ్యలు అధికారుల తీరుపై మండిపడ్డారు. అంతేకాక గ్రామంలో పింఛన్ మంజూరైన లబ్దిదారుల జాబితా ఇవ్వమని కోరితే అధికారులు పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. 135 మంది పింఛన్ కోసం ఆన్లైన్లో దరకాస్తు చేసుకుని ఉంటే 35 మందికి మాత్రమే పింఛన్లు మంజూరు చేశారని ఆరోపించారు. అదేవిధంగా 130 మంది వరకు రేషన్ కార్డుల కోసం దరకాస్తు చేసుకుంటే 30 మందికి మాత్రమే మంజూరు చేయడం అన్యాయంగా ఉందని వాపోయారు. గ్రామానికి చెందిన ముగ్గురు మహిళలు తమకు ఇంటి నివేశనాస్థలాలు లేవని కన్నీరు పెట్టారు. దీంతో సర్పంచి భర్త అఫ్జల్ ముగ్గురికి ఇంటి స్థలంతో పాటు ,ఇళ్ళు నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారు. అర్హత కలిగిన వారికి సంక్షేమ పథకాలు అందకుండా అధికారులు సైతం అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఈవిషయాలపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. ఎంపీటీసీ సభ్యులకు సమాచారం అందించకపోవడం పొరపాటే నని అందుకు మొదటి తప్పుగా మన్నించాలని ఇన్చార్జ్ ఎంపీడీవో గణేష్‌బాబు కోరారు. తాను ఇటీవలే మండలానికి ఇన్చార్జిగా వచ్చానని ఇలాంటి పొరపాటు జరకుండా చూస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచి సుల్తానా బేగం,అఫ్జల్, ఎంపీపీ బీవీ సులోచన, కరెంట్ ఏఈ పెరుగు శ్రీనివాసరావు, మండల ప్రత్యేకాధికారిణి ఉషారాణి, తహసీల్దార్ చిన్నం సుధారాణి, ఈవోపీఆర్డీ వి సుజాత, వెలుగు ఏపీఎం సుజాత, గ్రామ కార్యదర్శి అబ్దుల్ ఖాదర్ జిలాని,ఎంఈఓ వి వెంకటేశ్వరరావు,ఆర్డబ్ల్యూఎస్ ఎఈ బాష,పిఆర్ ఎఈ మోహనరావు,హౌసింగ్ ఏఈ శ్రీనివాసరావు, ఏఓ లోకేశ్వరి, ఏఈఓలు సుదర్శనరావు తదితరులు ఉన్నారు. -
కమిషనర్ వర్సెస్ ఉద్యోగులు
ఒంగోలు టౌన్, న్యూస్‌లైన్ : కలెక్టర్ ప్రత్యేక అధికారిగా ఉన్న ఒంగోలు నగర కార్పొరేషన్ కార్యాలయంలో కమిషనర్ విజయలక్ష్మికి, సిబ్బందికి మధ్య విభేదాలు తీవ్రస్థాయికి చేరాయి. కమిషనర్ వ్యవహారశైలి నచ్చని సిబ్బంది మొత్తం ఏకమయ్యారు. కమిషనర్ విజయలక్ష్మి ఒకవైపు, కార్యాలయంలోని అన్ని విభాగాల సిబ్బంది మరోవైపు గ్రూపులుగా విడిపోయి ఒకరికొకరు ప్రత్యర్థులుగా మారిపోయారు. వీరిమధ్య కొంతకాలంగా అంతర్గతంగా ఉన్న విభేదాలు ఒక్కసారిగా బయటపడ్డాయి. కమిషనర్‌కు వ్యతిరేకంగా ఏ విధంగా పోరాడాలనే విషయంపై చర్చించుకునేందుకు సిబ్బంది మొత్తం సమావేశం ఏర్పాటు చేసుకునే స్థాయికి ఆ విభేదాలు చేరుకున్నాయి. కార్యాలయంలోని అన్ని విభాగాల సిబ్బంది కలిసి కార్యాలయంలోని సమావేశ మందిరంలో మంగళవారం సమావేశమై సుదీర్ఘంగా మంతనాలు జరిపారు. అదే సమయంలో కమిషనర్ విజయలక్ష్మి కూడా ఇక్కడ కాకపోతే బదిలీపై ఇంకోచోటకు వెళ్లి పనిచేసుకుంటానంటూ తెగేసి చెప్పా రు. తన కిందిస్థాయి అధికారులు, సిబ్బందిని కమిషనర్ ఏమాత్రం నమ్మడం లేదని, తాము తీసుకెళ్లిన ఏ ఫైల్‌పైనా సంతకం చేయకపోగా తమను దూషిస్తుండటమే ప్రస్తుత పరిస్థితికి కారణమని ఉద్యోగులు చెబుతున్నారు. అయితే, గతంలో జరిగిన అవినీతి వ్యవహారాలపై అప్రమత్తంగా ఉన్న కమిషనర్.. నిబంధనలకు అనుగుణంగా ముక్కుసూటిగా వ్యవహరిస్తుండటంతో సిబ్బందికి నచ్చక ఆమెకు వ్యతిరేకంగా ఏకమయ్యారన్న వాదన కూడా ప్రస్తుతం కార్యాలయంలో వినిపిస్తోంది. అసలేం జరుగుతోంది... ప్రస్తుతం నగర కార్పొరేషన్ కమిషనర్‌గా ఉన్న విజయలక్ష్మి బాధ్యతలు చేపట్టి ఐదు నెలలు కావస్తోంది. ఈ ఐదు నెలల కాలంలో రెండు నెలలు సమైక్యాంధ్ర ఉద్యమ సమ్మెలో గడిచిపోగా, ఆమె గట్టిగా పనిచేసింది మూడు నెలలు మాత్రమే. ఈ మూడు నెలల కాలంలోనే సిబ్బందికి, ఆమెకు మధ్య విభేదాలు తీవ్రస్థాయికి చేరాయి. ఇంతకాలం అంతర్గతంగా నలుగుతున్న విభేదాలు మంగళవారం కమిషనర్‌కు వ్యతిరేకంగా సిబ్బంది ఒక్కటై ఏకంగా సమావేశం నిర్వహించడంతో బహిర్గతమయ్యాయి. కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి కిందిస్థాయి సిబ్బంది ఎవరినీ ఆమె నమ్మడం లేదు. ఇంజినీరింగ్ విభాగం, టౌన్‌ప్లానింగ్, అకౌంట్స్, పారిశుధ్యం, హెల్త్.. ఇలా ప్రతి విభాగానికి చెందిన హెడ్లతో పాటు, కిందిస్థాయి సిబ్బందిని కూడా నమ్మడంలేదనే ది కమిషనర్‌పై ఉన్న ప్రధాన ఆరోపణ. అలాగే కిందిస్థాయి సిబ్బందిని దూషిస్తూ మాట్లాడుతున్నారనే ఆరోపణ కూడా ఉంది. కార్యాలయంలో నిజాయితీగా వ్యవహ రించే కొందరు అధికారులను కూడా కమిషనర్ నమ్మడం లేదు. పైగా, ప్రతిఫైల్‌ను క్షుణ్ణంగా అనుమానంగా పరిశీలించడంతో పాటు, అన్నీ కచ్చితంగా ఉంటేనే సంతకాలు చేస్తున్నార నే వాదన ఉంది. దీంతో కమిషనర్‌కు వ్యతిరేకంగా అన్ని విభాగాల అధిపతులతో పాటు, కిందిస్థాయి సిబ్బంది కూడా ఒక్కటయ్యారు. మంగళవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు సిబ్బంది మొత్తం కమిషనర్‌కు వ్యతిరేకంగా సమావేశం నిర్వహించారు. కమిషనర్‌ను ఏ విధంగా ఎదుర్కోవాలనే దానిపై చర్చించారు. అయితే, అవినీతి వ్యవహారాలకు సహకరించకపోవడం వల్లే కమిషనర్‌పై సిబ్బంది తిరుగుబాటు చేస్తున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. టౌన్‌ప్లానింగ్, శానిటరీ విభాగాల్లో గతంలో జరిగిన అవినీతి వ్యవహారాలపై ఇటీవల విజిలెన్స్ విచారణ చేపట్టడంతో రిటైర్మెంట్కు దగ్గరగా ఉన్న కమిషనర్.. తనపై ఎటువంటి అవినీతి ఆరోపణలు రాకుండా చూసుకునేందుకు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. అన్ని వివరాలతో కచ్చితంగాలేనిదే ఏ ఫైల్‌పై సంతకం చేయడం లేదు. ఇక్కడే అసలు సమస్య వచ్చిపడింది. తాము తీసుకెళ్లిన ఏ ఫైల్‌పై ఆమె సంతకం చేయకపోతుండటంతో సిబ్బందిలో అసంతృప్తి పెరిగిపోయింది. అదే సమయంలో కొందరు సిబ్బంది కొన్ని పనులు చేయిస్తామంటూ పలువురి నుంచి భారీగా డబ్బు వసూలు చేసి ఉన్నారు. వాటికి సంబంధించిన ఫైళ్లపై కమిషనర్ సంతకం చేయకపోవడంతో పెండింగ్‌లో ఉండిపోయాయి. గత కమిషనర్ హయాంలో స్థానిక మంగమూరురోడ్డులో ఓ ఇంటి నిర్మాణానికి అనుమతి ఇప్పిస్తానని కార్యాలయంలోని ఓ ఆర్ఐ 10 వేల రూపాయలు తీసుకున్నట్లు తెలిసింది. ఆ తర్వాత కమిషనర్ బదిలీ అయి కొత్త కమిషనర్‌గా వచ్చిన విజయలక్ష్మి ఆ ఫైల్‌పై సంతకం చేయడం లేదు. దీంతో ఆప్పటి నుంచి సదరు ఫైల్ పెండింగ్‌లో ఉండిపోయింది. డబ్బు ఇచ్చిన వారు ఆరు నెలల నుంచి ఆర్ఐ చుట్టూ తిరుగుతున్నారు. ఇలాంటివి వందల ఫైళ్లు ప్రస్తుతం కార్యాలయంలో పెండింగ్‌లో ఉన్నాయి. డబ్బు ఇచ్చిన వారి నుంచి అధికారులపై తీవ్రస్థాయిలో ఒత్తిడి పెరుగుతుండటంతో సమాధానం చెప్పుకోలేని పరిస్థితి. అదే సమయంలో కమిషనర్ ఎవర్నీనమ్మి సంతకాలు చేయకపోతుండటంతో ఆమెపై సిబ్బంది మొత్తం తిరుగుబాటు బావుటా ఎగురవేశారనే వాదనలు తీవ్రస్థాయిలో వినిపిస్తున్నాయి. గతంలో కమిషనర్ రవీంద్రబాబు కార్యాలయంలోని సిబ్బంది పట్ల స్పష్టమైన అవగాహనతో వ్యవహరించేవారని, కానీ, ప్రస్తుత కమిషనర్‌కు, సిబ్బందికి మధ్య అటువంటి పరిస్థితి లేకపోవడం వల్లే ఈ పరిస్థితి నెలకొందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఏదిఏమైనప్పటికీ వీరి విభేదాల కారణంగా కార్యాలయంలో ఫైళ్లన్నీ పెండింగ్ లో ఉండిపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రత్యేక అధికారిగా ఉన్న కలెక్టర్ జోక్యం చేసుకుని పరిస్థితిని చక్కదిద్దాల్సిన అవసరం ఉంది.