ఒంగోలు టౌన్, న్యూస్‌లైన్ : కలెక్టర్ ప్రత్యేక అధికారిగా ఉన్న ఒంగోలు నగర కార్పొరేషన్ కార్యాలయంలో కమిషనర్ విజయలక్ష్మికి, సిబ్బందికి మధ్య విభేదాలు తీవ్రస్థాయికి చేరాయి. కమిషనర్ వ్యవహారశైలి నచ్చని సిబ్బంది మొత్తం ఏకమయ్యారు. కమిషనర్ విజయలక్ష్మి ఒకవైపు, కార్యాలయంలోని అన్ని విభాగాల సిబ్బంది మరోవైపు గ్రూపులుగా విడిపోయి ఒకరికొకరు ప్రత్యర్థులుగా మారిపోయారు. వీరిమధ్య కొంతకాలంగా అంతర్గతంగా ఉన్న విభేదాలు ఒక్కసారిగా బయటపడ్డాయి. కమిషనర్‌కు వ్యతిరేకంగా ఏ విధంగా పోరాడాలనే విషయంపై చర్చించుకునేందుకు సిబ్బంది మొత్తం సమావేశం ఏర్పాటు చేసుకునే స్థాయికి ఆ విభేదాలు చేరుకున్నాయి. కార్యాలయంలోని అన్ని విభాగాల సిబ్బంది కలిసి కార్యాలయంలోని సమావేశ మందిరంలో మంగళవారం సమావేశమై సుదీర్ఘంగా మంతనాలు జరిపారు. అదే సమయంలో కమిషనర్ విజయలక్ష్మి కూడా ఇక్కడ కాకపోతే బదిలీపై ఇంకోచోటకు వెళ్లి పనిచేసుకుంటానంటూ తెగేసి చెప్పా రు. తన కిందిస్థాయి అధికారులు, సిబ్బందిని కమిషనర్ ఏమాత్రం నమ్మడం లేదని, తాము తీసుకెళ్లిన ఏ ఫైల్‌పైనా సంతకం చేయకపోగా తమను దూషిస్తుండటమే ప్రస్తుత పరిస్థితికి కారణమని ఉద్యోగులు చెబుతున్నారు. అయితే, గతంలో జరిగిన అవినీతి వ్యవహారాలపై అప్రమత్తంగా ఉన్న కమిషనర్.. నిబంధనలకు అనుగుణంగా ముక్కుసూటిగా వ్యవహరిస్తుండటంతో సిబ్బందికి నచ్చక ఆమెకు వ్యతిరేకంగా ఏకమయ్యారన్న వాదన కూడా ప్రస్తుతం కార్యాలయంలో వినిపిస్తోంది.
అసలేం జరుగుతోంది...
ప్రస్తుతం నగర కార్పొరేషన్ కమిషనర్‌గా ఉన్న విజయలక్ష్మి బాధ్యతలు చేపట్టి ఐదు నెలలు కావస్తోంది. ఈ ఐదు నెలల కాలంలో రెండు నెలలు సమైక్యాంధ్ర ఉద్యమ సమ్మెలో గడిచిపోగా, ఆమె గట్టిగా పనిచేసింది మూడు నెలలు మాత్రమే. ఈ మూడు నెలల కాలంలోనే సిబ్బందికి, ఆమెకు మధ్య విభేదాలు తీవ్రస్థాయికి చేరాయి. ఇంతకాలం అంతర్గతంగా నలుగుతున్న విభేదాలు మంగళవారం కమిషనర్‌కు వ్యతిరేకంగా సిబ్బంది ఒక్కటై ఏకంగా సమావేశం నిర్వహించడంతో బహిర్గతమయ్యాయి. కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి కిందిస్థాయి సిబ్బంది ఎవరినీ ఆమె నమ్మడం లేదు.
ఇంజినీరింగ్ విభాగం, టౌన్‌ప్లానింగ్, అకౌంట్స్, పారిశుధ్యం, హెల్త్.. ఇలా ప్రతి విభాగానికి చెందిన హెడ్‌లతో పాటు, కిందిస్థాయి సిబ్బందిని కూడా నమ్మడంలేదనే ది కమిషనర్‌పై ఉన్న ప్రధాన ఆరోపణ. అలాగే కిందిస్థాయి సిబ్బందిని దూషిస్తూ మాట్లాడుతున్నారనే ఆరోపణ కూడా ఉంది. కార్యాలయంలో నిజాయితీగా వ్యవహ రించే కొందరు అధికారులను కూడా కమిషనర్ నమ్మడం లేదు. పైగా, ప్రతిఫైల్‌ను క్షుణ్ణంగా అనుమానంగా పరిశీలించడంతో పాటు, అన్నీ కచ్చితంగా ఉంటేనే సంతకాలు చేస్తున్నార నే వాదన ఉంది. దీంతో కమిషనర్‌కు వ్యతిరేకంగా అన్ని విభాగాల అధిపతులతో పాటు, కిందిస్థాయి సిబ్బంది కూడా ఒక్కటయ్యారు. మంగళవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు సిబ్బంది మొత్తం కమిషనర్‌కు వ్యతిరేకంగా సమావేశం నిర్వహించారు. కమిషనర్‌ను ఏ విధంగా ఎదుర్కోవాలనే దానిపై చర్చించారు. అయితే, అవినీతి వ్యవహారాలకు సహకరించకపోవడం వల్లే కమిషనర్‌పై సిబ్బంది తిరుగుబాటు చేస్తున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
టౌన్‌ప్లానింగ్, శానిటరీ విభాగాల్లో గతంలో జరిగిన అవినీతి వ్యవహారాలపై ఇటీవల విజిలెన్స్ విచారణ చేపట్టడంతో రిటైర్‌మెంట్‌కు దగ్గరగా ఉన్న కమిషనర్.. తనపై ఎటువంటి అవినీతి ఆరోపణలు రాకుండా చూసుకునేందుకు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. అన్ని వివరాలతో కచ్చితంగాలేనిదే ఏ ఫైల్‌పై సంతకం చేయడం లేదు. ఇక్కడే అసలు సమస్య వచ్చిపడింది. తాము తీసుకెళ్లిన ఏ ఫైల్‌పై ఆమె సంతకం చేయకపోతుండటంతో సిబ్బందిలో అసంతృప్తి పెరిగిపోయింది. అదే సమయంలో కొందరు సిబ్బంది కొన్ని పనులు చేయిస్తామంటూ పలువురి నుంచి భారీగా డబ్బు వసూలు చేసి ఉన్నారు. వాటికి సంబంధించిన ఫైళ్లపై కమిషనర్ సంతకం చేయకపోవడంతో పెండింగ్‌లో ఉండిపోయాయి. గత కమిషనర్ హయాంలో స్థానిక మంగమూరురోడ్డులో ఓ ఇంటి నిర్మాణానికి అనుమతి ఇప్పిస్తానని కార్యాలయంలోని ఓ ఆర్‌ఐ 10 వేల రూపాయలు తీసుకున్నట్లు తెలిసింది. ఆ తర్వాత కమిషనర్ బదిలీ అయి కొత్త కమిషనర్‌గా వచ్చిన విజయలక్ష్మి ఆ ఫైల్‌పై సంతకం చేయడం లేదు. దీంతో ఆప్పటి నుంచి సదరు ఫైల్ పెండింగ్‌లో ఉండిపోయింది. డబ్బు ఇచ్చిన వారు ఆరు నెలల నుంచి ఆర్‌ఐ చుట్టూ తిరుగుతున్నారు. ఇలాంటివి వందల ఫైళ్లు ప్రస్తుతం కార్యాలయంలో పెండింగ్‌లో ఉన్నాయి. డబ్బు ఇచ్చిన వారి నుంచి అధికారులపై తీవ్రస్థాయిలో ఒత్తిడి పెరుగుతుండటంతో సమాధానం చెప్పుకోలేని పరిస్థితి. అదే సమయంలో కమిషనర్ ఎవర్నీనమ్మి సంతకాలు చేయకపోతుండటంతో ఆమెపై సిబ్బంది మొత్తం తిరుగుబాటు బావుటా ఎగురవేశారనే వాదనలు తీవ్రస్థాయిలో వినిపిస్తున్నాయి. గతంలో కమిషనర్ రవీంద్రబాబు కార్యాలయంలోని సిబ్బంది పట్ల స్పష్టమైన అవగాహనతో వ్యవహరించేవారని, కానీ, ప్రస్తుత కమిషనర్‌కు, సిబ్బందికి మధ్య అటువంటి పరిస్థితి లేకపోవడం వల్లే ఈ పరిస్థితి నెలకొందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఏదిఏమైనప్పటికీ వీరి విభేదాల కారణంగా కార్యాలయంలో ఫైళ్లన్నీ పెండింగ్ లో ఉండిపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రత్యేక అధికారిగా ఉన్న కలెక్టర్ జోక్యం చేసుకుని పరిస్థితిని చక్కదిద్దాల్సిన అవసరం ఉంది.