పిట్టలవానిపాలెం: మండలంలోని చందోలు గ్రామంలో బుధవారం జరిగిన జన్మభూమి మాఊరు ఐదవ విడత కార్యక్రమం గందరగోళంగా ముగిసింది. సభ ప్రారంభం వైఎస్సార్ సీపీ, టీడీపీ వర్గీయుల మధ్య వాదనలు, ఘర్షణలు చోటు చేసుకున్నాయి. దీంతో సభలో కొద్ది సేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద జన్మభూమి గ్రామ సభను నిర్వహించకుండా నీలిబంగారయ్య జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో నిర్వహించడం ఏమిటంటూ వైఎస్సార్ సీపీ ముస్లిం మైనార్టీ సెల్ కార్యదర్శి అహ్మద్ హుస్సేన్, గ్రామ పార్టీ అధ్యక్షులు అబ్దుల్ రహీమ్, అజీమ్,రజాక్‌లు అధికారులను నిలదీశారు.
గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద సమావేశం నిర్వహణకు స్థలం తక్కువగా ఉండడం వలన పాఠశాల ఆవరణలో నిర్వహించాల్సి వచ్చిందని అధికారులు తెలిపారు. జన్మభూమి గ్రామ సభ గురించి స్థానిక ఎంపీటీసీ సభ్యులకు సమాచారం ఇవ్వలేదని, ప్రోటోకాల్ పాటించకుండా తమను అవమానపరచారని ఎంపీటీసీ సభ్యులు షేక్ బాజి, చేబ్రోలు వీరయ్యలు అధికారుల తీరుపై మండిపడ్డారు. అంతేకాక గ్రామంలో పింఛన్ మంజూరైన లబ్దిదారుల జాబితా ఇవ్వమని కోరితే అధికారులు పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. 135 మంది పింఛన్ కోసం ఆన్‌లైన్‌లో దరకాస్తు చేసుకుని ఉంటే 35 మందికి మాత్రమే పింఛన్‌లు మంజూరు చేశారని ఆరోపించారు.
అదేవిధంగా 130 మంది వరకు రేషన్ కార్డుల కోసం దరకాస్తు చేసుకుంటే 30 మందికి మాత్రమే మంజూరు చేయడం అన్యాయంగా ఉందని వాపోయారు. గ్రామానికి చెందిన ముగ్గురు మహిళలు తమకు ఇంటి నివేశనాస్థలాలు లేవని కన్నీరు పెట్టారు. దీంతో సర్పంచి భర్త అఫ్జల్ ముగ్గురికి ఇంటి స్థలంతో పాటు ,ఇళ్ళు నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారు. అర్హత కలిగిన వారికి సంక్షేమ పథకాలు అందకుండా అధికారులు సైతం అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఈవిషయాలపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. ఎంపీటీసీ సభ్యులకు సమాచారం అందించకపోవడం పొరపాటే నని అందుకు మొదటి తప్పుగా మన్నించాలని ఇన్‌చార్జ్ ఎంపీడీవో గణేష్‌బాబు కోరారు. తాను ఇటీవలే మండలానికి ఇన్‌చార్జిగా వచ్చానని ఇలాంటి పొరపాటు జరకుండా చూస్తానని తెలిపారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచి సుల్తానా బేగం,అఫ్జల్, ఎంపీపీ బీవీ సులోచన, కరెంట్ ఏఈ పెరుగు శ్రీనివాసరావు, మండల ప్రత్యేకాధికారిణి ఉషారాణి, తహసీల్దార్ చిన్నం సుధారాణి, ఈవోపీఆర్డీ వి సుజాత, వెలుగు ఏపీఎం సుజాత, గ్రామ కార్యదర్శి అబ్దుల్ ఖాదర్ జిలాని,ఎంఈఓ వి వెంకటేశ్వరరావు,ఆర్‌డబ్ల్యూఎస్ ఎఈ బాష,పిఆర్ ఎఈ మోహనరావు,హౌసింగ్ ఏఈ శ్రీనివాసరావు, ఏఓ లోకేశ్వరి, ఏఈఓలు సుదర్శనరావు తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment