తోపులాటకు దిగిన తెలుగుదేశం పార్టీ నాయకులు
మొన్న నరసరావుపేట...నిన్న నారాకోడూరు... నేడు అంగలకుదురు, తెనాలిలో టీడీపీ నేతల వికృత చర్యలు, దౌర్జన్యాన్ని చూసి ప్రజలు చీత్కరించుకుంటున్నారు. నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అనే చందంగా వారి వ్యవహార శైలి ఉంది. వై.ఎస్.జగన్ పాదయాత్ర ముగిసిన తరువాత రోడ్లను పసుపు నీళ్లతో కడిగి శుద్ధి చేస్తున్నట్లుగా ఫొటోలకు ఫోజులు ఇస్తూ రాక్షస ఆనందాన్ని పొందుతున్నారు. సామాజిక వర్గాల మధ్యా, పార్టీల మధ్యా చిచ్చుపెట్టే చర్యలకు పాల్పడుతున్నారు. వై.ఎస్.జగన్ పాదయాత్రను అడ్డుకునేందుకు ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు చేస్తున్న వికృత చర్యల్ని చూసి అన్ని వర్గాల ప్రజలు అసహ్యించుకుంటున్నారు
సాక్షి, గుంటూరు : వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ అధినేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి చేస్తున్న ప్రజాసంకల్ప యాత్రకు గుంటూరు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో ప్రజలు బ్రహ్మరథం పడుతుండటంతో టీడీపీ నేతల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. జగన్ పాదయాత్రకు, బహిరంగ సభలకు వెళ్లకుండా జనాన్ని అడ్డుకునేందుకు టీడీపీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు చేసిన ప్రయత్నాలు వృథా అయ్యాయి.
జగన్‌పై జనం అపారమైన అభిమానాన్ని చూపడాన్ని జీర్ణించుకోలేక దుశ్చర్యలకు తెగబడుతున్నారు. ముఖ్యంగా టీడీపీకి కంచుకోటలుగా ఉన్న గ్రామాల్లో సైతం వై.ఎస్.జగన్ పాదయాత్రకు జనం పోటెత్తుతుండటంతో నిస్పృహ, నైరాశ్యంతో ఏం చేస్తున్నారో కూడా తెలియని విధంగా అప్రజాస్వామిక చర్యలకు దిగుతున్నారు.
ఫొటోలకు ఫోజులు
గుంటూరు జిల్లాలోని నరసరావుపేట బహిరంగ సభకు జనం భారీగా రావడంతో టీడీపీ నేతలు చూసి ఓర్వలేక మరుసటి రోజు రోడ్లపై పసుపు నీళ్లు చల్లి రోడ్లు శుద్ధి చేస్తున్నట్లుగా ఫొటోలకు ఫోజులు ఇచ్చి తమ అక్కసు వెళ్లగక్కారు. పొన్నూరు నియోజకవర్గం చేబ్రోలు మండలం నారాకోడూరు గ్రామంలో అనేక సామాజిక వర్గాలకు చెందిన టీడీపీ ముఖ్య నేతలు వై.ఎస్.జగన్ సమక్షంలో వైఎస్సార్ సీపీలో చేరడంతో తట్టుకోలేక అక్కడ సైతం రోడ్ల మీద పసుపు నీరు చల్లి వికృత చర్యలకు పాల్పడ్డారు.
ఇంత జరిగినా వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలు ఎక్కడా సహనాన్ని కోల్పోకుండా పాదయాత్రను శాంతియుతంగా ముందుకు సాగేలా చూస్తున్నారు. అయితే, శుక్రవారం రాత్రి వై.ఎస్.జగన్‌కు స్వాగతం పలుకుతూ తెనాలి మండలం అంగలకుదురు గ్రామంలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్న సమయంలో టీడీపీకి చెందిన తెనాలి ఎంపీపీ సూర్యదేవర వెంకట్రావు అడ్డుకున్నారు. అంతటితో ఆగకుండా ప్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నవారిపై దాడికి తెగబడ్డారు. అయినప్పటికీ వైఎస్సార్‌సీపీ నేతలు సంయమనంతో సర్దుకు పోయారు. శనివారం వై.ఎస్.జగన్ రాకతో అంగలకుదురు గ్రామంతోపాటు తెనాలి పట్టణంలోని రోడ్లన్నీ జనంతో కిక్కిరిసి పోయాయి.
జగన్‌పై జనం చూపుతున్న ఆదరణ, అభిమానాన్ని చూసి ఓర్వలేక తెనాలి బహిరంగ సభ ముగియగానే కర్పూరం వెలిగించి శుద్ధి చేయడం, జగన్ దిష్టిబొమ్మ దగ్ధం చేయడం వంటి చర్యలకు పాల్పడి టీడీపీ నేతలు తమ కడుపు మంటను బయట పెట్టారు. అంతటితో ఆగకుండా రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేస్తూ వీరంగం సృష్టించారు. ఇదే సమయంలో శాంతియుతంగా వై.ఎస్.జగన్ ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేస్తున్న వైఎస్సార్‌సీపీ నేతలపై దాడికి సైతం తెగబడి రెచ్చగొట్టే చర్యలకు పాల్పడ్డారు.
చోద్యం చూస్తున్న పోలీసులు
టీడీపీ నేతలు, కార్యకర్తలు శాంతి భద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడుతున్నప్పటికీ అడ్డుకోవాల్సిన పోలీసులు చోద్యం చూస్తూ ఉండిపోయారు. ప్రశ్నించిన వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలపై విరుచుకు పడడం చూస్తుంటే టీడీపీ నేతలకు ఏ స్థాయిలో ఊడిగం చేస్తున్నారో అర్థమవుతుంది. టీడీపీ ద్వితీయ శ్రేణి నేతలు, కార్యకర్తల దుశ్చర్యలను అడ్డుకోవాల్సిన మంత్రులు, ఎమ్మెల్యేలు సైతం జగన్ పాదయాత్రపై రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ ఉసిగొలుపుతుండటంపై ప్రజలు తీవ్ర స్థాయిలో మండి పడుతున్నారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం పాలు చేసేలా టీడీపీ నేతలు వ్యవహరిస్తున్నారని విద్యావేత్తలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ నేతలు రెచ్చగొట్టే చర్యలకు పాల్పడకుండా హుందా గా వ్యవహరించాలని ప్రజలు కోరుతున్నారు.
రెచ్చగొట్టే చర్యలకు దిగడం దుర్మార్గం
తెనాలి : తెనాలిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజాసంకల్ప యాత్ర, బహిరంగ సభకు జనం పోటెత్తడంతో ఓర్వలేక తెలుగుదేశం పార్టీ రెచ్చగొట్టే చర్యలకు దిగటం దుర్మార్గమని జిల్లాకు చెందిన పలువురు వైఎస్సార్ సీపీ జెడ్పీటీసీ సభ్యులు ఖండించారు. గుంటూరు రూరల్ జెడ్పీటీసీ సభ్యుడు కొలకలూరు కోటేశ్వరరావు, చుండూరు జెడ్పీటీసీ సభ్యురాలు కొండా శివపార్వతమ్మ, కొల్లిపర జెడ్పీటీసీ సభ్యురాలు భట్టిప్రోలు వెంకటలక్ష్మి, పిడుగురాళ్ల జెడ్పీటీసీ సభ్యుడు జి.రామిరెడ్డి, దాచేపల్లి జెడ్పీటీసీ సభ్యుడు ప్రకాష్‌రెడ్డి, రాజుపాలెం జెడ్పీటీసీ సభ్యుడు ఎం.వెంకట్రామిరెడ్డి, దుగ్గిరాల జెడ్పీటీసీ సభ్యురాలు యేళ్ల జయలక్ష్మి, ముప్పాళ్ల జెడ్పీటీసీ సభ్యుడు ఎం.సింగయ్య శనివారం రాత్రి ఖండించారు.
Comments
Please login to add a commentAdd a comment