పాల ధరలు పెరిగాయ్..
న్యూఢిల్లీ: ఇప్పటికే చుక్కలనంటుతున్న ఉల్లి, కూరగాయల ధరలతో తల్లడిల్లుతున్న ఢి ల్లీవాసులకు మరో దెబ్బ. జాతీయ రాజధాని ప్రాంతం, ఢిల్లీకి పాల ఉత్పత్తులు సరఫరా చేసే మదర్ డెయి రీ మరోసారి ధరల భారం మోపింది. ఉత్పత్తివ్యయాల పెరుగుదలను దృష్టిలో ఉంచుకొని పాల ధరలను బుధవారం నుంచి లీటరుకు రూ.రెండు చొప్పున పెంచుతున్నట్టు ప్రకటించింది. ప్రస్తు తం లీటరు మీగడపాల ధర రూ.42 ఉండగా, ఇక నుంచి రూ.44 చెల్లించాలి. టోన్డ్పాల ధర రూ.28 నుంచి రూ.30కి చేరుకుంది.
పాడిరైతులకు తగిన మద్దతుధర, పాల లభ్యత పెంచడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామని మదర్ డెయిరీ వివరణ ఇచ్చింది. పశువుల దాణా ధరలు విపరీతంగా పెరగడంతో తమపైనా భారం అధికమయిందని తెలిపింది. ఢిల్లీ, ఎన్సీఆర్లో ఈ సంస్థ నిత్యం 30 లక్షల లీటర్ల పాలను విక్రయిస్తుంది. ముంబై, లక్నో, కాన్పూర్, పుణే, ఇతర నగరాల్లో ధరలను పెంచామని మదర్ డెయిరీ తెలిపింది. అయితే ఆ ప్రాంతాల్లో ఎంత మేర పెంచిందనే విషయాన్ని వెల్లడించలేదు.
ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే: బీజేపీ
భారీ ధరల కారణంగా ఢిల్లీవాసులు పండుగ రోజుల్లోనూ పస్తులుండాల్సిన దుస్థితి నెలకొంటోందని బీజేపీ ఢిల్లీ ప్రదేశ్ అధ్యక్షుడు విజయ్‌గోయల్ ఆవేదన వ్యక్తం చేశారు. ఉల్లి ధరలు ఈ ఏడాదిలోనే అత్యధికస్థాయికి చేరుకున్నాయన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణితో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తోందన్నారు. అన్ని కూరగాయల ధరలు ప్రజలను వణికిస్తున్నాయని గోయల్ అన్నారు. హోల్‌సేల్ మార్కెట్లోనూ కిలో ఉల్లి రూ.65పైనే ఉందని, రిటైల్‌గా రూ.100 నుంచి 120 ధర పెట్టినా కొనలేకపోతున్నారని పేర్కొన్నారు. ఢిల్లీలోని చాలా ప్రాంతాల్లో ఉల్లి కేజీ రూ.90-100 విక్రయిస్తున్నారు. ఢిల్లీలో రోజుకు 800 టన్నుల ఉల్లి వాడకం ఉండగా, సోమవారం ఆజాద్‌పూర్ హోల్‌సేల్ మార్కెట్‌కు కేవలం 90 టన్నుల ఉల్లి మాత్రమే వచ్చింది.