టీడీపీలో విభేదాల కుంపటి!
► పనులు, పదవులు కొందరికే ఇవ్వడంపై ద్వితీయ శ్రేణి నాయకుల ఆగ్రహం
► మంత్రి సతీమణి వద్ద వాపోతున్న నేతలు
► పాలక పార్టీలో వర్గపోరుతో అధికారులకు శిరోభారం
యడ్లపాడు: గ్రామాల్లో సాధారణంగా వివిధ పార్టీలకు చెందిన వర్గాలు ఉంటాయి. యడ్లపాడు మండలం లో ప్రతి గ్రామంలోనూ అధికార పార్టీలోనే రెండు వర్గాలు ఉండడం విశే షం. గ్రామాల్లో ఆధిపత్యం, ప్రభుత్వ కార్యాలయాలు, పోలీస్స్టేషన్లో అధికారులపై పెత్తనం, పదవులు పందేరం, కాంట్రాక్టు పనులు కైవసం చేసుకోవడంపై పార్టీ నాయకుల మధ్య పొత్తు కుదరకపోవడంతోనే విభేదాల కుంపటి రాజుకుంది. గతంలో మాటలతోనే సర్దుకుపోయేవారు. ఇప్పుడు ఆయా వర్గాల వారు గొడవలు పడి పోలీస్స్టేషన్ పంచాయతీలకు సైతం వెళ్లడం గమనార్హం. ఒక వర్గం అదే పార్టీకి చెందిన వ్యక్తికి సపోర్టు చేస్తే రెండోవర్గం వారు దానిని వ్యతిరేకిస్తారు. అవసరమైతే మంత్రి నివాసంలో పంచాయతీ ఏర్పాటు చేస్తారు. ఇలా గ్రామాల్లో ప్రతిచోటా టీడీపీలోనే రెండు వర్గాలు తయారయ్యాయి. ఈ రెండు వర్గాల నడుమ సామాన్యుడు నలిగిపోతున్నాడు.
ద్వితీయశ్రేణి నాయకులకు రిక్తహస్తం
ఎన్నికల సమయంలో పార్టీ గెలుపుకోసం అందరం సమష్టి కృషి చేసినా గ్రామాల్లో ప్రధాన నేతలకే పనులు, పెత్తనం కట్టబెట్టారని ద్వితీయ శ్రేణి నాయకులు ఆరోపిస్తున్నారు. తమను పట్టించుకోవడం లేదని గుర్రుగా ఉన్నారు. రెండు గ్రూపుల్లో ఒకవర్గం మంత్రిని కలిసి కాంట్రాక్టులు చేజిక్కించుకుండగా, రెండోవర్గం వారు మంత్రి సతీమణిని ఆశ్రయించి పనులు, పదవుల పంపకంలో తమకు జరిగిన అన్యాయాన్ని వెళ్లబోసుకుంటున్నారు. ఏ పని చేయాలన్నా దిగువ శ్రేణి నాయకులను పూర్తిగా విస్మరిస్తున్నారంటూ రగిలిపోతున్నారు. పార్టీకోసం పనిచేసిన వారికి కాకుండా తమ గ్రామంలో ఇతరులకు పనులు అప్పగించడంపై మండిపడుతున్నారు. మండలంలోని ఓ ఐదారుగురికి మినహా మిగిలిన వారిని పట్టించుకునే పరిస్థితి కన్పించడం లేదంటూ తెలుగు తమ్ముళ్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సామాజిక వర్గం, డబ్బు, నోరేసుకుని పడేవారికే పరపతి, పదవులు దక్కుతున్నాయంటూ వాపోతున్నారు.
అధికారులకు శిరోభారం
మొదట మంత్రి వద్ద మార్కులు కొట్టేసేందుకు అధికారపార్టీ నేతల అడుగులకు మడుగులొత్తిన అధికారులకు ఇప్పుడు శిరోభారంగా మారింది. గ్రామస్థాయి, మండలస్థాయి సమావేశాల్లో ఎవరిని పిలిస్తే ఏమవుతుందోనని భయపడుతున్నారు. టీడీపీ వర్గీయులు చెప్పినట్లు పనులు చేస్తున్న అధికారులు ఇప్పుడు రెండు వర్గాలు ఉండడంతో ఎవరికి పనులు చేస్తే రెండోవర్గం తమపై మంత్రి ఎదుట ఎలాంటి ఫిర్యాదు చేస్తారోనని ఆందోళన చెందుతున్నారు.