ఆ పోస్టుల్లో ఇతరులను నియమించొద్దు
ప్రభుత్వానికి తెలంగాణ పంచాయతీ కార్యదర్శుల సంఘం వినతి
సాక్షి, హైదరాబాద్: పంచాయతీరాజ్ శాఖలోని ఉన్నత స్థాయి పోస్టుల్లో ఇతర శాఖలకు చెందిన అధికారులను నియమిం చవద్దని తెలంగాణ పంచాయతీ కార్యదర్శుల సంఘం (టీపీఎస్ఏ) ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఆదివారం ఇక్కడ జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో పలు తీర్మానాలు చేశారు. పంచాయతీ కార్యదర్శుల బదిలీలను ప్రభుత్వం వెంటనే చేపట్టాలని, కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్‌ను రద్దు చేయాలని కోరింది. అర్హులకు పదోన్నతులు కల్పించాలని, క్లస్టర్లను పునర్విభజన చేసి రెగ్యులర్ కార్యదర్శులను నియమించాలంది.
సర్వీస్ క్రమబద్ధీకరణకు పరీక్షలు పాస్ కావడం నిబంధన తొలగించాలని, ఇన్చార్జ్ బాధ్యతలు నిర్వహిస్తున్న కార్యదర్శులకు ప్రతి నెలా రూ.3 వేలు ఎఫ్‌టీఏ ఇవ్వాలసింది. తమ డిమాండ్లపై సానుకూల స్పందన రాకుంటే జేఏసీగా ఏర్పడి సమ్మెకు దిగుతామని అసోసియేషన్ ప్రకటించింది.ఈ సమావేశంలో టీపీఎస్ఏ ప్రధాన కార్యదర్శిగా పి.మధుసూదన్‌రెడ్డి నియమితులయ్యారు. అసోసియేట్ అధ్యక్షుడిగా జోగం రాజు, ఉపాధ్యక్షుడిగా పి.జనార్దన్‌రెడ్డి, సంయుక్త కార్యదర్శిగా జి.మనోహర్‌ను నియమించినట్లు సంఘ రాష్ట్ర అధ్యక్షుడు భాస్కర్‌రెడ్డి తెలిపారు.