‘ఉపాధి’కి ఎండదెబ్బ
సాక్షి, వరంగల్ రూరల్: పల్లెల నుంచి పట్నాలకు వలసలను నివారించేందుకు జాతీయ ఉపాధి హామీ పథకాన్ని చేపట్టిన విషయం తెలిసిందే. పథకం మాట అట్లుంచితే కూలీలకు కనీస వసతులు లేక అల్లాడుతున్నారు. మహబూబ్‌నగర్ ఘటనలో మట్టి దిబ్బ కూలి పది మంది మహిళా కూలీలు మృత్యువాత పడినా అధికారులు నిర్లక్ష్యం వీడకపోవడం గమనార్హం. ఉమ్మడి వరంగల్ జిల్లాలో కూడా ఉపాధి కూలీలకు రక్షణ లేకుండా పోయింది. ప్రాణాలు అరచేతిలో పట్టి పనులు చేసుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. ఉపాధిహామీ చట్టంలో పని ప్రదేశంలో నీడ, మంచినీరు, ఫస్ట్ ఎయిడ్ కిట్లు ఉంచాలని రాజీలేని అంశాలుగా చేర్చారు.
నీటి వసతి నీడ, ప్రథమచికిత్స ఏర్పాటుచేయకపోవడంవల్ల కూలీలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ప్రతి పల్లెలోనూ వ్యవసాయ పనులు ముగయడంతో ఎక్కువగా ఉపాధి హామి పనులకు వెళుతున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 7,31,280 జాబ్ కార్డులుండగా 16,67,339 మంది కూలీలున్నారు. వేసవిలో ఉదయం 6గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట, సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు పనులు చేయాలని నిబంధన ఉంది. భానుడు భగ్గున మండి పోతుండడంతో జిల్లా వ్యాప్తంగా ఉదయం 10 గంటల వరకే కూలీలు వెనుదిరగాల్సిన పరిస్థితి నెలకొంది. కాని కొన్ని గ్రామాల్లో మధ్యాహ్నం వరకు పనులు చేస్తున్నారు. మండుటెండలో గ్రామీణ ఉపాధి హామీ కూలీలు పనులు చేయాల్సిన పరిస్థితి ఉంది.
కనిపించని ఫస్ట్ ఎయిడ్ కిట్లు
దేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన ఉపాధి హామీ పథకంలో నీలినీడలు కమ్ముకుంటున్నాయి. మూడేళ్ల క్రితం ఫస్ట్ ఎయిడ్ కిట్లను అందించారు. అవి కొందరు మెట్ల దగ్గరనే ఉండి పోయాయి. కూలీలు పని చేసే ప్రదేశంలో అనుకోని ప్రమాదం జరిగితే.. ప్రాథమికంగా చికిత్స చేసేందుకు మెడికల్ కిట్లు తప్పని సరి. ఇందు కోసం సీనియర్ మేట్లకు శిక్షణ కూడా ఇచ్చారు. కానీ జిల్లాలో ఎక్కడా కూడా మెడికల్ కిట్లు కనిపించడం లేదు. కాలుపై గడ్డపార పడినా.. క్రిమికీటకాలు కరిచినా.. వెంటనే దగ్గరలో ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో ఒక్కో సారి ప్రాణాలు పోయే పరిస్థితి కూడా ఎదురవుతుంది. ప్రస్తుతం 42 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నా.. ఈజీఎస్ అధికారులు దీనిపై దృష్టి సారించడం లేదు. ముందస్తు చర్యల్లో భాగంగా కూలీలు డీ హైడ్రేషన్‌కు గురి కాకుండా టెంట్లు ఏర్పాటు చే యాలి.
జాడ లేని టార్పాలిన్ షీట్లు..
రెండేళ్ల కిందట వేసవిలో కూలీలకు రక్షణగా ఉండేందుకు టార్పాలిన్ కవర్లను పంపిణీ చేశారు. ఆయా గ్రామాల్లోని సీనియర్ మేట్లకు టార్పాలిన్ కవర్లను అప్పగిస్తూ పని ప్రదేశంలో వాటిని వేసే బాధ్యతను అప్పగించారు. గ్రూపులోని ప్రతి ఒక్కరూ రూ.100 కూలీ పని చేస్తే, మేట్‌కు ఒక్కో వ్యక్తి నుంచి రూ.3 వేతనం వస్తుంది. ఈ డబ్బులను నేరుగా మేట్ ఖాతాలో జమ చేస్తారు. ప్రతి పనికి డబ్బులు ఇస్తున్నప్పటికీ, అనుకున్న మేర ‘ఉపాధి’ లక్ష్యం నెరవేరడం లేదు. ఇదిలా ఉంటే టార్పాలిన్ కవర్లు ఎక్కడా కనిపించడం లేదు. గతంలో ఉన్న కొంత మంది మేట్లను తొలగించడంతో టార్పాలిన్ కవర్లు వారి వద్దనే ఉన్నట్లు తెలిసింది. అధికారుల లెక్కల ప్రకారం పని ప్రదేశంలో టెంట్లు ఉన్నట్లు భావిస్తున్నా కనిపించిన దాఖలాలు లేవు. కూలీలు భోజనం చేసేందుకు, సేద తీరేందుకు నిలవ నీడ లేకపోవడంతో చెట్ల నీడకు వెళ్లాల్సి వస్తోంది. చెట్లు దుర ప్రాంతాల్లో ఉంటే అంత దూరం ఏం వెళ్లుతామని ఎండలోనే భోజనాలు, సేద తీరుతున్నారు. తాగు నీటి సౌకర్యం లేకపోవడంతో దాహంతో తండ్లాడాల్సిన పరిస్థితి ఉంది.
పనుల వద్ద నీడ కల్పించాలి
ఎండలు బాగా కొడుతున్నాయి. పనులు చేసే కాడా సేదా తీరేందుకు టెంట్లు వేస్తే బాగుండు. నీడకోసం కట్ట వెంబడి ఉన్న తాటి మట్టలతో నీడ ఏర్పాటు చేసుకున్నాం. ఎదైన దెబ్బతగిలితే ఇబ్బంది పడుడే. మందులు అందుబాటులో ఉంచాలి. కనీసం పని ప్రదేశంలో గ్లూకోజ్ ప్యాకెట్లు లేవు. అధికారులు అర్హత కలిగిన గ్రుపులకు టెంట్లు పంపిణీ చేయాలి.– పెరుమాండ్ల వసంత, ఉపాధి కూలి, శనిగరం
ఎండలోనే ఉండాల్సి వస్తోంది..
బయట కూలి పనులు లేకపోవడంతో ఉపాధి పనులకు వస్తున్నాం. వ్యవసాయం పనులు లేకపోవడంతో ఈ కూలి పనుల ద్వారా వచ్చే డబ్బులతో ఎంతో లబ్ధి చేకురుతుంది. కానీ పనుల దగ్గర సేద తీరేందుకు నీడ లేదు భోజనం ఎండలోనే చేస్తున్నాం. మేం తీసుకువచ్చిన నీళ్లు ఎండకు వేడి అవుతున్నాయి. నీడ కోసం ఏమైనా ఏర్పాట్లు చేయాలి. – అన్నెపు సాంబలక్ష్మి, రాయపర్తి
ఉపాధి పనులే దిక్కు..
ఈ ఏడాది వ్యవసాయ పనులు అంతగా లేవు. రోజు పనిచేస్తేనే పూట గడిచేది. కుటుంబంతో బతుకు దెరువు కోసం వలస వెళుదామనుకున్నాం. వారం రోజుల క్రితం శనిగరం మైసమ్మ చెరువులో ఉపాధి పనులు చేపట్టారు. పనులు చేపట్టిన రోజు నుంచి నా భార్యతో కలిసి పనికి పోతున్న. ఈ పనులే లేకపోతే వలస వెళ్లేవాళ్లం. పనులు లేక బతుకు దెరువులేని మాలాంటి కుటుంబాలకు ఉపాధి పనులే దిక్కుగా మారాయి. – మాట్ల రమ సూరయ్య దంపతులు, ఉపాధి కూలీలు, నల్లబెల్లి