copa america foot ball
-
కోపా అమెరికా కప్ లో సంచలనం
మసాచుసెట్స్: కోపా అమెరికా కప్ టోర్నీలో పెను సంచలనం చోటు చేసుకుంది. ఫేవరేట్లలో ఒకటైన బ్రెజిల్ లీగ్ దశలోనే ఇంటిముఖం పట్టింది. వివాదస్పద గోల్ తో బ్రెజిల్ ను పెరూ ఓడించింది. 31 ఏళ్ల తర్వాత తొలిసారిగా బ్రెజిల్ పై పెరూ విజయం సాధించింది. ఆదివారం అర్ధరాత్రి జరిగిన గ్రూప్-బీ లీగ్ మ్యాచ్‌లో 1-0తో బ్రెజిల్ పై నెగ్గి క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. శుక్రవారం జరిగే క్వార్టర్ ఫైనల్లో కొలంబియాతో పెరూ తలపడుతుంది. ఆట 75వ నిమిషంలో పెరూ ఆటగాడు రాల్ రూడియాజ్ చేసిన గోల్ వివాదస్పదంగా మారింది. అతడు చేత్తో గోల్ చేశాడని బ్రెజిల్ కీపర్ అలీసన్ వెంటనే ఫిర్యాదు చేశాడు. రిఫరీలు సుదీర్ఘంగా చర్చలు జరిపిన తర్వాత గోల్ చేత్తో చేయలేదని నిర్ధారించడంతో బ్రెజిల్ ఆటగాళ్లు నిర్ఘాంతపోయారు. స్టార్ ఆటగాడు నేమార్ జట్టులో లేకపోవడం కూడా బ్రెజిల్ విజయావకాశాలను దెబ్బతీసింది. ఆట మొదటి భాగంలో దూకుడు ప్రదర్శించిన బ్రెజిల్ ద్వితీయార్థంలో తేలిపోయింది. ఫస్టాప్ లో రెండు పెరూ గోల్ పోస్టుపై దాడి చేసింది. 1993 నుంచి ప్రతి కోపాలో కనీసం క్వార్టర్ ఫైనల్ చేరిన బ్రెజిల్ ఇప్పుడు లీగ్ దశలోనే నిష్క్రమించింది. 1985 తర్వాత బ్రెజిల్ తో ఆడిన 16 మ్యాచుల్లో 10 డ్రా కాగా, ఆరింటిలో పెరూ ఓడించింది. -
ఉరుగ్వేకు మరోషాక్
ఫిలాడెల్ఫియా: దాదాపు గత పది సంవత్సరాలుగా వెనుజులా చేతిలో ఓటమి ఎరుగని ఉరుగ్వేకు కోపా అమెరికా ఫుట్ బాల్ టోర్నీలో తొలిసారి షాక్ తగలింది. భారత కాల మాన ప్రకారం గురువారం రాత్రి జరిగిన గ్రూప్-సి మ్యాచ్‌లో వెనుజులా 1-0 తేడాతో ఉరుగ్వేను ఓడించింది. ఆట 36వ నిమిషంలో సలోమాన్ రాండాన్స్ గోల్ చేసి వెనుజులాను ఆధిక్యంలోకి తీసుకువెళ్లాడు. ఆ తరువాత ఉరుగ్వే దూకుడుగా ఆడిన వెనుజులా డిఫెన్స్‌ను ఛేదించలేక ఓటమి పాలైంది. దీంతో వెనుజులా క్వార్టర్స్ లో కి చేరింది. ఇది 2006 తరువాత ఉరుగ్వేకు తొలి ఓటమి కాగా, కోపా అమెరికా కప్‌లో వెనుజులా వరుసగా రెండు విజయాలు నమోదు చేసి సరికొత్త చరిత్రను లిఖించింది. గత మ్యాచ్‌ల్లో మెక్సికో చేతిలో ఉరుగ్వే ఓటమి పాలుకాగా, మెక్సికోపై వెనుజులా విజయం సాధించిన సంగతి తెలిసిందే. -
చిలీపై అర్జెంటీనా పైచేయి
* డిఫెండింగ్ చాంపియన్‌పై నెగ్గిన నంబర్‌వన్ జట్టు * మెస్సీ లేకున్నా రాణించిన నిరుటి రన్నరప్ * కోపా అమెరికా కప్ సాంటా క్లారా (అమెరికా): గాయం కారణంగా స్టార్ ప్లేయర్ లియోనెల్ మెస్సీ అందుబాటులో లేకున్నా... అర్జెంటీనా జట్టు కోపా అమెరికా కప్ ఫుట్‌బాల్ టోర్నమెంట్లో శుభారంభం చేసింది. గ్రూప్ ‘డి’లో భాగంగా డిఫెండింగ్ చాంపియన్ చిలీ జట్టుపై 2-1 గోల్స్ తేడాతో విజయం సాధించింది. దీంతో గతేడాది జరిగిన ‘కోపా’ ఫైనల్లో చిలీ చేతిలో ఎదురైన ఓటమికి బదులు తీర్చుకుంది. అర్జెంటీనా తరఫున 51వ నిమిషంలో ఏంజెల్ డిమారియా, 59వ నిమిషంలో ఎవర్ బనెగా ఒక్కో గోల్ చేయగా... చిలీ జట్టుకు 93వ నిమిషంలో (ఇంజ్యూరీ టైమ్) జోస్ పెడ్రో ఫ్యుయెన్జలీదా ఏకైక గోల్ అందించాడు. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్ స్థానంలో ఉన్న అర్జెంటీనా... ఐదో ర్యాంక్‌లో ఉన్న చిలీ జట్టు తొలి అర్ధభాగంలో ఆద్యంతం దూకుడుగా ఆడినా ఇరు జట్లూ ఖాతా తెరవలేకపోయాయి. రెండో అర్ధభాగం మొదలైన ఆరు నిమిషాలకే అర్జెంటీనా ఖాతాలో తొలి గోల్ చేరింది. మిడ్ ఫీల్డ్ నుంచి బనెగా ముందుకు వచ్చి తన ఎడమ వైపు ఉన్న డిమారియాకు పాస్ ఇవ్వగా... అతను బంతిని గోల్‌పోస్ట్‌లోనికి పంపించాడు. ఎనిమిది నిమిషాల తర్వాత అర్జెంటీనా రెండో గోల్‌ను సాధించింది. ఈసారి డిమారియా ఇచ్చిన పాస్‌ను బనెగా లక్ష్యానికి చేర్చాడు. రెండు గోల్స్ చేసిన తర్వాత కూడా అర్జెంటీనా తమ ఆధిపత్యాన్ని కొనసాగించింది. చివరి నిమిషాల్లో చిలీకి జోస్ పెడ్రో గోల్ అందించినప్పటికీ డిఫెండింగ్ చాంపియన్‌కు ఓటమి తప్పలేదు. పనామా గెలుపు: ‘డి’ గ్రూప్‌లో భాగంగా జరిగిన మరో మ్యాచ్‌లో పనామా జట్టు 2-1తో బొలీవి యాను ఓడించింది. పనామా తరఫున బ్లాస్ పెరెజ్ (11వ, 87వ నిమిషాల్లో) రెండు గోల్స్ చేయగా... బొలీవియాకు కార్లోస్ గోల్ అందించాడు. బాధలో ఉన్నా... ఈ మ్యాచ్‌లో అర్జెంటీనా విజయంలో ముఖ్యపాత్ర పోషించిన డిమారియాకు మ్యాచ్ ప్రారంభానికి కొన్ని గంటలముందు చేదు వార్త తెలిసింది. తనెంతగానో అభిమానించే అమ్మమ్మ మరణించిందని సమాచారం అందడంతో అతను తీవ్ర వేదనతోనే బరిలోకి దిగాడు. గోల్ చేసిన వెంటనే ‘గ్రాండ్మా... ఐ విల్ మిస్ యు సో మచ్’ అని రాసిన టీ షర్ట్‌ను ప్రదర్శించి డిమారియా తన అభిమానాన్ని చాటుకున్నాడు. ‘అమ్మమ్మ మృతి చెందిన విషయం తెలిసినప్పటికీ ఈ మ్యాచ్‌లో ఎలాగైనా ఆడాలనుకున్నాను. నేను జాతీయ జట్టుకు ఆడినందుకు ఆమె ఎంతో గర్వపడింది’ అని డిమారియా మ్యాచ్ అనంతరం వ్యాఖ్యానించాడు. -
చిలీకి అర్జెంటీనా షాక్
శాంతా క్లారా(కాలిఫోర్నియా): కోపా అమెరికా ఫుట్ బాల్ టోర్నీలో ఫేవరెట్ జట్లలో ఒకటిగా బరిలోకి దిగిన అర్జెంటీనా శుభారంభం చేసింది. గ్రూప్-డిలో భాగంగా మంగళవారం(భారత కాలమాన ప్రకారం) జరిగిన పోరులో అర్జెంటీనా 2-1 తేడాతో డిఫెండింగ్ చాంపియన్ చిలీకి షాకిచ్చింది. గతేడాది జరిగిన ఫైనల్లో పోరులో చిలీ చేతిలో ఓటమి పాలైన అర్జెంటీనా అందుకు బదులు తీర్చుకుంది. ఆట రెండో అర్థభాగంలో అర్జెంటీనా రెండు గోల్స్ చేసి చిలీకి షాకిచ్చింది. ఆట 54వ నిమిషంలో ఏంజెల్ డి మారియా, 59వ నిమిషంలో బనేగా తలో గోల్ చేసి అర్జెంటీనా విజయానికి సహకరించారు. కాగా ఆట చివరిలో చిలీ గోల్ చేసినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ప్రస్తుతం వరల్డ్ టాప్ ర్యాంకులో ఉన్న అర్జెంటీనా కోపా అమెరికా కప్‌ను 14 సార్లు గెలవగా, 2015లో సొంత గడ్డపై జరిగిన ఈ టోర్నమెంట్లో మాత్రమే చిలీ విజేతగా నిలిచింది. -
కోపా కప్ లో వెనుజులా శుభారంభం
చికాగో:కోపా అమెరికా కప్ ఫుట్ బాల్ టోర్నమెంట్లో వెనుజులా శుభారంభం చేసింది. గ్రూప్-సిలో భాగంగా సోమవారం జరిగిన పోరులో వెనుజులా 1-0తేడాతో జమైకాపై విజయం సాధించింది. మ్యాచ్ ఆరంభంలో జమైకాకు గోల్స్ చేసే అవకాశం వచ్చినా దాన్ని సద్వినియోగం చేసుకోవడంలో విఫలమై ఓటమి పాలైంది. ప్రత్యేకంగా ఆట 11 వ నిమిషంలో బంతిని గోల్ గా మలచే అవకాశాన్ని జమైకా జారవిడుచుకోవడంతో ఆ తరువాత తేరుకోలేకపోయింది. ఆ తరువాత మరో నాలుగు నిమిషాల వ్యవధిలో వెనుజులా తొలి గోల్‌ను సాధించి ఆధిక్యం సాధించింది. ఆపై ఆట 23 వ నిమిషంలో జమైకా మిడ్ ఫీల్డర్ రాడాల్ఫ్ ఆస్టిన్ రెడ్ కార్డ్ బారిన పడి బెంచ్‌కే పరిమితం కావడం కూడా ఆ జట్టు ఆటపై ప్రభావం చూపించింది. దీన్ని సద్వినియోగం చేసుకున్న వెనుజులా చివరి వరకూ జమైకాను కట్టడి చేసి విజయం నమోదు చేసింది. ఇదిలా ఉండగా, మరోపోరులో మెక్సికో 3-1 తేడాతో ఉరుగ్వేపై విజయం సాధించింది. వెనుజులా తన రెండో పోరులో గురువారం ఉరుగ్వేతో తలపడనుంది.