కార్పొ బ్రీఫ్స్...
స్టార్ హెల్త్ నుంచి గోల్డ్ ప్లాన్ టాప్ అప్..
సూపర్ సర్ప్లస్ ఇన్సూరెన్స్, స్టార్ సర్ప్లస్ ఫ్లోటర్ ఇన్సూరెన్స్ పథకాల కింద స్టార్ హెల్త్ అండ్ అలైడ్ ఇన్సూరెన్స్ సంస్థ కొత్తగా గోల్డ్ ప్లాన్ ఆవిష్కరించింది. ఈ టాప్ అప్ పాలసీ అత్యంత చౌకగా మరింత ఎక్కువ కవరేజీ అందిస్తుందని సంస్థ చెబుతోంది. ఆస్పత్రి వ్యయాలు పాలసీదారు నిర్దేశించిన పరిమితిని దాటిన పక్షంలో గోల్డ్ ప్లాన్‌తో క్లెయిమ్ చేసుకోవచ్చు. గది అద్దెపై ఎటువంటి పరిమితులు ఉండవు. పైగా ఎయిర్ అంబులెన్స్, 405 డే కేర్ ప్రొసీజర్స్‌కి వర్తింపు తదితర ప్రయోజనాలు ఉంటాయి. ముందస్తు వైద్య పరీక్షలేమీ లేకుండా 65 ఏళ్ల దాకా వయసు గల వ్యక్తులు ఈ ప్లాన్ కింద రూ.25 లక్షల దాకా కవరేజీ పొందవచ్చు.
హెచ్డీఎఫ్సీ లైఫ్ ఈజీ హెల్త్ ప్లాన్..
శస్త్రచికిత్సలు, క్రిటికల్ ఇల్నెస్ మొదలైన వాటి కవరేజీకి సంబంధించి పాలసీదారు ఏకమొత్తం లేదా వాయిదాల పద్ధతిలో ప్రీమియంలు కట్టే వెసులుబాటు కల్పిస్తూ హెచ్డీఎఫ్సీ లైఫ్ తాజాగా ఈజీ హెల్త్ ప్లాన్‌ను ఆవిష్కరించింది. అయిదేళ్ల కాల వ్యవధికి గరిష్టంగా రూ. 5,00,000 దాకా కవరేజీకి దీన్ని తీసుకోవచ్చు. దీని కింద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నప్పుడు అవసరాన్ని బట్టి రోజువారీ రూ. 250 నుంచి రూ. 5,000 దాకా, 138 శస్త్రచికిత్సలు.. 18 క్రిటికల్ ఇల్నెస్ అంశాల్లో ఏకమొత్తం పొందవచ్చు. సమ్ అష్యూర్డ్ పూర్తిగా వినియోగమయ్యే దాకా పలు సర్జరీలకు క్లెయిమ్ చేసుకోవచ్చు.
బిర్లా సన్‌లైఫ్ సెక్యూర్ప్లస్ ప్లాన్..
ఇటు బీమా కవరేజీతో పాటు అటు కట్టిన ప్రీమియానికి రెట్టింపు మొత్తాన్ని అందించేలా బిర్లా సన్ లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థ బీఎస్‌ఎల్‌ఐ సెక్యూర్ప్లస్ ప్లాన్ ప్రవేశపెట్టింది. దీనికింద రెండు ఆప్షన్లు ఉంటాయి. ఉదాహరణకు ఆప్షన్ ఏ ఎంచుకున్న వారు 12 ఏళ్ల పాటు ఏటా రూ. 1 లక్ష చొప్పున కడితే.. 14వ ఏడాది రూ. 2 లక్షలు, 15వ ఏడాది రూ. 3 లక్షలు.. ఇలా 19వ సంవత్సరంలో రూ. 6 లక్షలు పొందవచ్చు. రెండో ఆప్షన్లో 12 ఏళ్ల పాటు .. కట్టిన ప్రీమియంలకు రెట్టింపు మొత్తాన్ని పొందవచ్చు. ఉదాహరణకు.. 12 ఏళ్ల పాటు ఏటా రూ. 1 లక్ష కడితే.. 14వ సంవత్సరం మొదలుకుని ప్రతీ సంవత్సరం రూ. 2 లక్షల చొప్పున అందుకోవచ్చు. చెల్లించే ప్రీమియంకు 14.5-19 రెట్లు లైఫ్ కవరేజీ ఉంటుంది.