అర్హులందరికీ పింఛన్లు
మహేశ్వరం: అర్హులందరికి పింఛన్లు అందజేస్తామని.. ఆందోళన చెందొద్దని మంత్రి మహేందర్‌రెడ్డి అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని రూ.1.25 లక్షల నిధులతో నిర్మించిన కస్తూర్బాగాంధీ విద్యాలయాన్ని వారు ప్రారంభించారు. రావిర్యాల గ్రామంలో రూ.80 లక్షల నిధులతో పాఠశాల అదనపు గదులకు శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కార్పొరేట్ విద్యకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతామని అన్నారు. కేజీ నుంచి పీజీ వరకు అంగ్లంలో విద్యను అందించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తుంద ని మంత్రి పేర్కొన్నారు. పింఛన్లు తొలగిస్తున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని ఆయన చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, ముస్లిం నిరుపేద యువతుల పెళ్లిళ్లకు కల్యాణలక్ష్మి పథకం కింద రూ. 51 వేల ఆర్థిక సహాయం ప్రభుత్వం అందిస్తుందన్నారు.
పరిశ్రమల స్థాపనకు కృషి: ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి
రానున్న రోజుల్లో మహేశ్వరం రూపురేఖలు మారుతాయని.. రావిర్యాల, మహేశ్వరం, నాగారం తదితర గ్రామాల్లో భారీ పరిశ్రమలను స్థాపించేందుకు తనవంతు కృషి చేస్తానని ఎంపీ విశ్వేశర్‌రెడ్డి పేర్కొన్నారు. గిరిజన తండాలను పంచాయతీలు మారుస్తామన్నారు.
జర్నలిస్టుల సంక్షేమం కోసం రూ. 10 కోట్లు మంజూరు..
జర్నలిస్టుల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం రూ.10 కోట్లు నిధులు మంజూరు చేసిందని ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి అన్నారు. జాతీయ ప్రెస్ డే సందర్భంగా ఆయన జర్నలిస్టులకు శుభాకాంక్షలు తెలిపారు. విలేకరులు ప్రజలకు, అధికారులకు మధ్య వారధిగా పని చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీపీ పెంటమల్ల స్నేహ, జెడ్పీటీసీ నేనావత్ ఈశ్వర్‌నాయక్, టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి కొత్త మనోహర్‌రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ పోతర్ల అంబయ్య యాదవ్, వైస్ ఎంపీపీ మునగపాటి స్వప్న, సర్పంచ్‌లు ఆనందం, లక్ష్మయ్య, ఎంపీటీసీలు లింగం సురేష్, మునగని రాజు, బరిగెల ప్రేమలత,బుజ్జి, సర్వశిక్షా అభియాన్ అధికారి కిషన్‌రావు, తహసీల్దార్ గోపీరామ్, ఎంపీడీఓ నీరజ ఉన్నారు.
కొత్త సంవత్సరం నుంచి బస్సులు ప్రారంభం
అనంతరం మంత్రి మహేశ్వరం ఆర్టీసీ డిపో పనులను పర్యవేక్షించారు. వచ్చే ఏడాది జనవరి నుంచి మహేశ్వరం ఆర్టీసీ బస్ డిపో నుంచి బస్సులు నడిపిస్తామని మంత్రి మహేందర్‌రెడ్డి పేర్కొన్నారు. రానున్న రోజుల్లో మహేశ్వరం మరో హైటెక్ సిటీగా మారుతుందని చెప్పారు. ఈ ప్రాంత రైతులు భూములను అమ్ముకోవద్దని సూచించారు. మహేశ్వరం ఆర్టీసీ డిపోలోని పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని మంత్రి ఆర్టీసీ అధికారులకు సూచించారు. కార్యక్రమంలో ఆర్టీసీ ఈడీ జయరామ్, రీజినల్ మేనేజర్ ఎన్. వెంకటేశం, డీవీఎంలు సూర్యకిరణ్, సోలమోన్, మహేశ్వరం మేనేజర్ పవిత్ర తదితరులు ఉన్నారు.
హామీలను నెరవేరుస్తాం..
కందుకూరు: ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చి ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని మంత్రి పి.మహేందర్‌రెడ్డి తెలిపారు. మండల పరిధిలోని పులిమామిడి జెడ్పీ పాఠశాలలో రూ.12.74 లక్షల నిధులతో అదనపు గదుల నిర్మాణ పనులను, కొత్తగూడ పరిధిలో రూ.1.379 కోట్ల నిధులతో నిర్మించిన కస్తూర్బాగాంధీ పాఠశాల భవనాన్ని ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు. విద్యార్థులకు యూనిఫారమ్, ఉపకారవేతనాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. జిల్లాలో 144 పాఠశాలల్లో అదనపు గదుల నిర్మాణానికి రూ.50 కోట్లు మంజూరు చేసినట్లు చెప్పారు. గతంలో ఏ ప్రభుత్వం చేపట్టని విధంగా తాము చెరువుల పునరుద్ధరణ పనులు చేపడుతున్నట్లు పేర్కొన్నారు.
నాలుగేళ్లల్లో ఇంటింటికి నల్లా: ఎమ్మెల్యే
నాలుగేళ్లల్లో నియోజకవర్గంలోని ప్రతి ఇంటికి నల్లా ద్వారా తాగునీటిని సరఫరా చేస్తామని ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి పేర్కొన్నారు. మహేశ్వరాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని ఆయన చెప్పారు. పులిమామిడి-మహేశ్వరం రహదారికి రూ.2.40 కోట్లు మంజూరు అయ్యాయని.. రెండు నెలల్లో పనులు ప్రారంభిస్తామన్నారు. కాగా రోడ్లపై ఎర్ర మట్టి పోసి బంగారు తెలంగాణ అంటున్నారని జెడ్పీటీసీ ఏనుగు జంగారెడ్డి విమర్శించగా.. విమర్శలు మాని అందరం కలిసికట్టుగా అభివృద్ధి చేసుకుందామని ఎమ్మెల్యే ఈ సందర్భంగా ఆయనకు సూచించారు. కార్యక్రమంలో ఎంపీపీ అనేగౌని అశోక్‌గౌడ్, జెడ్పీటీసీ ఏనుగు జంగారెడ్డి, వైస్ ఎంపీపీ అనేగౌని సంధ్యాదామోదర్, సర్పంచు లు అనేగౌని దేవిపాండు, ఆర్.యాదయ్య, మన్నె జయేందర్, టీఆర్ఎస్ మహేశ్వరం నియోజకవర్గ ఇన్చార్జి కొత్త మనోహర్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర నాయకుడు జంబుల రాజేందర్‌రెడ్డి, అధికారులు ఉన్నారు.