‘పాఠం’.. చెప్పేదెవరు ?
కార్పొరేట్ చదువుల ప్రపంచంలో సర్కారు స్కూళ్లను టీచర్ల కొరత తీవ్రంగా వేధిస్తోంది. అందరికీ ఉచిత నిర్బంధవిద్యను అందిస్తామన్న ప్రభుత్వం ఆశయం నెరవే రడం లేదు. పుస్తకాలు, డ్రెస్సులు అందించలేకపోయారు. జిల్లాలో 203 పాఠశాలల్లో పాఠాలు చెప్పేవారు లేక విద్యార్థులు బడివైపు మొహం చూపడం లేదు. వారిని పర్యవేక్షించేందుకు ఎంఈఓలు కూడా అందుబాటులో లేరు. విద్యావలంటీర్ల నియామకం ఊసేలేకుండాపోయింది. డీఎడ్ విద్యార్థుల చేత ఎలాగోలా స్కూళ్లను తెరిపిస్తున్నారు. ఇకనైనా మేల్కొనకపోతే విద్యార్థులు రాక ప్రభుత్వ బడులు మూతబడే అవకాశాలు లేకపోలేదని విద్యారంగ నిపుణులు సూచిస్తున్నారు.
పాలమూరు: సర్కారు బడులను బలోపేతం చేసి అందరికీ విద్యను అందుబాటులోకి తెస్తామని చెబుతున్న పాలకులు, అధికారుల మాటలు నీటిమీది రాతలవుతున్నాయి. విద్యాసంవత్సరం ప్రారంభమైనా ఉపాధ్యాయుల కొరతను తీర్చడంతో పాటు పాఠ్యపుస్తకాల కొరత తీర్చలేకపోయారు. జిల్లాలో అసలు ఉపాధ్యాయులే లేని ప్రభుత్వ పాఠశాలలు 230కి పైగా ఉన్నట్లు తెలుస్తోంది. సింగిల్ టీచర్‌తో కొనసాగుతున్న స్కూలు 700 వరకు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో ప్రాథమిక స్థా యిలో విద్యార్థులకు గుణాత్మక విద్యను అందించే అవకాశమే లేకుండాపోతోంది. జిల్లాలోని సర్కారు స్కూళ్లలో దాదాపు 1600 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉ న్నాయి. వీటిని భర్తీ చేయడంలో ప్రభుత్వం తాత్సారం చేస్తుండటంతో పేదవర్గాల పిల్లలకు ప్రాథమిక విద్య అందని ద్రాక్షగా మారింది.
ఉన్నత పాఠశాలల్లో పదోతరగతి విద్యార్థులకు గణితం, సా మాన్య శాస్త్రం, ఆంగ్లం పాఠ్యాంశాలను బోధించేందుకు కూడా ఉపాధ్యాయులు లేరు. ఇక ఏకోపాధ్యాయులు ఉన్న బడుల్లో సదరు ఉపాధ్యాయుడు వస్తేనే బడి తలుపులు తెరుచుకుంటాయి. లేదంటే పాఠశాలకు ఆరోజు సెలవే.. ఇదీ జిల్లాలో పరిస్థితి అనేక ృపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉండటంతో ఈ ఏడాది నాణ్యమైన విద్య అందించలేమని అప్పుడే అధికారులు చేతులెత్తేస్తున్నారు.
పర్యవేక్షణకూ ఇబ్బందే..!
మండల విద్యాధికారుల నియామకానికి పాలనాపరమైన ఇబ్బందులు ఉండటంతో ఈ పోస్టులు భర్తీకి నోచుకోవడం లేదు. ఫలితంగా జిల్లాలో మొత్తం 64 మండలాలకు 14 మండలాలకు మాత్రమే రెగ్యులర్ ఎంఈఓలు ఉన్నాయి. మిగిలిన 50 మండలాల పరిధిలో సీనియర్ ప్రధానోపాధ్యాయుడికి ఎంఈఓగా పర్యవేక్షణ బాధ్యతలు అప్పగిస్తున్నారు.
దీంతో ఈ పాఠశాలల్లో హెచ్‌ఎంల కొరత సమస్య ఉత్పన్నమవుతోంది. ఇక డిప్యూటీ ఈఓల విషయానికి వస్తే జిల్లాలోని మహబూబ్‌నగర్, నారాయణపేట, గద్వాల, వనపర్తి, నాగర్‌కర్నూల్, షాద్‌నగర్ విద్యాశాఖ డివిజన్ల పరిధిలోని ఉపవిద్యాశాఖ అధికారులంతా ఇన్‌చార్జీలే కావడం గమనార్హం. డైట్ లెక్చరర్లను ఇన్‌చార్జీలుగా నియమించి వారి ద్వారా ఏళ్ల కాలం గడుపుతున్నారు.
వలంటీర్ల నియామకం ఆలస్యమే
ఉపాధ్యాయుల కొరతను దృష్టిలో ఉంచుకుని గతేడాది 1100 మంది వరకు విద్యావలంటీర్లను నియమించుకోవాలని ఉత్తర్వులుఇచ్చారు. అయితే ఈ ఏడాది వలంటీర్ల నియామకాలకు సంబంధించి ఎలాంటి సంకేతాలు రాలేదు. కొత్తగా నియమిస్తారా? లేక విద్యా వలంటీర్ల నియామకాన్ని పూర్తిగా పక్కక పెట్టేస్తారా? అన్న విషయమై స్పష్టత కనిపించడం లేదు.
‘పది’ విద్యార్థుల్లో ఆందోళన
ఈ ఏడాది నుంచి పదో తరగతి పుస్తకాల్లోని పాఠ్యంశాలు మారాయి. కానీ వాటిని బోధించే 200 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కీలకమైన గణితం, సామాన్యశాస్త్రం వంటివాటిని బోధించేవారు లేరు. గతేడాది కొన్ని సర్దుబాట్లు చేశారు. ఓచోట ఒక సబ్జెక్టును బోధించేందుకు ఇద్దరు ఉపాధ్యాయులుంటే వారిలో ఒకరిని పక్కన ఉన్న పాఠశాలలో సర్దుబాటు చేయాలని ఉత్తర్వులు వచ్చాయి. ఈ అవకాశాన్ని కొందరు దుర్వినియోగపరిచారు. తమకున్న పలుకుబడితో మహబూబ్‌నగర్, షాద్‌నగర్, హైదరాబాద్, జాతీయ రహదారికి సమీపంలో ఉన్న పాఠశాలలకు డిప్యుటేషన్‌పై వస్తుండటంతో గ్రామీణ ప్రాంత పాఠశాలలకు నష్టం జరిగింది.