సంక్షామమే
పాలమూరు : సంక్షేమ వసతిగృహాల్లో చేరిన విద్యార్థులకు క్షేమం లేకుండా పోయింది. గ్రామీణ ప్రాంతాల్లోని హాస్టళ్లలో మౌలిక సదుపాయాల్లేక విద్యార్థులు తీవ్రంగా ఇబ్బంది పడాల్సి వస్తోంది. జిల్లా కేంద్రం, ముఖ్య పట్టణాల్లోని కొన్ని హాస్టళ్లలో తప్ప ఇతరచోట్ల తగిన సౌకర్యాలు లేవు. అపరిశుభ్ర వాతావరణం.., దోమల బెడద.., నిద్రపోదామంటే బెడ్‌షీట్‌లు లేవు.. ఇదీ.. జిల్లాలోని సంక్షేమ హాస్టల్ విద్యార్థుల అవస్థ. జిల్లాలోని హాస్టళ్లలో విద్యార్థుల ఇబ్బందులపై బుధవారం ‘సాక్షి’ విజిట్ నిర్వహించింది. దీనిలో అనేక విషయాలు బయటపడ్డాయి. 80 శా తం హాస్టళ్లలో రాత్రి 7 గంటలు దాటితే వా ర్డెన్లు, సిబ్బంది ఉండడం లేదు. దీంతో విద్యార్థులు రాత్రంతా బిక్కు బిక్కుమంటూ గడపాల్సి వస్తోంది. మండలాల్లోని హాస్టళ్లకు కాంపౌండ్ నిర్మాణాల్లేవు. మంచినీటి సౌకర్యం, మరుగుదొడ్లు, స్నానాల గదులు, ఫ్యాన్లు లేవు. కనీసం తాగడానికి మంచినీళ్లు కూడా కరువే.
అక్కడక్కడా ఏర్పాటు చేసిన బోర్లలో వస్తున్న ఉప్పునీటితోనే కాలం గడుపుతున్నారు. విద్యార్థులకు సరిపోను మూత్రశాలలు, స్నానాల గదులు లేక ఆరుబయటే స్నానాలు చేస్తున్నారు. కొన్ని హాస్టళ్లలో మెనూ పాటించడం లేదు. హాస్టళ్లలో చోటుచేసుకుంటున్న అవినీతిపై ఏసీబీ దాడులు చేస్తున్నా పెద్దగా మార్పేమీ రావడం లేదు. అనేక హాస్టళ్లలో రికార్డుల్లో ఎక్కువమంది పేర్లు రాసి తక్కువమందికి భోజనం పెడుతున్నారు. అది కూడా అరకొరగా ఉందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.