కార్పొరేట్ సాధనంగా ‘బడ్జెట్’
ఒంగోలు టౌన్: కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్లకు రాయితీలు ఇచ్చే సాధనంగా బడ్జెట్ను మార్చి వేసిందని సీపీఎం కేంద్ర కమిటీ నాయకుడు బీవీ రాఘవులు మండిపడ్డారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పింఛనర్ల సంఘాల ఐక్యవేదిక జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి స్థానిక సీవీఎన్ రీడింగ్ రూం ఆవరణలో కేంద్ర బడ్జెట్, పెద్దనోట్ల రద్దు, మధ్య తరగతి ఉద్యోగుల ప్రభావంపై జరిగిన సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. బీజేపీ అధికారంలోకి రాకముందు స్వయం ప్రతిపత్తి కలిగిన ప్లానింగ్ కమిషన్ కేంద్రానికి సహాయ సహకారాలు అందిస్తూ వచ్చేదని, ఆ పార్టీ అధికారంలోకి వచ్చిన అనంతరం దాని స్థానంలో నీతి అయోగ్ను ప్రవేశపెట్టిందని విమర్శించారు. రానున్న రెండున్నరేళ్ల ఏళ్లలో రైల్వే రంగాన్ని చిన్నచిన్న ముక్కలుగా చేసి తిని వేసేందుకు కేంద్రం కుట్ర పన్నిందని విమర్శించారు. దేశవ్యాప్తంగా జీఎస్టీని ప్రవేశపెట్టి ఒకే తరహా ధర, పన్ను అమలులోకి తీసుకు వచ్చిందన్నారు. దీంతో చిన్న చిన్న వ్యాపారాలు, పరిశ్రమలకు నష్టం కలిగి సామాన్య ప్రజలపై పన్నుల భారం పడిందన్నారు. విదేశాల్లో ఉన్న నల్లధనాన్ని ఇక్కడకు రప్పిస్తే ఒక్కో కుటుంబానికి రూ.15లక్షలు ఇస్తానంటూ ప్రధాని మోదీ ఎన్నికల సమయంలో ప్రజలకు హామీ ఇచ్చి, ఇప్పుడు నల్ల కుబేరుల పేర్లు బయట పెట్టడానికి కూడా భయపడుతున్నారన్నారు. రూ.16లక్షల కోట్ల నోట్ల రద్దు చేశారని, వాటి స్థానంలో రూ.16లక్షల 50వేల కోట్లు ముద్రించారని, అంటే నల్లడబ్బు పోకపోగా అదనంగా రూ.50వేల కోట్లు వచ్చి పడ్డాయన్నారు. నోట్ల రద్దు కారణంగా ఆర్థిక వ్యవస్థ 7.8శాతం నుంచి 7.1శాతానికి పడిపోయిందని ఎద్దేవా చేశారు.
చట్టసభల్లో మాది అరణ్య ఘోషే
– మాజీ ఎమ్మెల్సీ విఠపు
చట్టసభల్లో మాది అరణ్య ఘోషేనని మాజీ శాసనమండలి సభ్యుడు విఠపు బాలసుబ్రహ్మణ్యం పేర్కొన్నారు. ఉద్యోగ వర్గాలపై ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తోందన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో 474సంక్షేమ వసతి గృహాలను ఎత్తివేసిందని, మరో 310వసతి గృహాలను ఎత్తివేసేందుకు రంగం సిద్ధం చేసిందన్నారు. మాజీ ఎమ్మెల్సీ యండపల్లి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ నోట్ల రద్దు వల్ల ఆర్థిక సంక్షోభం తలెత్తడంతో పాటూ నిరుద్యోగం పెరిగిపోయిందన్నారు. సదస్సులో ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల సంఘాల నాయకులు పాల్గొన్నారు.