పత్తికి ‘మద్దతు’ గగనమే..!
సాక్షి, ఆదిలాబాద్‌టౌన్: పత్తి పంట పండించిన రైతులకు ఏటా తిప్పలు తప్పడం లేదు. గిట్టుబాటు ధర పక్కనపెడితే మద్దతు ధర కూడా అందని పరిస్థితి నెలకొంది. రైతులు ప్రతియేడు ఏదో విధంగా నష్టపోతూనే ఉన్నారు. ప్రకృతి కన్నెర్రజేసినా, వ్యాపారులు నట్టేట ముంచినా చివరకు రైతుకే కన్నీళ్లు తప్పడం లేదు. ఈ యేడాది ఖరీఫ్ సీజన్ ఆగస్టులో భారీ వర్షాలు కురవడంతో పంటలకు తీవ్రం గా నష్టం వాటిల్లింది. జిల్లాలో దాదాపు 30వేల ఎకరాల వరకు పంట నష్టం సంభవించింది. కేంద్ర ప్రభుత్వం ఈ యేడాది మద్దతు ధర పెంచడంతో అన్నదాతల్లో ఆనందం వ్యక్తమవుతుండగా, ప్రైవేట్ వ్యాపారులు సిండికేట్ కావడంతో మద్దతు ధర లభించడం గగనంగా మారే పరిస్థితి కనిపిస్తోంది. సోమవారం జాయింట్ కలెక్టర్ సంధ్యారాణితో జరిగిన సమావేశంలో వారి తీరును చూస్తే కనీసం క్వింటాలుకు రూ.5వేలు చెల్లించే పరిస్థితి కూడా కనిపించేటట్లు లేదు. ఈ ఏడాది సీసీఐ రంగంలోకి దిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
సీసీఐ అధికారులు తేమ కొర్రీ పెట్టనుండడంతో రైతులకు అవస్థలు తప్పేట్లు కనబడడం లేదు. 8 నుంచి 12 శాతం తేమ మించి ఉన్నట్లయితే సీసీఐ కొనుగోలు చేయని విషయం తెలిసిందే. పత్తి కొనుగోళ్ల కోసం సీసీఐ అధికారులు ప్రైవేట్ జిన్నింగ్ మిల్లుల యజమానులతో ఒప్పందాలు కుదుర్చుకోవాల్సి ఉండగా, ఇంకా పూర్తి కాలేదు. గతంలో ఇచ్చిన టెండర్లలో విధించిన నిబంధనలు వ్యాపారులకు గిట్టుబాటు కాకపోవడంతో లీజుకు ఇచ్చేందుకు ముందుకు రావడంలేదని తెలుస్తోంది. దీంతో పత్తి కొనుగోళ్లు సందిగ్ధంలోనే ఉన్నాయి. ఈ నెల 17 నుంచే పత్తి కొనుగోళ్లు చేస్తామని వ్యాపారులు చెబుతున్నారు. అధికారులు మాత్రం 15న కొనుగోలు చేపట్టాలని ఆదేశించారు. కాగా అంతర్జాతీయ మార్కెట్లో బేళ్ల ధర పడిపోగా, వ్యాపారులు మద్దతు ధరతో కొనుగోలుకు ముందుకు వస్తారో లేదోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
తేమ.. ధరలో కోత
ఈ యేడాది పత్తి రైతుకు గిట్టుబాటు ధర లభించడం గగనంగానే కనిపిస్తోంది. గతేడాది క్వింటాలు పత్తి మద్దతు ధర రూ.4320 ఉండగా, కేంద్ర ప్రభుత్వం ఈ యేడాది క్వింటాలుకు రూ.5,450 మద్దతు ధర ప్రకటించింది. గతేడాది కంటే ఈ యేడాది క్వింటాలు పత్తికి రూ.1130 పెంచింది. ప్రస్తుతం వరంగల్ జిల్లాలో పత్తి కొనుగోళ్లు జరుగుతున్నాయి. గతేడాది పండించిన పత్తి క్వింటాలుకు రూ.5,200 నుంచి రూ.4,600 వరకు చెల్లిస్తున్నారని తెలుస్తోంది. అదే ఈ ఖరీఫ్‌లో పండించిన పత్తికి రూ.5,250 నుంచి రూ.4,600 వరకు కొనుగోలు చేస్తున్నారని సమాచారం. ప్రైవేట్ వ్యాపారులు మాత్రం ఈ ధరతో కొనుగోలు చేసేందుకు సిద్ధంగా లేమని కొంతమంది వ్యాపారులు పేర్కొంటున్నారు.
అంతర్జాతీయ మార్కెట్లో బేళ్ల ధర రూ.22వేలు, పత్తి గింజలు క్వింటాలుకు రూ.2100 ఉందని వారు చెబుతున్నారు. రూ.5వేల వరకే తమకు గిట్టుబాటు అయ్యేవిధంగా ఉందని వ్యాపారులు పేర్కొంటున్నారు. దీంతో ఈయేడు తప్పని పరిస్థితుల్లో ప్రభుత్వరంగ సంస్థ సీసీఐ రంగంలోకి దిగే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. సీసీఐ తేమ కొర్రీ విధించనుండడంతో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారే అవకాశాలు లేకపోలేదు. 8శాతం తేమ వరకు మాత్రమే సీసీఐ రూ.5450 ధర చెల్లించనుంది. ఆపై తేమ శాతం ఉంటే క్వింటాలుకు రూ.54.50 కోత విధించనున్నారు. 12శాతం తేమ మించితే మాత్రం పత్తిని కొనుగోలు చేయరు. దీంతో గత్యంతరం లేక రైతులు వ్యాపారులకు పంటను అమ్మి నష్టపోవాల్సిన పరిస్థితి. అధికారులు స్పందించి వ్యాపారులకు నచ్చజెప్పి ఒప్పిస్తే తప్పా రైతులకు మద్దతు ధర లభించే పరిస్థితి కానరావడంలేదు.
గతేడాది లభించని వైనం..
గత ఏడాది రైతులు వ్యాపారుల చేతిలో తీవ్రంగా నష్టపోయారు. వ్యాపారులు సిండికేట్‌గా మారడంతో మద్దతు ధర కరువైంది. అధికారులు, ప్రజాప్రతినిధులు వారిని నచ్చజెప్పినా ధరలో మాత్రం మార్పు జరగలేదు. వ్యాపారులు నిర్ణయించిన ధరకే కొనుగోళ్లు జరిపారు. గతేడాది పత్తి క్వింటాలుకు మద్దతు ధర రూ.4320 ఉండగా, మొదటి రోజు క్వింటాలుకు రూ.4వేలు మాత్రమే చెల్లించారు. ఆ తర్వాత రోజుకు రూ.10 నుంచి రూ.20 వరకు పెంచుతూ కొనుగోళ్లు జరిపారు. రైతుల వద్ద పత్తి పంట ఉన్నప్పుడు ధర పెంచని వ్యాపారులు పంట విక్రయించిన తర్వాత చివరిలో పత్తి పంట ధరను పెంచుతూ రావడం ఆనవాయితీగా మారుతోంది. దీంతో ఆరుగాలం పంట పండించిన రైతులు నష్టాలను చవిచూడగా, వ్యాపారులు మాత్రం లాభాల బాటలో పయనిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి.
సీసీఐ ద్వారానే కొనుగోళ్లు..
ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్లో ఈ నెల 17 నుంచి పత్తి కొనుగోళ్లు ప్రారంభించనున్నారు. గత రెండేళ్ల నుంచి ఆదిలాబాద్‌లో ప్రైవేట్ వ్యాపారుల ద్వారానే అధికంగా కొనుగోళ్లు జరుగుతుండగా, సీసీఐ నామ్‌కే వాస్తేగా కొనుగోళ్లు జరుపుతోంది. కానీ ఈసారి వ్యాపారులు వెనక్కి తగ్గే అవకాశాలు అధికంగా ఉండడంతో సీసీఐ రంగంలో ఉండే పరిస్థితి నెలకొంది. కాగా సోమవారం ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో జిల్లా జాయింట్ కలెక్టర్ సంధ్యారాణి వ్యాపారులతో సమావేశమయ్యారు. ఈ నెల 10 నుంచే పత్తి కొనుగోళ్లు చేపట్టాలని ఆదేశించినప్పటికీ తాము ఎలాంటి ఏర్పాట్లు చేసుకోలేదని, 17వ తేదీ నుంచే కొనుగోళ్లు చేస్తామని జేసీకి విన్నవించారు. ఇంకా కార్మికులు అందుబాటులో లేరని, విద్యుత్ సౌకర్యం ఈ నెల 20 నుంచి అందుబాటులోకి వస్తుందని జేసీ దృష్టికి తీసుకెళ్లారు.
అంతర్జాతీయ మార్కెట్లో ధర లేదు
గతేడాది కంటే ఈయేడాది అంతర్జాతీయ మార్కెట్లో పత్తి బేళ్ల ధర పడిపోయింది. ప్రస్తుతం దూది ధర కండికి రూ.44వేలు పలుకుతోంది. క్వింటాలు పత్తి గింజలకు రూ.2100 మాత్రమే ఉంది. ఈ లెక్కన చూస్తే పత్తి క్వింటాలుకు రూ.5వేల నుంచి రూ.5100 వరకు చెల్లించే అవకాశం ఉంది. ఆపై ధర పెంచితే మాకు గిట్టుబాటు కాని పరిస్థితి. ఒకవేళ అంతర్జాతీయ మార్కెట్లో ధర పెరిగితే ధర పెంచి కొనుగోలు చేయడంలో మాకెలాంటి అభ్యంతరం లేదు. – అజీజ్, ప్రైవేట్ వ్యాపారి, ఆదిలాబాద్