జమ్మికుంట మార్కెట్‌లో పత్తికి వేలం పాట పాడుతున్న రైతులు
ఆరుగాలం కష్టించి పత్తి పండించిన రైతన్నకు ఆదిలోనే ధరల దోబూచులాట తప్పడం లేదు. అప్పుడే పెరుగుతున్నట్లే అనిపిస్తున్న పత్తి ధర క్రమంగా తగ్గుతూ వస్తోంది. ఫలితంగా రైతులు అయోమయంలో పడుతున్నారు. మద్దతు ధర కంటే అదనంగా ధర పలికినా.. అడ్తి కమీషన్, ఇతర ఖర్చులు పరిశీలిస్తే తక్కువ ధరకే చేతికి వస్తోందని రైతులు లెక్కలు వేస్తున్నారు.
జమ్మికుంట(హుజురాబాద్): ఆరుగాలం కష్టపడి పత్తిని పండించిన రైతన్నలకు వ్యాపారుల కొనుగోళ్లతో మద్దతు ధర గిట్టుబాటు కావడం లేదు..రోజురోజుకు పడిపోతున్న ధరలతో రైతుకు లాభం దక్కడం లేదు. మద్దతు కంటే అధనంగా ధర పలికినా.. ఆడ్తి కమీషన్, ఇతర ఖర్చులు పరిశీలిస్తే తక్కువ ధరనే చేతికి వస్తోందని రైతులు లెక్కలు వేస్తున్నారు. శుక్రవారం మార్కెట్‌లో క్వింటాల్ పత్తికి రూ.5,550 ధర గరిష్టంగా పలికినా.. వాçస్తవానికి రైతుకు దక్కిన ధర రూ.5,350 మాత్రమే. అంటే సీసీఐ ధర కంటే రైతుకు క్వింటాల్‌కు రూ.100 వ్యత్యాసం ఉంది.
మద్దతు కంటే తక్కువ ఇలా..
జమ్మికుంట పత్తి మార్కెట్‌లో ఆడ్తిదారుల సమక్షంలో పత్తి కొనుగోళ్లు జరుగుతుంటాయి. ఈక్రమంలో రైతు పత్తిని అమ్మిన తర్వాత ఆడ్తి కమీషన్ మార్కెటింగ్ శాఖ నిబంధనల ప్రకారం నూటికి రూ.2 రైతు నుంచి ఆడ్తిదారుడు వసూలు చేస్తూంటారు. అంటే క్వింటాల్ పత్తికి రూ. 5,550 ధర పలికితే ఇందులో రూ.111 ఆడ్తి కమీషన్‌కు కటింగ్ అవుతుంది. ఇతర ఎగుమతి, దిగుమతి చార్జీలు దాదాపు రూ.100 వరకు అధనంగా ఖర్చు వస్తుంది. క్వింటాల్ పత్తికి రూ.211 తీసేస్తే ఇక రైతుకు పలికిన ధర 5,339. దీంతో రైతులు సీసీఐకి విక్రయిస్తేనే లాభం జరుగుతోందని భావిస్తున్నారు.
సీసీఐకి అమ్మితే..
రైతులు సీసీఐ సంస్థకు పత్తిని నేరుగా మద్దతు ధరకు అమ్ముకుంటే ఏలాంటి కమీషన్, ఇతర ఖర్చులు భారం పడదు. ఎన్ని క్వీంటాళ్ల పత్తిని అమ్మితే అన్ని క్వింటాళ్లకు పూర్తిగా లెక్కలు చేసి రైతులకు అందిస్తారు. అయితే పత్తిని అమ్మినరోజే చేతికి డబ్బులు రావు. మూడునాలుగు రోజులు ఆగితే రైతు ఖాతాలో నేరుగా డబ్బులు జమ అయ్యే పరిస్థితి ఉంటుంది.
సోమవారం సీసీఐ బోని కొట్టె అవకాశం..?
జమ్మికుంట మార్కెట్‌లో మద్దతు కంటే ఎక్కువ ధరలు పలుకుతుండడంతో సీసీఐ సెంటర్ ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు క్వింటాల్ పత్తిని సేకరించలేక పోయారు. మొదట్లో క్వింటాల్ పత్తికి రూ.5,850 వరకు ధర చేరడంతో రైతులు ప్రైవేట్ వ్యాపారులకు అమ్ముకున్నారు. ప్రస్తుతం క్యాండి, గింజల ధరలకు డిమాండ్ లేకపోవడంతో ధర క్రమంగా తగ్గుతూ వస్తోంది. సోమవారం గింజల ధర రూ.1,950 నుంచి రూ.2,150 వరకు పెరిగనా..క్యాండి ధర రూ.47 వేల నుంచి రూ.46,100 వరకు తగ్గింది. దీంతో పత్తి ధర క్వింటాల్‌కు రూ. 5,550కి పడిపోయిందని వ్యాపార వర్గాలు వెల్లడించాయి.
Comments
Please login to add a commentAdd a comment