Counterfeit money
-
కుప్పంలో దొంగనోట్ల ముఠా!
సాక్షి, కుప్పం/రామకుప్పం: మూడు రాష్ట్రాల కూడలి అయిన కుప్పం దొంగనోట్ల విక్రయాలకు కేంద్రంగా మారుతోంది. గతంలో దొంగనోట్లు చెలామణి చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేసి కేసు నమోదు చేసిన దాఖలాలు ఉన్నాయి. వారం రోజులు క్రితం ఓ ముఠా దొంగనోట్లు చెలామణి చేస్తూ పోలీసులకు పట్టుబడినట్లు సమాచారం. కుప్పం కేంద్రంగా చిత్తూరు జిల్లాతో పాటు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు నకిలీ నోట్లను చెలామణి చేసేందుకు ఐదు బృందాలు పనిచేస్తున్నట్లు సమాచారం. వీరికి పట్టుకునేందుకు జిల్లా పోలీసులు ఇప్పటికే ప్రత్యేక డ్రైవ్ చేపట్టినట్లు తెలిసింది. కుప్పం కేంద్రంగా నకిలీ నోట్లు... తమిళనాడులోని కృష్ణగిరికి చెందిన ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఈ ముఠాలో కీలకంగా వ్యహరించినట్లు సమాచారం. కుప్పం మండలం సామగుట్టపల్లిలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని దందా నడుపుతున్నట్లు తెలిసింది. రూ.లక్ష నకిలీ నోట్లు మార్పు చేస్తే రూ.10వేలు కమీషన్ పద్ధతిలో నిర్ణయించి కొందరు యువకులను ఎంపిక చేసుకుని నోట్ల చెలామణి సాగిస్తున్నట్లు సమాచారం. చెడు అలవాట్లకు బానిసై డబ్బుల కోసం చిల్లర చోరీలకు పాల్పడే కొందరు యువకులను ఈ ముఠా పెద్దలు ఎంపిక చేసుకుని వారి ద్వారా ఈ దొంగనోట్లను మార్పు చేస్తున్నట్లు తెలిసింది. గత కొద్ది రోజులుగా చిల్లర దుకాణ వ్యాపారులను ఎంపిక చేసుకుని దొంగనోట్ల మార్పు జోరుగా సాగిస్తున్నట్లు సమాచారం. అంతేకాకుండా బెంగళూరు, చెన్నై తదితర ప్రధాన రాజధాని నగరాల్లో సైతం వీరు నకిలీ నోట్లు చెలామణి చేస్తున్నట్లు సమాచారం. పోలీసుల అదుపులో ముఠా? దొంగనోట్ల వ్యవహారంపై సమాచారం అందుకున్న స్పెషల్ పోలీసులు వ్యూహాత్మకంగా దాడులు చేశారు. దాడుల్లో పెద్ద ఎత్తున నకిలీ నోట్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. సుమారు రూ.2కోట్ల వరకు ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇచ్చిన సమాచారం మేరకు తమిళనాడు వేలూరుకు చెందిన ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. విచారణలో జిల్లా వ్యాప్తంగా పెద్ద నెట్వర్క్ నడుపుతున్నట్లు తెలిసింది. జిల్లా కేంద్రం చిత్తూరుతో పాటు ఆధ్యాత్మిక కేంద్రం తిరుపతి కేంద్రంగా పెద్ద ఎత్తున నకిలీ నోట్లు చెలామణి చేస్తున్నట్లు తెలిసింది. ఇందుకోసం ఐదు బృందాలు పనిచేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. వారిని పట్టుకునేందుకు పోలీసులు స్పెషల్ బృందాలను రంగంలోకి దించినట్లు తెలిసింది. ఇప్పటికే పట్టుబడిన నిందితులను త్వరలోనే అధికారుల ముందు ప్రవేశపెట్టనున్నారు. అమ్మో పెద్ద నోటు.. రూ.2వేలు, రూ.500 నోట్లను చూస్తే కుప్పంవాసుల్లో వణుకుపుడుతోంది. దొంగనోట్ల చెలామణి తంతు బయటపడటంతో దుకాణాదారులు, స్థానికులు రూ.2వేలు, రూ.500 నోట్లను తీసుకోవాలంటేనే ఆందోళన చెందుతున్నారు. గత వారం రోజులుగా ఈ నోట్ల మార్పిడి బయటపడటంతో పట్టణంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కక్కుర్తి పడిన ఇంటి యజమాని నకిలీ నోట్లు చెలామణి చేసే ముఠాకు ఇంటికి అద్దెకు ఇచ్చిన యజమాని అనూహ్యంగా కేసులో చిక్కుకున్నాడు. తొలుత ఇంటిని అద్దెకు ఇచ్చిన యజమానికి కొద్ది రోజులకు అసలు విషయం తెలిసింది. అయితే వారిని పోలీసులకు పట్టించాల్సింది పోయి వారితో పాటు చేతులు కలిపాడు. దొంగనోట్లను చెలామణి చేసేందుకు పూనుకున్నాడు. యువతను లక్ష్యంగా చేసుకుని నకిలీ నోట్లు చెలామణి చేశారు. అయితే ఎట్టకేలకు పోలీసులకు పట్టుబడి ఊచలు లెక్కపెడుతున్నాడు. -
దొంగనోట్ల కలకలం!
సాక్షి, పెద్దపల్లి: జిల్లాలో దొంగనోట్ల కలకలం సృష్టించింది. చాలా సంవత్సరాల తర్వాత జిల్లాలో మళ్లీ దొంగనోట్ల వ్యవహరం తెరపైకి వచ్చింది. ఓ కేసు వ్యవహారంలో తీగలాగితే దొంగనోట్ల డొంకకదులుతోంది. పక్కా సమాచారంతో ఇప్పటికే పోలీసులు దొంగనోట్ల ముఠాను పట్టుకున్నట్లు సమాచారం. దొంగనోట్లు స్థానికంగా ప్రింట్ చేస్తున్నారా? బయటి నుంచి నోట్లు తీసుకొస్తున్నారా? అనే విషయంపై పోలీసులు దృష్టి పెట్టారు. పోలీసుల అదుపులో ముఠా? ముఠాలోని కొంతమంది సభ్యులు పోలీసుల అదుపులో ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. ఓదెల, కాల్వశ్రీరాంపూర్, సుల్తానాబాద్, పెద్దపల్లి మండలాలకు చెందిన వారితో పాటు, ఇతర ప్రాంతాలకు చెందిన పలువురు కలిసి ముఠాగా ఏర్పడ్డారని... ఈముఠా దొంగనోట్లను చాలా రోజుల నుంచి చెలామణి చేస్తున్నట్లు అనుమానిస్తున్నారు. ఓదెల మండలం గుంపుల, సుల్తానాబాద్ మండలంలో ఇతర కేసుల విషయమై దర్యాప్తు చేస్తుంటే ఈ దొంగనోట్ల వ్యవహారం వెలుగు చూసినట్లు ప్రచారం జరుగుతోంది. దర్యాప్తును వేగవంతం చేసిన పోలీసులు ఐదుగురిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. ముందుగా ఓదెల మండలం కొమెరకు చెందిన వ్యక్తిని శనివారం అర్ధరాత్రి అదుపులోకి తీసుకోగా, మిగిలిన సభ్యుల వివరాలు బయటకొచ్చినట్లు సమాచారం. దీంతో కొమెర, పొత్కపల్లి, సుల్తానాబాద్‌లకు చెందిన ఐదుగురు దొంగనోట్ల ముఠా సభ్యులను పోలీసులు విచారిస్తున్నట్లు సమాచారం. ప్రింట్ చేశారా...తీసుకొచ్చారా? దొంగనోట్ల ముఠాను అదుపులోకి తీసుకున్న పోలీసులు ప్రస్తుతం దొంగనోట్లను స్థానికంగా> ముద్రిస్తున్నారా? ఇతర ప్రాంతాల నుంచి నోట్లు తెప్పించి జిల్లాలో చెలామణి చేస్తున్నారా? అనే అంశంపై దృష్టి సారించారు. చాలా సంవత్సరాల క్రితం జమ్మికుంటలో దొంగనోట్లు ముద్రించిన ఉదంతాలు ఉండడంతో, మళ్లీ ఈ దందా ఊపిరి పోసుకుందా? అనే దిశగా కూడా పోలీసులు ఆరా తీస్తున్నట్లు వినికిడి. జమ్మికుంటకు ఓదెల మండలం అతిసమీపంలో ఉండడంతో రాకపోకలు కూడా ఎక్కువగానే ఉంటాయి. గతంలో ఈ దందా జరగడం, ప్రస్తుతం అదే ప్రాంతంలో దొంగనోట్ల దందాలో జిల్లా వాసులతో పాటు ఇతర జిల్లాలకు చెందిన వారిపైనా పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. జిల్లాకు చెందిన వారిపాత్ర ఇందులో చిన్నదని, ఇతర జిల్లాలకు చెందిన నిందితులే ఇందులో కీలకమని సమాచారం. ప్రధాన నిందితుడుగా భావిస్తు న్న హైదరాబాద్‌కు చెందిన వ్యక్తిని అరెస్ట్‌చేస్తే, ఈ మొత్తం వ్యవహారం బయటకు వచ్చే అవకాశం ఉంది. అనూహ్యంగా వెలుగుచూసిన దొంగనోట్ల వ్యవహారం పెద్దపల్లి ప్రాంతంలో కలకలం రేపింది. పోలీసులు అధికారికంగా ముఠా అరెస్ట్‌ను చూపనప్పటికీ.. దొంగనోట్ల ముఠా సభ్యులను అదుపులోకి తీసుకున్నారనే ప్రచారం ఈ ప్రాంతంలో శరవేగంగా వ్యాపిం చింది. దీనితో గతంలో ఈ దందాతో ముడిప డి ఉన్న కుటుంబాలు ఉలిక్కిపడుతున్నాయి. -
స్పెషల్ బ్రాంచ్ ఏంచేస్తున్నట్లు?
సరుబుజ్జిలి : ఆమదాలవసలో సోమవారం నకిలీనోట్ల ముఠా చిక్కడంతో వారిని విచారించి మరింత సమాచారం సేకరించే పనిలో పోలీసులు నిమగ్నమైనట్లు తెలుస్తోంది. పాతపట్నం మండలానికి చెందిన ఈ ముఠాతో సరుబుజ్జిలి మండలానికి చెందిన పలు గ్రామాలకు చెందిన యువకులు ఈ నకిలీనోట్ల వ్యవహారంలో పాలుపంచుకున్నట్లు సమాచారం. దీంతో ఇంతకాలం మన మధ్య తిరుగుతున్న వ్యక్తులు ఫేక్ కరెన్సీ ముఠాలతో కుమ్మక్కాయ్యారా అంటూ మండలవాసులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. అడ్డదారిలో అధిక సొమ్ము గడించాలన్న దురాశతో పలువురు ఉపాధ్యాయులు కూడా ఈ దొంగనోట్ల చలామణిలో తెరవెనుక పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. తెరవెనుక... దొంగనోట్ల వ్యవహారంలో ముఠా సభ్యులు పట్టుబడి సుమారు 24 గంటలు గడుస్తున్నా ఇంతవరకు పోలీసులు ఈ కేసు పురోగతిపై వేగం పెంచకపోవడం అనుమానాలకు తావిస్తోంది. ఈ కేసులో పాలకపక్షానికి చెందిన కొంతమంది వ్యక్తుల పేర్లు ప్రధానంగా వినిపించడంతో పోలీసులు వెనుకంజవేస్తున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మొద్దునిద్రలో స్పెషల్ బ్రాంచ్! మండలంలో నకిలీ నోట్ల ముఠాలు సంచరిస్తున్నట్లు చాలా కాలం నుంచి విమర్శలున్నాయి. ప్రధానంగా గ్రామాల్లో జరుగుతున్న పరిణామాలను ముందస్తుగా అంచనాలు వేసి పోలీసు ఉన్నతాధికారులకు పంపించడం స్పెషల్ బ్రాంచ్ సిబ్బంది విధి. నకిలీ క రెన్సీ ముఠాల విషయంలో పలుమార్లు స్వయంగా, పత్రికలు ద్వారా వారిని అప్రత్తంచేసినా స్పందనలేదు. దీంతో ముందస్తు సమచారంలేక పోలీసులు నకిలీ కరెన్సీ ముఠాలను అరికట్టడంలో విఫలమయ్యారని చెప్పవచ్చు.