
సాక్షి, పెద్దపల్లి: జిల్లాలో దొంగనోట్ల కలకలం సృష్టించింది. చాలా సంవత్సరాల తర్వాత జిల్లాలో మళ్లీ దొంగనోట్ల వ్యవహరం తెరపైకి వచ్చింది. ఓ కేసు వ్యవహారంలో తీగలాగితే దొంగనోట్ల డొంకకదులుతోంది. పక్కా సమాచారంతో ఇప్పటికే పోలీసులు దొంగనోట్ల ముఠాను పట్టుకున్నట్లు సమాచారం. దొంగనోట్లు స్థానికంగా ప్రింట్ చేస్తున్నారా? బయటి నుంచి నోట్లు తీసుకొస్తున్నారా? అనే విషయంపై పోలీసులు దృష్టి పెట్టారు.
పోలీసుల అదుపులో ముఠా?
ముఠాలోని కొంతమంది సభ్యులు పోలీసుల అదుపులో ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. ఓదెల, కాల్వశ్రీరాంపూర్, సుల్తానాబాద్, పెద్దపల్లి మండలాలకు చెందిన వారితో పాటు, ఇతర ప్రాంతాలకు చెందిన పలువురు కలిసి ముఠాగా ఏర్పడ్డారని... ఈముఠా దొంగనోట్లను చాలా రోజుల నుంచి చెలామణి చేస్తున్నట్లు అనుమానిస్తున్నారు. ఓదెల మండలం గుంపుల, సుల్తానాబాద్ మండలంలో ఇతర కేసుల విషయమై దర్యాప్తు చేస్తుంటే ఈ దొంగనోట్ల వ్యవహారం వెలుగు చూసినట్లు ప్రచారం జరుగుతోంది. దర్యాప్తును వేగవంతం చేసిన పోలీసులు ఐదుగురిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. ముందుగా ఓదెల మండలం కొమెరకు చెందిన వ్యక్తిని శనివారం అర్ధరాత్రి అదుపులోకి తీసుకోగా, మిగిలిన సభ్యుల వివరాలు బయటకొచ్చినట్లు సమాచారం. దీంతో కొమెర, పొత్కపల్లి, సుల్తానాబాద్‌లకు చెందిన ఐదుగురు దొంగనోట్ల ముఠా సభ్యులను పోలీసులు విచారిస్తున్నట్లు సమాచారం.
ప్రింట్ చేశారా...తీసుకొచ్చారా?
దొంగనోట్ల ముఠాను అదుపులోకి తీసుకున్న పోలీసులు ప్రస్తుతం దొంగనోట్లను స్థానికంగా> ముద్రిస్తున్నారా? ఇతర ప్రాంతాల నుంచి నోట్లు తెప్పించి జిల్లాలో చెలామణి చేస్తున్నారా? అనే అంశంపై దృష్టి సారించారు. చాలా సంవత్సరాల క్రితం జమ్మికుంటలో దొంగనోట్లు ముద్రించిన ఉదంతాలు ఉండడంతో, మళ్లీ ఈ దందా ఊపిరి పోసుకుందా? అనే దిశగా కూడా పోలీసులు ఆరా తీస్తున్నట్లు వినికిడి. జమ్మికుంటకు ఓదెల మండలం అతిసమీపంలో ఉండడంతో రాకపోకలు కూడా ఎక్కువగానే ఉంటాయి. గతంలో ఈ దందా జరగడం, ప్రస్తుతం అదే ప్రాంతంలో దొంగనోట్ల దందాలో జిల్లా వాసులతో పాటు ఇతర జిల్లాలకు చెందిన వారిపైనా పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.
జిల్లాకు చెందిన వారిపాత్ర ఇందులో చిన్నదని, ఇతర జిల్లాలకు చెందిన నిందితులే ఇందులో కీలకమని సమాచారం. ప్రధాన నిందితుడుగా భావిస్తు న్న హైదరాబాద్‌కు చెందిన వ్యక్తిని అరెస్ట్‌చేస్తే, ఈ మొత్తం వ్యవహారం బయటకు వచ్చే అవకాశం ఉంది. అనూహ్యంగా వెలుగుచూసిన దొంగనోట్ల వ్యవహారం పెద్దపల్లి ప్రాంతంలో కలకలం రేపింది. పోలీసులు అధికారికంగా ముఠా అరెస్ట్‌ను చూపనప్పటికీ.. దొంగనోట్ల ముఠా సభ్యులను అదుపులోకి తీసుకున్నారనే ప్రచారం ఈ ప్రాంతంలో శరవేగంగా వ్యాపిం చింది. దీనితో గతంలో ఈ దందాతో ముడిప డి ఉన్న కుటుంబాలు ఉలిక్కిపడుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment