
సాక్షి, కుప్పం/రామకుప్పం: మూడు రాష్ట్రాల కూడలి అయిన కుప్పం దొంగనోట్ల విక్రయాలకు కేంద్రంగా మారుతోంది. గతంలో దొంగనోట్లు చెలామణి చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేసి కేసు నమోదు చేసిన దాఖలాలు ఉన్నాయి. వారం రోజులు క్రితం ఓ ముఠా దొంగనోట్లు చెలామణి చేస్తూ పోలీసులకు పట్టుబడినట్లు సమాచారం. కుప్పం కేంద్రంగా చిత్తూరు జిల్లాతో పాటు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు నకిలీ నోట్లను చెలామణి చేసేందుకు ఐదు బృందాలు పనిచేస్తున్నట్లు సమాచారం. వీరికి పట్టుకునేందుకు జిల్లా పోలీసులు ఇప్పటికే ప్రత్యేక డ్రైవ్ చేపట్టినట్లు తెలిసింది.
కుప్పం కేంద్రంగా నకిలీ నోట్లు...
తమిళనాడులోని కృష్ణగిరికి చెందిన ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఈ ముఠాలో కీలకంగా వ్యహరించినట్లు సమాచారం. కుప్పం మండలం సామగుట్టపల్లిలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని దందా నడుపుతున్నట్లు తెలిసింది. రూ.లక్ష నకిలీ నోట్లు మార్పు చేస్తే రూ.10వేలు కమీషన్ పద్ధతిలో నిర్ణయించి కొందరు యువకులను ఎంపిక చేసుకుని నోట్ల చెలామణి సాగిస్తున్నట్లు సమాచారం. చెడు అలవాట్లకు బానిసై డబ్బుల కోసం చిల్లర చోరీలకు పాల్పడే కొందరు యువకులను ఈ ముఠా పెద్దలు ఎంపిక చేసుకుని వారి ద్వారా ఈ దొంగనోట్లను మార్పు చేస్తున్నట్లు తెలిసింది. గత కొద్ది రోజులుగా చిల్లర దుకాణ వ్యాపారులను ఎంపిక చేసుకుని దొంగనోట్ల మార్పు జోరుగా సాగిస్తున్నట్లు సమాచారం. అంతేకాకుండా బెంగళూరు, చెన్నై తదితర ప్రధాన రాజధాని నగరాల్లో సైతం వీరు నకిలీ నోట్లు చెలామణి చేస్తున్నట్లు సమాచారం.
పోలీసుల అదుపులో ముఠా?
దొంగనోట్ల వ్యవహారంపై సమాచారం అందుకున్న స్పెషల్ పోలీసులు వ్యూహాత్మకంగా దాడులు చేశారు. దాడుల్లో పెద్ద ఎత్తున నకిలీ నోట్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. సుమారు రూ.2కోట్ల వరకు ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇచ్చిన సమాచారం మేరకు తమిళనాడు వేలూరుకు చెందిన ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. విచారణలో జిల్లా వ్యాప్తంగా పెద్ద నెట్‌వర్క్ నడుపుతున్నట్లు తెలిసింది. జిల్లా కేంద్రం చిత్తూరుతో పాటు ఆధ్యాత్మిక కేంద్రం తిరుపతి కేంద్రంగా పెద్ద ఎత్తున నకిలీ నోట్లు చెలామణి చేస్తున్నట్లు తెలిసింది. ఇందుకోసం ఐదు బృందాలు పనిచేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. వారిని పట్టుకునేందుకు పోలీసులు స్పెషల్ బృందాలను రంగంలోకి దించినట్లు తెలిసింది. ఇప్పటికే పట్టుబడిన నిందితులను త్వరలోనే అధికారుల ముందు ప్రవేశపెట్టనున్నారు.
అమ్మో పెద్ద నోటు..
రూ.2వేలు, రూ.500 నోట్లను చూస్తే కుప్పంవాసుల్లో వణుకుపుడుతోంది. దొంగనోట్ల చెలామణి తంతు బయటపడటంతో దుకాణాదారులు, స్థానికులు రూ.2వేలు, రూ.500 నోట్లను తీసుకోవాలంటేనే ఆందోళన చెందుతున్నారు. గత వారం రోజులుగా ఈ నోట్ల మార్పిడి బయటపడటంతో పట్టణంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
కక్కుర్తి పడిన ఇంటి యజమాని
నకిలీ నోట్లు చెలామణి చేసే ముఠాకు ఇంటికి అద్దెకు ఇచ్చిన యజమాని అనూహ్యంగా కేసులో చిక్కుకున్నాడు. తొలుత ఇంటిని అద్దెకు ఇచ్చిన యజమానికి కొద్ది రోజులకు అసలు విషయం తెలిసింది. అయితే వారిని పోలీసులకు పట్టించాల్సింది పోయి వారితో పాటు చేతులు కలిపాడు. దొంగనోట్లను చెలామణి చేసేందుకు పూనుకున్నాడు. యువతను లక్ష్యంగా చేసుకుని నకిలీ నోట్లు చెలామణి చేశారు. అయితే ఎట్టకేలకు పోలీసులకు పట్టుబడి ఊచలు లెక్కపెడుతున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment