cow dies
-
కన్నీటి వ్యథ: మిమ్మల్నే నమ్ముకుంటే.. వదిలెళ్లారా..
నర్సింహులపేట: వ్యవసాయాన్నే నమ్ముకున్న కుటుంబం అది.. సాగులో సాయంగా మూడు పశువులు ఉన్నాయి. వర్షాలు కురుస్తుండడంతో దుక్కి దున్ని వ్యవసాయానికి సిద్ధమవుతున్న ఆ రైతు కుటుంబానికి కరెంట్ రూపంలో ఆపద వచ్చింది. మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలంలోని జయపురంలో గురువారం గాలిదుమారం రాగా జామాయిల్ తోటలో కరెంట్ తీగ తెగి పడింది. ఈ విషయం తెలియక రామచంద్రు మధ్యాహ్నం వరకు నాగలి దున్ని పశువులను మేతకు వదిలాడు. ఇంతలోనే పశువులు విద్యుత్ తీగను తాకి మృతి చెందాయి. రూ.1.50 లక్షల విలువైన ఒక కాడెద్దు, ఆవు, కోడె లేగ చనిపోవడంతో ఆ రైతు కుటుంబం వాటిపై పడి రోదించిన తీరు అందరినీ కన్నీరు పెట్టించింది. ఇక్కడ చదవండి: మూగజీవాలపై యమపాశం -
‘గంగా స్నానం చేసి వస్తేనే గ్రామంలోకి రానిస్తాం’
భోపాల్ : అనుకోకుండా జరిగిన ఘటనకు ఓ కుటుంబం గ్రామ బహిష్కరణకు గురైంది. డ్రైవింగ్‌లో నిర్లక్ష్యం వల్ల ఆవు మృతికి కారణమైన వ్యక్తి, అతని కుటుంబానికి గ్రామ పంచాయతీ సభ్యులు శిక్ష విధిస్తూ తీర్మానం చేశారు. గంగానదిలో మునిగి వస్తేనే తిరిగి గ్రామంలోకి రావాలని హుకుం జారీ చేశారు. దాంతోపాటు ఊరంతా భోజనాలు (కన్య అండ్ బ్రాహ్మణ్ భోజ్), ఒక గోవును దానంగా కూడా ఇవ్వాలని ఆదేశించారు. లేనిపక్షంలో తిరిగి ఊర్లోకి రానిచ్చేది లేదని హెచ్చరించారు. ఈ ఘటన భోపాల్‌కు 402 కిలోమీటర్ల దూరంలోని షియోపూర్‌లో మంగళవారం జరిగింది. వివరాలు.. పప్పు ప్రజాపతి (36) ఎప్పటిలాగానే తన ఇంటివద్ద ట్రాక్టర్‌ను పార్కింగ్ చేస్తున్నాడు. అక్కడే ఉన్న ఆవును అతను గుర్తించలేదు. దీంతో ట్రాక్టర్ వెనక చక్రాల కిందపడి ఆవు అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. ఇది తెలుసుకున్న గ్రామ సర్పంచ్ పంచమ్ సింగ్ పంచాయతీ నిర్వహించాడు. ప్రజాపతి గో హత్య చేశాడని తేల్చిన పంచాయతి సభ్యులు శిక్ష విధిస్తూ తీర్మానించారు. ‘ట్రాక్టర్ని పార్కింగ్ చేస్తుండగా.. ప్రమాదవశాత్తూ ట్రాలీ వెనక చక్రాల కిందపడి ఆవు చనిపోయింది. అనుకోకుండా జరిగిన ఈ ఘటనకు చాలా బాధగా ఉంది. కానీ, పంచాయతీ పెద్దలు నేను గో హత్య చేశానంటూ దోషిగా నిలబెట్టారు. నాతో సహా కుటుంబం మొత్తానికి శిక్షలు ఖరారు చేశారు’ అని ప్రజాపతి వాపోయాడు. ఘటనపై సమాచారం అందిందనీ, అవసరమైన చర్యలు తీసకుంటామని జిల్లా అడిషనల్ కలెక్టర్ రాజేంద్ర రాయ్ చెప్పారు. కాగా, పంచాయతీ తీర్పునకు కట్టుబడి ప్రజాపతి కుటుంబంతో సహా గంగానదిలో స్నానానికి బయలుదేరారు. పాపం మూటగట్టుకున్నారు.. గో హత్య చేసి ప్రజాపతి కుటుంబం పాపం మూటగట్టుకుంది. పంచాయతీ విధించిన శిక్షను వారు అనుభవిస్తే పాపపరిహారం జరుగుతుంది. -ఓం ప్రకాశ్ గౌతమ్, పంచాయతీ మెంబర్ -
ప్రాణంగా పెంచుకున్న ఆవు చనిపోయిందని..
తిరుమలగి(నాగార్జునసాగర్) : తను ప్రాణంగా పెంచుకున్న ఆవు చనిపోయిందన్న బాధతో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన నల్లగొండ జిల్లా తిరుమలగిరి మండలంలోని సుంకిశాలతండాలో మంగళవారం చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం... తండాకు చెందిన రమావత్ గ్యామ సుక్కి దంపతులకు ముగ్గురు సంతానం, రెండవ కుమారుడు రమావత్ బాలా(19)కి చిన్ననాటి నుంచి పశువులు అంటే ఇష్టం. రోజు మాదిరిగానే డిసెంబర్ 29వ తేదీన పశువుల వద్దకు వెళ్లాడు. తాను సాకుతున్న ఆవు వెరే వ్యక్తి చేనులోకి వెళ్లింది. ఆవును తోలుకువచ్చే క్రమంలో ఆవును బలంగా కొట్టడంతో అది అక్కడికక్కడే మృతి చెందింది. క్షణికావేశంలో ఆవును తాను కొట్టడంతోనే మృతి చెందిందనే బాధతో బాలా నాయకునితండా వద్ద గల టెయిల్‌పాండ్‌లో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. టెయిల్‌పాండ్‌లో మత్స్యకారులు చేపలు పడుతుండగా బాలా మృతదేహాన్ని గమనించి బయటికి తీశారు. అదే గ్రామంలో మృతుడికి బంధువులు ఉండడంతో గుర్తించి తల్లిదండ్రులకు సమాచా రం అందించారు. బాలా మృతదేహాన్ని చూసి బంధువులు కన్నీరుమున్నీరయ్యారు. -
మోటార్ సైక్లిస్ట్‌పై పిడుగు
సాక్షి, హుకుంపేట : మండలంలోని మారుమూల మత్స్యపురం పంచాయతీ తురకలమెట్ట సమీపంలో బుధవారం సాయంత్రం బైక్‌పై ఒక్కసారిగా పిడుగుపడడంతో మోటార్‌సైక్లిస్ట్ మృతి చెందాడు. సమీపంలో ఉన్న మరో గిరిజనుడికి గాయాలయ్యాయి. అతని పరిస్థితి విషమంగా ఉంది. ఉప్ప బైరోడివలస గ్రామానికి చెందిన కొర్రా సుబ్బారావు (40) పాడేరులో పనులు పూర్తి చేసుకుని, తురకలమెట్ట గ్రామానికి చెందిన ఉబ్బేటి మహేష్(30)తో కలిసి బైక్‌పై స్వగ్రామానికి వస్తున్నాడు. సాయంత్రం ఐదు గంటల సమయంలో పిడుగులతో కూడిన భారీ వర్షం కురిసింది. తురకలమెట్ట జంక్షన్లో తన బైక్ వెనుక కూర్చున్న మహేష్‌ను దింపి, వెళుతున్న సమయంలో బైక్‌పై పిడుగుపడింది. ఈ పిడుగు ధాటికి బైక్ నడుపుతున్న సుబ్బారావు కుప్పకూలి అక్కడికక్కడే మృతి చెందాడు. సమీపంలో ఉన్న మహేష్ కూడా తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. సమీపంలోని గిరిజనులు మహేష్‌ను ఉప్ప ఆరోగ్య కేంద్రానికి తరలించి ప్రాథమిక వైద్యసేవలు కల్పిం చారు. అతని పరిస్థితి విషమంగా ఉండడంతో రాత్రి పాడేరు ప్రాంతీయ ఆస్పత్రికి అంబులెన్స్‌లో తరలించారు. మృతుడు సుబ్బారావు వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలుతో జీవనోపాధి పొందుతున్నాడు. మృతునికి భార్య, పిల్లలు ఉన్నారు. సమాచారం తెలుసుకున్న వీఆర్వో జ్యోతి ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. పిడుగు పడి ఆవు మృతి పద్మనాభం(భీమిలి) : బి.తాళ్లవలసలో బుధవారం సాయంత్రం పిడుగు పడి ఒక చూడి ఆవు మృతి చెందింది. గెద్ద నాగరాజుకు చెందిన ఆవు కళ్లంలో చెట్టు కింద ఉంది. పిడుగు పడడంతో ఆవు అక్కడికక్కడే దుర్మరణం చెందింది. దీని విలువ రూ. 35వేలు. మరో నెల రోజుల్లో ఈ ఆవు ప్రసవించనుంది. ఇంతలో పిడుగు మృత్యువు రూపంలో ఆవును కబళించకపోవడంతో నాగరాజు కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. -
చిరుత దాడిలో లేగదూడ మృతి
బచ్చేహళ్లి (శెట్టూరు): చిరుత దాడిలో లేగ దూడ మృతి చెందిన ఘటన శెట్టూరు మండలంలో సంచలనం రేకెత్తించింది. వారం రోజుల్లో పశుసంపదపై చిరుత దాడి చేయడం ఇది రెండోసారి. వివరాల్లోకి వెళితే.. శెట్టూరు మండలంలోని బచ్చేహళ్లి గ్రామానికి చెందిన గొల్ల చిత్తక్క పాడిపోషణతో జీవనోపాధి పొందుతున్నారు. బుధవారం రాత్రి తన పశువుల పాకలో చొరబడిన చిరుతపులి ఓ లేగదూడను గ్రామ శివారులోకి లాక్కెళ్లి తినేసింది. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు రామచంద్రనాయక్, జగన్నాథ్.. ఘటన స్థలాన్ని పరిశీలించారు. చిరుత దాడిలో రూ. 4వేలు నష్టపోయినట్లు ఈ సందర్భంగా వారి ఎదుట బాధిత చిత్తక్క వాపోయారు. చిరుతను బంధించాలని గ్రామస్తులు వేడుకున్నారు.