Creative commercials
-
మెగా న్యూస్ : గ్యాంగ్‌లీడర్ రీమేక్
మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో బిగెస్ట్ హిట్స్‌లో ఒకటిగా నిలిచిన సినిమా గ్యాంగ్ లీడర్. మాంగటి రవీంద్రనాథ్ చౌదరి నిర్మాణంలో విజయబాపినీడు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అప్పట్లో ఘనవిజయం సాధించి ఎన్నో రికార్డ్లను సొంతం చేసుకుంది. అయితే మెగా వారసుడిగా రామ్ చరణ్ ఎంట్రీ ఇచ్చిన దగ్గర నుంచి గ్యాంగ్ లీడర్ రీమేక్‌కు సంబంధించిన చర్చ జరుగుతూనే ఉంది. మెగాస్టార్ అద్భుతమైన టైమింగ్‌తో అలరించిన రాజారామ్ పాత్రలో రామ్ చరణ్‌ను చూసేందుకు ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. త్వరలోనే అభిమానుల కల నేరవేరబోతోందన్న టాక్ వినిపిస్తోంది. ఇటీవల జరిగిన తేజ్ ఐ లవ్ యు ఆడియో రిలీజ్ వేడుకలో మాట్లాడిన చిరు, క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్లో రామ్ చరణ్ హీరోగా సినిమా ఉంటుందన్న హింట్ ఇచ్చారు. అయితే అది గ్యాంగ్ లీడర్ రీమేకే అన్న ప్రచారం జరుగుతోంది. ఒరిజినల్ కథను ఈ జనరేషన్‌కు తగ్గట్టుగా మార్పులు చేసిన తెరకెక్కించేందుకు కేయస్ రామారావు ప్రయత్నిస్తున్నారట. రాజమౌళి తెరకెక్కిస్తున్న మల్టీ స్టారర్ తరువాత చరణ్ చేయబోయే సినిమా ఇదే అన్న టాక్ కూడా వినిపిస్తోంది. మరి ఫిలిం నగర్లో చక్కర్లు కొడుతున్న ఈ వార్తలపై మెగా టీం ఎలా స్పందిస్తుందో చూడాలి. -
విజయ్ ఖాతాలో మరో క్రేజీ మూవీ
పెళ్లి చూపులు సినిమాతో ఒక్కసారిగా స్టార్ స్టేటస్ అందుకున్నాడు.. యంగ్ హీరో విజయ్ దేవరకొండ. ఎవడే సుబ్రమణ్యం సినిమాతో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న విజయ్, పెళ్లిచూపులు సక్సెస్‌తో బిజీ ఆర్టిస్ట్‌గా మారిపోయాడు. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న ఈ కుర్ర హీరో మరో ఇంట్రస్టింగ్ ప్రాజెక్ట్‌కు ఓకే చెప్పాడు. ఓనమాలు, మళ్లీ మళ్లీ ఇదిరాని రోజు లాంటి సినిమాలను తెరకెక్కించిన క్రాంతి మాధవ్ దర్శకత్వంలో సినిమా చేసేందుకు అంగీకరించాడు విజయ్ దేవరకొండ. ప్రస్తుతం ద్వారక సినిమా షూటింగ్ పూర్తి చేసే పనిలో ఉన్న విజయ్, ఆ సినిమా తరువాత క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్లో క్రాంతి మాధవ్ తెరకెక్కించే సినిమాలో హీరోగా నటిస్తాడు. -
నాది నలభై ఏళ్ల ప్రస్థానం
‘‘ఒకప్పటి సినిమాల్లో కథ ఉండేది. ఇప్పటి సినిమాల్లో కథాకాకరకాయ్ ఏమీ ఉండదు. తలాతోకా లేని సినిమాలు చాలా వస్తున్నాయి. ఎప్పుడు వస్తున్నాయో, ఎప్పుడు పోతున్నాయో కూడా తెలీని పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం సినిమా పరిశ్రమ పరిస్థితి అయితే మాత్రం అంత బాగా లేదు’’ అని కె.ఎస్.రామారావు ఆవేదన వెలిబుచ్చారు. రేడియోలో వాణిజ్య ప్రకటనలతో మొదలై తరువాతి కాలంలో చిత్ర నిర్మాణానికి విస్తరించిన ‘క్రియేటివ్ కమర్షియల్స్’ సంస్థకు 40 ఏళ్లు నిండాయి. ఈ సందర్భంగా ఈ సంస్థ అధినేత కె.ఎస్.రామారావు గురువారం హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడుతూ, ‘‘1974లో రేడియో పబ్లిసిటీ రంగంలో క్రియేటివ్ కమర్షియల్స్ ప్రస్థానం మొదలైంది. ‘అల్లూరి సీతారామరాజు’ చిత్రాన్ని అప్పట్లో విభిన్నంగా ప్రమోట్ చేశాం. ఆ ఏడాది విడుదలైన చిత్రాల్లో లెజెండ్రీ హిట్ అంటే అదే. 1981లో ‘మౌనగీతం’ చిత్రంతో నిర్మాతగా మారాను. అప్పుడప్పుడే ఎదుగుతున్న చిరంజీవిలో కసి, పట్టుదల చూసి ఆయన్ను హీరోగా పెట్టి ‘అభిలాష’ తీశాను. అప్పట్నుంచి ఇప్పటివరకూ అశ్లీలం, ద్వంద్వార్థ సంభాషణలకు ఆస్కారం లేకుండా కుటుంబ సమేతంగా చూడదగ్గ సినిమాలను మాత్రమే నిర్మిస్తూ వచ్చాం. ఇక నుంచి కూడా మా నుంచి అలాంటి సినిమాలే వస్తాయి’’ అని నమ్మకంగా చెప్పారు కేఎస్. ‘‘చిరంజీవికి ‘మరణమృదంగం’ సమయంలో ‘సూపర్‌స్టార్’ బిరుదు ఇద్దామనుకున్నాం. అయితే... అప్పటికే ఆ బిరుదుతో కృష్ణగారు పాపులర్. అందుకే ‘మెగాస్టార్’ బిరుదు ఇచ్చాం. నిజంగా అది చాలా అరుదైన బిరుదు’’ అని గత స్మృతుల్ని నెమరేసుకున్నారు కేఎస్ రామారావు.