Credit Card Billing
-
క్రెడిట్ కార్డు మీ శ్రేయోభిలాషి.. శత్రువు!
జీవితం ఎప్పుడు ఎలా మారుతుందో ఎప్పుడు ఏ అవసరాలు పుట్టుకొస్తాయో ఎవరమూ చెప్పలేం. అప్పటిదాకా సజావుగా సాగిపోతున్న జీవితాల్లో ఒక్క కుదుపు చాలు మొత్తం తిరగబడిపోవడానికి. ముఖ్యంగా ఆర్థిక విషయాల్లో ఉపద్రవాలు తలెత్తితే కుటుంబాలే కుదేలయిపోతాయి. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ కచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. తగిన ఆర్థిక భద్రత ఉండేలా చూసుకోవాలి. ఒడుదొడుకులు ఎదురైనప్పుడు తట్టుకునే విధంగా ఆర్ధిక పరిపుష్టి సాధించాలి. లేదంటే ప్రమాదమే. ఖర్చులు పెరిగిపోయి అరాకొరా జీతాలతో ఆర్థిక ఇబ్బందులు పడుతున్న వారు మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి. సాధారణంగా ఇలాంటి వ్యక్తులు ఈమధ్యన ఎక్కువగా ఆశ్రయిస్తున్న సాధనం క్రెడిట్ కార్డులు. సగటున నెలకు రూ.25000-రూ.30000 ఆర్జించే వ్యక్తులు క్రెడిట్ కార్డులపై ఎక్కువగా ఆధారపడుతున్నారు. కొందరు ఆర్ధికంగా మంచి స్థితిలోనే ఉన్నప్పటికీ క్రెడిట్ కార్డులను స్టేటస్ సింబల్ కోసమో, సరదాకో వాడటం కూడా చూస్తూనే ఉన్నాం.ఏదైనా మోతాదు మించకూడదు..అతి సర్వత్రా వర్జయేత్ అన్నట్లు అతి ఎప్పటికే ప్రమాదమే. ఎక్కువగా క్రెడిట్ కార్డులను వాడినా సమస్యలు తప్పవు. ఆ తర్వాత బిల్లులు కట్టలేక నిండా మునిగిపోయే పరిస్థితి ఎదురవుతుంది.ఇలాంటి పరిస్థితులు తలెత్తకూడదంటే మొదటే జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆయా బ్యాంకులు, ఇతరత్రా ప్రైవేట్ సంస్థలు ఇస్తున్నాయి కదా అని కొంతమంది 4, 5 క్రెడిట్ కార్డులు కూడా తీసుకుంటున్నారు. ఇది మరింత ప్రమాదకరం.కార్డులిస్తున్న సంస్థలివే..దేశంలోని ప్రముఖ ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు క్రెడిట్ కార్డులను ఆఫర్ చేస్తున్నాయి. అలాగే కొన్ని అన్ రిజిస్టర్డ్ సంస్థలు కూడా వివిధ కార్పొరేట్ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుని కార్డులు ఇస్తున్నాయి.క్రెడిట్‌కార్డు పొందాలంటే..క్రెడిట్ కార్డు పొందాలంటే ముఖ్యంగా క్రెడిట్ స్కోర్ బావుండాలి. సాధారణంగా 750 -900 మధ్యలో క్రెడిట్ స్కోర్ ఉంటే కార్డు పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీనికి తోడు మన ఆదాయాన్ని కూడా పరిగణనలోకి తీసుకుని క్రెడిట్ లిమిట్ ఆధారంగా కార్డులు జారీ చేస్తారు. నెలకు రూ.20000 ఆదాయం పొందే వ్యక్తికి కూడా క్రెడిట్ కార్డులను ఆయా బ్యాంకులు ఆఫర్ చేస్తున్నాయి. అదే ప్రీమియం కార్డుల విషయానికొస్తే రూ.1 లక్ష నుంచి రూ.3 లక్షల వరకు ఆదాయాన్ని పరిగణనలోకి తీసుకుని కార్డులు జారీ చేస్తున్నాయి.కార్డు జారీకి ఇవి చాలా ముఖ్యంకార్డు జారీ చేయాలంటే క్రెడిట్ హిస్టరీ బావుండాలి. అంటే గతంలో ఏవైనా లోన్లు తీసుకుని ఉంటే అవి సక్రమంగా చెల్లిస్తున్నారా లేదా లోన్లు ఎంత ఉన్నాయి ఎప్పటికి క్లోజ్ అవుతాయనే వివరాలు పరిగణలోకి తీసుకుంటారు. కార్డు జారీలో మీరు పని చేస్తున్న కంపెనీ కూడా ప్రముఖ పాత్ర పోషిస్తుంది. మీరు ఎలాంటి కంపెనీలో పనిచేస్తున్నారు? ఎన్నాళ్లుగా పనిచేస్తున్నారు? ఆ కంపెనీ స్థాపించి ఎన్నాళ్లయింది? అది స్థిరమైన కంపెనీ యేనా? వంటి అంశాలు కూడా కార్డుల జారీలో బ్యాంకులు దృష్టిలో పెట్టుకుంటాయి.మెరుగైన సిబిల్ ఉంటేనే..కార్డుకు దరఖాస్తు చేసే ముందే మీ క్రెడిట్ స్కోర్ (దీన్నే సిబిల్ స్కోర్ అని కూడా అంటారు) ఎంతుందో తెలుసుకోవాలి. క్రెడిట్ కార్డు పొందడానికి 18 ఏళ్లు పైబడిన వారు మాత్రమే అర్హులు. కార్డు దరఖాస్తుకు అవసరమైన పత్రాలన్నీ మీరు అప్లై చేసే బ్యాంకులో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఆదాయ ధ్రువీకరణ పత్రాలు(Payslips) సమర్పించాలి. దీంతోపాటు ఫోటో ఐడీ, అడ్రస్ ప్రూఫ్, బ్యాంకు స్టేట్మెంట్ తదితర డాక్యుమెంట్లను ఇవ్వాలి. నేరుగా బ్యాంకులోగానీ ఆన్లైన్ ద్వారాగానీ దరఖాస్తు సమర్పించవచ్చు. ఆయా బ్యాంకులు లేదా కార్డు జారీ చేసే సంస్థల నిబంధనలను తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. సదరు బ్యాంకు లేదా సంస్థ మీరిచ్చిన పత్రాలన్నిటినీ సమగ్రంగా పరిశీలించి మీ అర్హతను బట్టి కార్డు జారీ చేస్తుంది.ఇదీ చదవండి: త్వరలో టీజీ రెరా యాప్..ఇష్టారాజ్యంగా వాడితే అంతే..కార్డు చేతికొచ్చాక మీరు దాన్ని సరిగా వాడుకుంటే అది మీకు చాలా మేలు చేస్తుంది. అలాకాక చేతిలో కార్డు ఉంది కదా అని ఇష్టారాజ్యంగా వాడితే అదే మిమ్మల్ని కష్టాల్లోకి నెట్టేస్తుంది. కార్డు బిల్లు వచ్చాక చాలామంది సాధారణంగా ఒక పొరపాటు చేస్తూంటారు. కనీస మొత్తం చెల్లిస్తూ గడిపేస్తూ ఉంటారు. దీనివల్ల బాకీ ఎప్పటికీ తీరకపోగా తీసుకున్న మొత్తానికి మించి చెల్లిస్తారు. కట్టేది తక్కువేకదా అనే భ్రమ కలిగించేలా ఉన్న ఈ మినిమం పేమెంట్ ఊబిలో పడితే చాలా నష్టపోవాల్సి ఉంటుంది.ఉదా: ఒక వ్యక్తికి రూ.1 లక్ష విలువ చేసే క్రెడిట్ కార్డు వచ్చింది అనుకుందాం. అతను తన అవసరాల కోసం రూ.25,000 కార్డు నుంచి వాడేశాడు. దాని మీద అతను నెలకు కట్టాల్సిన కనీస మొత్తం రూ.1,250 మాత్రమే. కట్టేది తక్కువేగా అని ఆ మొత్తమే కట్టుకుంటూ పోతాడు. దీనివల్ల 6 నెలలు గడిచినా అతను అప్పటికి రూ.7,500 కట్టి ఉన్నా తీరేది అతి స్వల్ప మొత్తమే. ప్రతి నెలా చార్జీలు జత కలుస్తూనే ఉంటాయి. కార్డు వాడేవాళ్లలో నూటికి 95 మంది చేసే తప్పే ఇది.ఏం చేయాలంటే.. క్రెడిట్ కార్డు పేమెంట్ బిల్లు డేట్ జనరేట్ అయిన తర్వాత మళ్లీ బిల్లు వచ్చి దాన్ని చెల్లించేందుకు 45 రోజుల వడ్డీ రహిత సదుపాయం ఉంటుంది. దీన్ని ఉపయోగించుకుని మొత్తం బాకీ ఒకేసారి తీర్చేసి మళ్లీ కార్డును వాడుకుంటే మీకు వడ్డీల భారం తగ్గుతుంది. మీరు కట్టాల్సిన మొత్తం తీరిపోతుంది. అదే సమయంలో మీ క్రెడిట్ రికార్డూ పదిలంగా ఉంటుంది. సంస్థకు లేదా సంబంధిత బ్యాంకుకు మీపై విశ్వాసం పెరిగి మీ లిమిట్ మొత్తాన్ని పెంచడానికి ఆస్కారం ఉంటుంది. అర్ధమయింది కదా క్రెడిట్ కార్డును మీరు ఎలా వాడుతున్నారన్నది మీ చేతుల్లోనే ఉంటుంది. సద్వినియోగం చేసుకుంటే లబ్ది పొందుతారు. లేదంటే మునిగిపోతారు. ఆలోచించుకుని అడుగేయండి.-బెహరా శ్రీనివాస రావు,పర్సనల్ ఫైనాన్స్ విశ్లేషకులు -
మీరు క్రెడిట్ కార్డ్ బిల్ పే చేయలేకపోతున్నారా?!
ప్రస్తుతం కరోనా కారణంగా ఆర్థిక మాంద్యం పూర్తిగా దెబ్బతిన్నది. ఉద్యోగాలు కోల్పోయి, బ్యాంకుల్లో తీసుకున్న లోన్లు, క్రెడిట్ కార్డ్ బిల్లులు కట్టలేక ఇబ్బందులు పడుతున్నారు. కొంతమంది మాత్రం చేతిలో సమయానికి డబ్బులున్నా వాటిని ఏ విధంగా చెల్లిస్తే ఆర్ధిక సమస్యల నుంచి బయటపడొచ్చో తెలుసుకోలేకపోతున్నారు. క్రెడిట్ కార్డ్‌ల విషయంలో కూడా అదే జరుగుతుంది. అయితే కొన్ని జాగ్రత్తలు పాటించడం వల్ల ఈ క్రెడిట్ కార్డ్ ఉచ్చునుంచి సురక్షితంగా ఉండొచ్చు. ఈఎంఐ సౌకర్యం ఉంది : మనం ఏదైనా బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌ను వినియోగిస్తే నిర్ణీత సమయంలో పే చేయాల్సి ఉంటుంది. లేదంటే బ్యాంక్‌లు విధించే 30 నుంచి 40శాతం వడ్డీలపై వడ్డీలు చెల్లించాల్సి ఉంటుంది. పైగా వడ్డీ పడకుండా చెల్లించే నిర్ణీత గడువును కూడా కోల్పోవాల్సి వస్తుంది. అందుకే పెద్ద మొత్తంలో ఈఎంఐ చెల్లించే వారికి కొన్ని బ్యాంక్‌లు ఈఎంఐ సదుపాయాన్ని కల్పిస్తుంటాయి. ఆ సదుపాయాన్ని వినియోగించుకుంటే అధిక వడ్డీ నుంచి సురక్షితంగా ఉండొచ్చు. విపత్కర పరిస్థితుల నుంచి సులభంగా బయటపడొచ్చు. అప్పులన్నీ ఒకేసారి తీరుస్తున్నారా: ఉన్న అప్పులన్నీ ఒకే సారి తీర్చాలని నానా కష్టాలు పడుతుంటారు. అలా కాకుండా అప్పు ఎంత ఉన్నా భాగాలుగా విభజించి చిన్న మొత్తంలో చెల్లిస్తే కొన్ని నెలలకు, లేదంటే సంవత్సరాలకు ఆ ఇబ్బందుల నుంచి బయటపడొచ్చు. క్రెడిట్ కార్డ్ ఈఎంఐ కూడా అంతే . ఉదాహరణకు బ్యాంక్ ఇచ్చిన తేదీకి క్రెడిట్ కార్డ్ బిల్లు రూ. 50 వేలు చెల్లించాలి. మీ దగ్గర అంత డబ్బు లేదని నానా హైరానా పడుతుంటారు. కుటుంబసభ్యుల్నో,స్నేహితుల్నో అడిగి క్రెడిట్ కార్డ్ బిల్లు పే చేస్తుంటారు. అలా కాకుండా ఉన్న రూ.50వేల మొత్తాన్ని 10నెలల పాటు నెలకు రూ.5 వేలు కట్టుకుంటే మీపై భారం తగ్గిపోతుంది. అందుకోసం బ్యాంక్ అధికారుల్ని ఆశ్రయించాల్సి ఉంటుంది. బ్యాంక్‌ను బట్టి ఈఎంఐ అమౌంట్, గడువు ఉంటుంది. ఈఎంఐ గా మార్చుకోండి : అవసరం ఉందని క్రెడిట్ కార్డ్ తీసుకునేముందు గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్య విషయం ఏంటంటే.. క్రెడిట్ కార్డ్‌లపై బ్యాంక్‌లు విధించిన పరిమితి దాటినప్పుడు ఈఎంఐ మార్చుకునే అవకాశం ఉందా? లేదా?అని తెలుసుకోవాలి. మ్యాక్సిమం అన్ని బ్యాంకులు ఈఎంఐ సదుపాయాన్ని ఇస్తాయి. కాకపోతే రేట్ ఆఫ్ ఇంట్రస్ట్ గురించి ఆరాతీయండి. పొరపాటున క్రెడిట్ కార్డ్ బిల్లు మీ పరిధి దాటితే ఈఎంఐగా మార్చుకోవచ్చు. వేరే బ్యాంక్ నుంచి పే చేయండి : మీరు రెండు మూడు క్రెడిట్ కార్డ్‌లు వాడుతుంటే ఒక బ్యాంక్ క్రెడిట్ కార్డ్ బిల్లును మరో బ్యాంక్ ద్వారా చెల్లించే సదుపాయం ఉంది. క్రెడిట్ కార్డు అవుట్ స్టాండింగ్ బిల్లును ఈఎమ్ఐగా మార్చుకునేందుకు ప్రస్తుతం ఉన్న కార్డు జారీదారులు నిరాకరించినా, ఇందుకోసం ఎక్కువ వడ్డీ రేటు వసూలు చేసినా ఈ ఆప్షన్ ఉపయోగపడుతుంది. ముందే తెలుసుకోండి : నెల వారీ పరిధి దాటి చెల్లించే క్రెడిట్ కార్డులకు 23 నుంచి 49 శాతం చెల్లించాల్సి ఉంటుంది. అదే ఉన్న మొత్తాన్ని ఈఎంఐగా మార్చుకొని చెల్లిస్తే ఇంట్రస్ట్ తక్కువ పడుతుంది. నిర్ణీత సమయంలో క్రెడిట్ కార్డ్ బిల్ పే చేయండి లేదంటే మీరు క్రెడిట్ కార్డ్‌పై చెల్లించే వడ్డీ రేటు, ఇతర బ్యాంక్‌ల క్రెడిట్ కార్డ్‌లపై చెల్లించే వడ్డీ రేట్లు ఎంత ఉంటాయో తెలుసుకోవాలి. ఆ తరువాతనే పే చేయండి. -
రైళ్లలో క్రెడిట్, డెబిట్ కార్డులతో ఫుడ్
న్యూఢిల్లీ: రైళ్లలో ఆహార బిల్లుల్ని చెల్లించేందుకు 2,191 పీఓఎస్ (పాయింట్ ఆఫ్ సేల్) మెషీన్లను ఐఆర్సీటీసీ ప్రవేశపెట్టింది. రైలు ప్రయాణికులు ఈ మెషీన్ల వద్ద తమ క్రెడిట్, డెబిట్ కార్డులను ఉపయోగించి ఆహార బిల్లులను చెల్లించవచ్చు. ప్యాంట్రీకార్లున్న రైళ్లలో పీఓఎస్ మెషీన్లను ప్రయాణికులకు అందుబాటులో ఉంచినట్లు రైల్వే శాఖ తెలిపింది. రైళ్లలో ఆహార పదార్థాలు కొనేటప్పుడు విక్రేతలు ప్రయాణికుల నుంచి అధికమొత్తాన్ని వసూలు చేయకుండా అరికట్టేందుకు ఈ మెషీన్లు ఉపయోగపడతాయని తెలిపింది. ఎక్స్‌ప్రెస్, మెయిల్ రైళ్లల్లో జనవరి 26 నుంచి ఫిబ్రవరి 15వరకు పీఓఎస్ మెషీన్ల పనితీరు, ఆహారపదార్థాల కొనుగోలుపై ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహిస్తామని పేర్కొంది. -
క్రెడిట్ కార్డ్ నిబంధనలు కఠినతరం
న్యూఢిల్లీ : క్రెడిట్ కార్డ్ బిల్లింగ్ నిబంధనావళిని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కఠినతరం చేసింది. పేమెంట్ బకాయి నిర్దేశిత సమయంకన్నా... మూడు రోజులు దాటితే... ఆ ఆలస్యానికి సంబంధించి క్రెడిట్ కార్డ్ వినియోగదారులపై జరిమానా విధించాలని, క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీలకు ఈ సమాచారాన్ని తెలియజేయాలని బ్యాంకులను ఆదేశించింది. బకాయి ఆలస్యం ప్రాతిపదికన జరిమానాలు ఉండాలని నిర్దేశించింది. బకాయి తేదీ నుంచి 90 రోజుల లోపు ‘బకాయి కనీస మొత్తం ’ చెల్లించకపోతే... క్రెడిట్ కార్డ్‌ను ‘మొండి బకాయి పద్దు’(ఎన్పీఏ)గా పరిగణించాలని ఒక నోటిఫికేషన్లో తెలిపింది. రుణ విధానాల్లో అత్యుత్తమ క్రమశిక్షణ ప్రక్రియను పెంపొందించే క్రమంలో ఈ నిబంధనావళిని అమలు చేయాలని సూచించింది. బకాయి తేదీ నాటికి పూర్తి మొత్తాన్ని లేదా అందులో కొంత భాగాన్ని లేదా ఒక కనీస మొత్తాన్ని చెల్లించే అవకాశాన్ని కార్డ్ వినియోగదారులకు బ్యాంకులు కల్పించాలని ఆర్బీఐ సూచించింది. ఈ విధానంలో ఒక వేళ చెల్లించాల్సిన బ్యాలెన్స్ ఇంకా ఉంటే... ఆ మొత్తాన్ని తదుపరి నెల బిల్లింగ్ ప్రక్రియలో చెల్లించేలా అవకాశం కల్పించాలని పేర్కొంది.