Crete Island
-
గ్రీస్‌లో జీఎంఆర్ మరిన్ని పెట్టుబడులు
ముంబై: గ్రీస్‌లో విమానాశ్రయాన్ని అభివృద్ధి చేస్తున్న దేశీ దిగ్గజం జీఎంఆర్ గ్రూప్.. ఆ దేశంలో మరిన్ని పెట్టుబడులు పెట్టే యోచనలో ఉంది. కెలమాటా ఎయిర్‌పోర్ట్‌లో ఇన్వెస్ట్ చేసే అవకాశాలను పరిశీలిస్తోంది. ప్రస్తుతం జీఈకే టెర్నా సంస్థతో కలిసి గ్రీస్‌లోని క్రెటె ప్రాంతంలో హెరాక్లియోన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు జీఎంఆర్ గ్రూప్ తెలిపింది. హెరాక్లియోన్ విమానాశ్రయ పనులు చురుగ్గా సాగుతున్నాయని ఇంధన, అంతర్జాతీయ ఎయిర్‌పోర్ట్స్ వ్యాపార విభాగం చైర్మన్ శ్రీనివాస్ బొమ్మిడాల తెలిపారు. ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనలో భాగంగా గ్రీస్ ప్రధాన మంత్రి నిర్వహించిన విందులో శ్రీనివాస్ కూడా పాల్గొన్నారు. భారత్, గ్రీస్ మధ్య కనెక్టివిటీ మెరుగుపడితే ఇరు దేశాల స్థూల దేశీయోత్పత్తి వృద్ధికి, వ్యాపార అవకాశాల కల్పనకు తోడ్పడగలదని ఆయన పేర్కొన్నారు. -
శరణార్థుల పడవ మునక
-117 మంది మృతి - వందలాది మంది గల్లంతు - గ్రీస్ తీరంలో ఘటన ఎథెన్స్: మధ్యధరా సముద్రంలో మరణ ఘోష వినిపిస్తూనే ఉంది. స్వదేశాల్లో యుద్ధంతో భీతిల్లి పొట్ట చేతపట్టుకొని యూరప్ దేశాలకు పయనమవుతున్న శరణార్థులు ఆటుపోట్లకు బలవుతున్న విషాద ‘సాగర’గాథ కొనసాగుతూనే ఉంది. తాజాగా మధ్యధరా సముద్రాన్ని దాటే క్రమంలో గ్రీస్ తీరంలో బోటు బోల్తా పడి వందలాది గల్లంతయ్యారు. వారిలో 117 మంది మృతదేహాలు లిబియాలోని జువారా తీరానికి గురువారం కొట్టుకువచ్చాయి. క్రీట్ ద్వీపం దగ్గర్లో పడవ మునిగిందని, కిక్కిరిసిన పడవలో సామర్థ్యానికి మించి 125 మంది వరకు ఉండవచ్చని, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని లిబియా నేవీ ప్రతినిధి కల్నల్ అయూబ్ ఖాసీం తెలిపారు. ఎవరెవరు ఏఏ దేశాలకు చెందినవారో ఇంకా గుర్తించాల్సి ఉందన్నారు. బోటు ఎప్పుడు మునిగిందన్నదీ చెప్పలేకపోతున్నారు. కొన్ని శవాలు కుళ్లిపోయున్నాయి. గల్లంతైన వారి కోసం గాలిస్తున్నారు. గ్రీస్ కోస్ట్ గార్డ్స్ 340 మందిని రక్షించారు. నాలుగు మృతదేహాలను గుర్తించినట్టు అంతర్జాతీయ వలసల సంస్థ (ఐఓఎం) ప్రకటించింది. ఆఫ్రికా నుంచి బయలుదేరినట్టుగా భావిస్తున్న ఈ బోట్లో దాదాపు 700 మంది ప్రయాణిస్తున్నట్టు అంచనా. ఇటీవల కాలంలో సుమారు వెయ్యి మంది ఇలా బలయ్యారు. జనవరి నుంచి 2.04 లక్షల మంది మధ్యధరా సముద్రం మీదుగా ఐరోపా దేశాలకు వలస వెళ్లారు. ఈ భయానక ప్రయాణంలో 2,500 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఎక్కువ మంది లిబియా నుంచి ఇటలీకి వెళుతున్న క్రమంలో మృత్యువాత పడ్డవారే.