cricket competition
-
క్రీడల్లో రాణిస్తే ఉన్నత శిఖరాలు
విజయవాడ స్పోర్ట్స్: సాక్షి ప్రీమియర్ లీగ్ (ఎస్పీఎల్) ఉమ్మడి కృష్ణా జిల్లా స్థాయి జూనియర్, సీనియర్ పురుషుల క్రికెట్ పోటీలు ముగిశాయి. కానూరు వీఆర్ సిద్ధార్థ ఇంజినీరింగ్ కాలేజీలో పది రోజుల పాటు హోరాహోరీగా జరిగిన ఈ టోర్నీలో 12 జూనియర్, 28 సీనియర్ జట్లు తలపడ్డాయి. రెండు విభాగాల్లో శుక్రవారం జరిగిన ఫైనల్స్ ఉత్కంఠభరితంగా సాగింది. జూనియర్స్ విభాగంలో ఎన్ఆర్ఐ జూనియర్ కాలేజీ, ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీ, సీనియర్స్ విభాగంలో ఆంధ్రా లయోల ఇంజినీరింగ్ కాలేజీ, నలంద డిగ్రీ కాలేజీ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లను పెనమలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి టాస్ వేసి ప్రారంభించారు. జిల్లా స్థాయి పోటీల్లో ఫైనల్స్‌కు చేరిన జట్లను అభినందించారు. క్రీడల్లో రాణిస్తే విద్యార్థులు ఉన్నత శిఖరాలు చేరుకోవచ్చని చెప్పారు. ఎన్ఆర్ఐ విశ్వరూపం... టోర్నీ ఆరంభం నుంచి దూకుడు ప్రదర్శించిన ఎన్ఆర్ఐ జూనియర్ కాలేజీ జట్టు ఫైనల్స్‌లో అదే క్రీడా ప్రతిభను కనబర్చింది. బ్యాటింగ్, బౌలింగ్‌లోనూ సత్తా చాటి తన ప్రత్యర్ధి ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీ జట్టుపై 78 రన్స్ తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఎన్ఆర్ఐ జట్టు నిర్ణీత 10 ఓవర్లకు ఒక వికెట్‌ను మాత్రమే కోల్పోయి 130 పరుగులను సాధించింది. బ్యాట్స్మెన్లు రూపేష్ ఆర్ధసెంచరీ (28 బాల్స్, 2 సిక్స్‌లు, 9 ఫోర్లు, 64 రన్స్)తో, ఇక్తాన్సింగ్ 33 పరుగులతో రాణించారు. భారీ స్కోరు లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు దిగిన పాలిటెక్నిక్ జట్టును ఎన్ఆర్ఐ బౌలర్లు 52 పరుగులకు కట్టడి చేసి జూనియర్స్ విభాగంలో జిల్లా స్థాయి విజేతగా నిలవడమే కాకుండా సెంట్రల్ ఆంధ్రా ఎస్పీఎల్ పోటీలకు ప్రాతినిధ్యం వహించే ఉమ్మడి కృష్ణా జిల్లా జట్టుకు ఎంపికైంది. ఈ మ్యాచ్‌లో 64 రన్స్ చేసిన ఎన్ఆర్ఐ బ్యాట్స్‌మెన్ రూపేష్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌కు ఎంపికయ్యాడు. జూనియర్స్ విభాగంలో రన్నర్‌గా పాలిటెక్నిక్ జట్టు నిలిచింది. ఉత్సాహాన్నిచ్చింది సాక్షి మీడియా గ్రూప్ నిర్వహించిన ‘సాక్షి ప్రీమియర్ లీగ్’ (ఎస్పీఎల్) ఎంతో ఉత్సాహానిచ్చిందని ఎన్ఆర్ఐ జూనియర్ కాలేజీ కెప్టెన్ రేవంత్, నలంద డిగ్రీ కాలేజీ జట్టు కెప్టెన్ సుశాంత్నాయుడు అన్నారు. ట్రోఫీలను అందుకున్న అనంతరం వారు సాక్షితో మాట్లాడారు. కాలేజీల్లో చదువుకునే విద్యార్థుల కోసమే సాక్షి ఈ టోర్నీ నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. ఒక్కో జట్టుతో తలపడినపుడు ఒక్కో విషయాన్ని గ్రహించామన్నారు. ప్రత్యర్ధి జట్లు ఎలా ఉంటాయనేది తెలుసుకున్నామన్నారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సాక్షి యాజమాన్యం చర్యలు తీసుకుందన్నారు. క్రీడా నైపుణ్యం సాధించేందుకు ఎస్పీఎల్ దోహదం క్రీడా నైపుణ్యం సాధించేందుకు సాక్షి ప్రీమియర్ లీగ్ దోహద పడతుందని సీపీ టీకే రాణా అన్నారు. ముగింపు సభకు ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఆయన విజేతలకు ట్రోఫీలు అందజేశారు. సీనియర్స్ విభాగంలో నలంద డిగ్రీ కాలేజీ జట్టుకు విన్నర్ ట్రోఫీని, ఆంధ్రా లయోల ఇంజినీరింగ్ కాలేజీ జట్టుకు రన్నర్ ట్రోఫీని, జూనియర్స్ విభాగంలో ఎన్ఆర్ఐ జూనియర్ జట్టుకు విన్నర్ ట్రోఫీని, ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీ జట్టుకు రన్నర్ ట్రోఫీని అందజేశారు. సాక్షి రెసిడెంట్ ఎడిటర్ రమణమూర్తి, ఏపీ అడ్మిన్ డీజీఎం కె.ఎస్.అప్పన్న, కాలేజీ ప్రిన్సిపాల్ ఎ.వి.రత్నప్రసాద్, బ్రాంచ్ మేనేజర్ యశోధ్ రాజ్ తదితరులు పాల్గొన్నారు. ఎస్పీఎల్ జూనియర్ విజేత జట్లకు క్రికెట్ కిట్లు అందజేత విజయవాడ స్పోర్ట్స్: సాక్షి ప్రీమియర్ లీగ్ (ఎస్పీఎల్) జూనియర్ బాలుర ఉమ్మడి కృష్ణా జిల్లా స్థాయి క్రికెట్ పోటీల్లో విజేతలకు క్రికెట్ కిట్లను పెనమలూరు ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి పంపిణీ చేశారు. జూనియర్స్ విభాగాన ఎన్ఆర్ఐ జూనియర్ కాలేజీ, ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల జట్ల మధ్య శుక్రవారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌ను ఎమ్మెల్యే టాస్ వేసి ప్రారంభించారు. ఈ రెండు జట్ల క్రీడాకారులు కోరిన మేరకు రెండు క్రికెట్ కిట్లను ఎమ్మెల్యే సారథి వెంటనే మంజూరు చేశారు. క్రీడాకారులు ఉజ్వల భవిష్యత్ ఉంటుందన్నారు. -
8 నుంచి పాఠశాలల క్రికెట్ పోటీలు
హన్మకొండ : పాఠశాలల జిల్లాస్థాయి క్రికెట్ పోటీలు ఆగస్టు 8 నుంచి ప్రారంభమవుతాయని ది తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ తాళ్లపల్లి జయపాల్ తెలిపారు. సోమవారం హన్మకొండ స్నేహనగర్‌లోని ఓరుగల్లు జూనియర్ కాలేజీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ పోటీల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన వారిని జిల్లా జట్టుకు ఎంపిక చేస్తామన్నారు. ప్రథమ స్థానంలో నిలిచే జట్టుకు రూ.10 వేల నగదు పారితోషికాన్ని అందజేస్తామన్నారు. మ్యాచ్‌లు మ్యాట్‌పై జరుగుతాయన్నారు. ఈ పోటీల్లో పాల్గొనే పాఠశాలల జట్లు హన్మకొండ స్నేహనగర్‌లోని ఓరుగల్లు జూనియర్ కాలేజీలో వివరాలు నమోదు చేసుకోవాలన్నారు. సెమీస్‌కు చేరే నాలుగు జట్లను హైదరాబాద్‌లో జరుగనున్న క్రికెట్ పోటీల్లో ఇతర జిల్లాల జట్లతో ఆడించనున్నట్లు తెలిపారు. విద్యార్థులు తమ తమ స్కూల్ డ్రెస్‌లతో మ్యాచ్‌లలో ఆడాల్సి ఉంటుందన్నారు. వివరాలకు 97006 85123, 98666 08130, 98494 40721 ఫోన్ నంబర్లలో సంప్రదించాలని కోరారు. -
ప్రెస్‌క్లబ్ క్రికెట్ టోర్నమెంట్లో సాక్షి టీవీ బోణీ
-
క్రికెట్టా..? పరీక్షలా?
నెల్లూరు (విద్య):నాలుగేళ్లకు ఒకసారి వచ్చే ప్రపంచకప్ క్రికెట్ పోటీలు, మరోవైపు తమ జీవితాన్ని మలుపు తిప్పే ఫైనల్ పరీక్షలు.. ప్రస్తుతం పరిస్థితి క్రికెట్టా? పరీక్ష లా? అన్న సందిగ్ధత విద్యార్థుల్లో నెల కొంది. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో క్రికెట్‌ను మతంగా, క్రీడాకారులను దైవంగా భావించే విద్యార్థుల దృష్టి పరీక్షలపై మళ్లించడం కష్టసాధ్యమే. గతంలోనైతే క్రికెట్ పోటీలను చూడకుండా టీవీ లను బంద్ చేసేవారు. ప్రస్తుతం పెరిగిపోతున్న సాంకేతిక పరిజ్ఞానం తల్లిదండ్రులను ఆందోళనకు గురిచేస్తోంది. గత ఆదివారం పాకిస్థాన్, ఇండియా మ్యాచ్ సందర్భంలో విద్యార్థుల్లోని క్రికెట్ ఫీవర్ ఏస్థాయిలో ఉందో తెలిసిపోయింది. విద్యార్థులు దాదాపుగా టీవీలకు అతుక్కుపోయారు. కుదరని వారు స్మార్టఫోన్లతో గడిపారు. మైదానాల్లో పరుగుల కోసం క్రీడాకారులు శ్రమపడుతుంటే, ఆ పరుగులను చూస్తూ పరీక్షల కోసం విద్యార్థులు పరుగులు తీయాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ రెండు పరుగుల మధ్య సమన్వయం లోపిస్తే విద్యార్థుల భవిష్యత్ తలకిందులయ్యే పరిస్థితి నెలకొంటుంది. వరల్డ్‌కప్ పోటీల్లో మొత్తం 49 మ్యాచ్‌లను వీక్షిస్తూ కూర్చుంటే ఇంచుమించు పరీక్షల కాలం కాస్త ముగిసిపోయే ప్రమాదముంది. కనెక్షన్లు బంద్ పరీక్షల కోసం కొంతమంది తల్లిదండ్రులు రెండు నెలల క్రితమే ఇళ్లలో టీవీలను, సెటాప్ బాక్సుల కనెక్షన్లను బంద్ చేశారు. టెన్త విద్యార్థులు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆ విద్యాసంస్థల్లోనే చదువుకుంటారు కాబట్టి వారికి టీవీ చూసే అవకాశం ఉండదు. ఇంటికొచ్చే సమయానికి సెటాప్ బాక్సులు, టీవీ కనెక్షన్లు లేకపోవడంతో వారికి టీవీ చూసే అవకాశం తక్కువే. అయితే ఇంటర్ నుంచి ఆ పరిస్థితి మారిపోయింది. వీరు కాలేజీల్లో ఉండే సమయం కంటే బయటే ఎక్కువ గడుపుతారు. ప్రైవేటు విద్యాసంస్థల్లో మినహా ఇంటర్, డిగ్రీ విద్యార్థులు బయటే అధిక సమయాన్ని గడిపేస్తున్నారు. వీరికి పెద్ద స్క్రీన్లతో స్పోర్ట్స్ లాంజ్‌లు అందుబాటులోకి వచ్చాయి. ఇలాంటి తరుణంలో క్రికెట్ క్రీడే చదువులను డామినేట్ చేస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. నియంత్రణ కష్టమే.. జిల్లావ్యాప్తంగా టెన్త పరీక్షలకు సుమారు 36 వేల మంది, ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షలకు 28,743 మంది, ద్వితీయ సంవత్సరం పరీక్షలకు 25,450 మంది హాజరుకానున్నారు. ఇంటర్ ప్రాక్టికల్స్ జరుగుతున్నాయి. విద్యార్థులను నియత్రించే శక్తి, విద్యాసంస్థలకు లేదనేది వాస్తవం. ఈక్రమంలోనే సాంకేతిక పరి జ్ఞానం కూడా అందుబాటులోకి వచ్చింది. అదే స్మార్ట్‌ఫోన్. వీరు ఎక్కడున్నా ఈ ఫోన్ల ద్వారా మ్యాచ్‌లను చూస్తారు. పరీక్షల సమయంలో క్రికెట్ వీరిని అధిగమిస్తుందనేది పలువురి వాదన. ఫోన్లను దూరం చే సే ధైర్యం తల్లిదండ్రులకు లేదనే చెప్పాలి. తేల్చుకోవాల్సిందే వారే: - కరిమద్దెల నరసింహారెడ్డి, వ్యక్తిత్వ వికాస నిపుణులు, విశ్రాంత రీడర్ జీవితంలో క్రీడలు మంచివే. అయితే పరీక్షల సమయంలో టీవీలను చూడటం కాదు. మంచి ర్యాంకులతో టీవీల్లో కనపడేలా విద్యార్థులు మానసికంగా సిద్ధపడాలి. జీవితాన్ని మలుపుతిప్పే సమయాన్ని వృథా చేయకూడదు. చదువు ముఖ్యమే: ఎతిరాజ్, డీఎస్డీఓ క్రీడల్లో ప్రతిభ ఉన్నా చదువులు ఎంతో ముఖ్యం. క్రీడల్లో, చదువుల్లో రాణించకపోతే జిల్లా క్రీడాభివృద్ధి అధికారిని అయ్యుండేవాడిని కాదు. క్రీడలకు కేటాయించే సమయం క్రీడలకు కేటాయించాలి. చదువులకు కేటాయించాల్సిన సమయం చదువులకు కేటాయించాలి. టీవీ తగ్గించాం: కే.సుశీల, గృహిణి పిల్లల చదువుల కోసం టీవీ చూడటం మేమే తగ్గించాం. గతంలో ఉదయం నిద్రలేచినప్పటి నుంచి టీవీ చూసే మా అబ్బా యి పరీక్షలు దగ్గరపడుతున్న కొద్ది టీవీకి దూరమయ్యాడు. చదువుల్లో రాణిస్తే జీవితంలో మళ్లీ,మళ్లీ ఆడుకోవచ్చు. నియంత్రణ కావాలి: బాలు, టీచర్ విద్యార్థులు ఏకాగ్రత, నియంత్రణ శక్తిని పెంచుకోవాలి. కష్టపడి చదివినా చదువంతా క్రీడల కోసం వృథా చేయకూడదు. పాఠ్యాంశాలను మర్చిపోయే స్థితికి క్రీడలు అధిగమించకూడదు. విద్యార్థులకు స్వయం నియంత్రణే శ్రీరామరక్ష. -
అంధుల రాష్ర్ట స్థాయి క్రికెట్ పోటీలు ప్రారంభం
హుడా కాంప్లెక్స్, న్యూస్‌లైన్: అంధుల రాష్ట్ర స్థాయి క్రికెట్ పోటీలు శుక్రవారం సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో ప్రారంభమయ్యాయి. వికలాంగుల కళ్యాణ వేదిక స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఈ పోటీలు జరుగుతున్నాయి. బొబ్బిలి, విశాఖపట్నం, ముసారాంబాగ్ టీవీ టవర్, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, తిరుపతి, అనంతపురం, ఈస్ట్‌గోదావరి, సమన్వాయి సంస్థ జట్లు బరిలో ఉన్నాయి. ఈ పోటీలు శనివారం సాయంత్రం ముగుస్తాయని నిర్వాహకులు సుభాష్ గుప్తా తెలిపారు. -
క్రికెట్ పోటీల్లో సన్‌వారియర్స్, సత్తుపల్లి జట్ల విజయం
ఖమ్మం వైరా రోడ్, న్యూస్‌లైన్: ఖమ్మం పట్టణ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జిల్లాస్థాయి క్రికెట్ పోటీల్లో శుక్రవారం సన్ వారియర్స్, సత్తుపల్లి జట్లు విజయం సాధించాయి. మొదట సన్ వారియర్స్, మధిర ఎస్ఆర్కేటీ జట్ల మధ్య జరగ్గా, సన్‌వారియర్స్ జట్టు 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన మధిర జట్టు 14 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 93 పరుగులు చేయగా, సన్ వారియర్స్ జట్టు 13 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 94 పరుగులు చేసి విజయం సాధించింది. మధ్యాహ్నం నేలకొండపల్లి, సత్తుపల్లి జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో సత్తుపల్లి జట్టు విజయం సాధించింది. మొదట బ్యాటింగ్చేసిన నేలకొండపల్లి జట్టు 14 ఓవర్లలో 57 పరుగులు చేసి ఆలౌట్ అయింది. అనంతరం సత్తుపల్లి జట్టు 13.5 ఓవర్లలో 58 పరుగులు చేసి విజయం సాధించింది.