‘ప్రపంచకప్‌తో నా కెరీర్ ముగిసినట్లే’
మాంచెస్టర్: టీమిండియా ఫిట్నెస్ ట్రైనర్ పాట్రిక్ ఫర్హత్ పదవీ కాలం ముగియనుంది. ఈ సందర్భంగా పాట్రిక్ ఫర్హత్ భావోద్వేగమైన ట్వీట్‌ను పంచుకున్నారు. తన పదవీ కాలం ముగియనున్న దశలో భారత్ ప్రపంచకప్ టోర్నీ నుంచి వైదొలగడం నిరాశపరించిందన్నారు. 2015 నుంచి పాట్రిక్ ఫర్హత్ భారత క్రికెట్ టీం వెన్నంటే ఉంటూ శంకర్ బసుతోపాటు ఫిట్నెస్ ట్రైనర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుత ప్రపంచకప్ ముగిసిన తర్వాత ఆయన పదవీకాలం పూర్తి కానుంది. దీంతో తన అనుభూతులను సోషల్ మీడియాలో పంచుకున్నారు.
సెమీ ఫైనల్లో న్యూజిలాండ్ చేతిలో 18 పరుగుల తేడాతో టీమిండియా ఓడిపోవడం నిరాశ కలిగించిదని, ఇలా జరుగుతుందని ఊహించలేదంటూ బాధపడ్డారు. ఏదేమైనా 4 సంవత్సరాలుగా టీమిండియాతో కలిసి పని చేసే అవకాశాన్నిచ్చినందుకు బీసీసీఐకు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ఆటగాళ్లందరూ మంచి విజయాలు సాధించాలని పాట్రిక్ ఆకాంక్షించారు. మరోవైపు పాట్రిక్ అందించిన సేవలకు భారతీయ క్రికెటటర్లు కృతజ్ఞతలు తెలిపారు. ‘మాకోసం మీరు పడ్డ శ్రమ మర్చిపోలేనిది’ అంటూ ఆల్‌రౌండర్ ఆటగాడు ధవళ్ కులకర్ణి, వాషింగ్టన్ సుందర్, సూర్యకుమార్ యాదవ్ ఫిట్నెస్ ట్రైనర్ పాట్రిక్ సేవలను కొనియాడారు.