CRPS
-
క్రైస్తవుల ఓట్లతో గెలిచి ఇప్పుడు కించపరుస్తారా?
అక్కిరెడ్డిపాలెం (గాజువాక): నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు నీతివంతుడైతే క్రిస్టియన్ల ఓట్లు అడగకుండా తిరిగి ఎన్నికలకు వెళ్లాలని రాష్ట్ర క్రిస్టియన్ రైట్స్ ప్రొటెక్షన్ సొసైటీ (సీఆర్పీఎస్) గౌరవాధ్యక్షుడు ఎం.సురేష్ కుమార్ సవాల్ విసిరారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలో హిందువులందరినీ క్రైస్తవ మతంలోకి మార్చేస్తారని ఎంపీ చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. శుక్రవారం గాజువాక కాపు తుంగ్లాంలోని బిషప్ శామ్యూల్ లోపింట్ ఎంహెచ్‌జేసీ చర్చిలో క్రిస్టియన్ సంఘాల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఎంపీగా గెలవడానికి ఎక్కువగా క్రిస్టియన్ల ఓట్లే కారణమని, ఇప్పుడు క్రిస్టియన్లను కించపరుస్తూ మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తంయ చేశారు. రాష్ట్ర సీఆర్పీఎస్ అధ్యక్షుడు వై.బాలారావు, ప్రధాన కార్యదర్శి ఎం.అనిల్‌కుమార్, కోశాధికారి వై.జార్జిబాబు, రాష్ట్ర ఇన్చార్జి జాషువా, రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎస్.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
ఇన్స్పెక్టర్ను కాల్చి చంపి ఎస్ఐ ఆత్మహత్య
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని సీఆర్పీఎఫ్ 122వ బెటాలియన్‌లో కాల్పులు కలకలం చోటు చేసుకున్నాయి. ఇన్స్పెక్టర్ దశరథ్‌సింగ్(56)ను ఎస్ఐ కర్నేల్‌సింగ్(55) కాల్చి చంపారు. అనంతరం ఎస్ఐ కర్నేల్ సింగ్ ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన లోధి ఎస్టేట్‌లోని హోంమంత్రి భవనం వద్ద శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ దశరథ్‌సింగ్, ఎస్ఐ కర్నేల్‌సింగ్ మధ్య శుక్రవారం రాత్రి తీవ్ర వాగ్వాదం జరిగింది. ఆగ్రహంతో ఎస్ఐ తన సర్వీస్ గన్‌తో ఇన్స్పెక్టర్ దశరథ్ సింగ్‌పై కాల్పులు జరిపాడు. దీంతో దశరథ్‌సింగ్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. అనంతరం అదే గన్‌తో ఎస్ఐ కర్నేల్ సింగ్ తనను తాను కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నారు. (హత్య కేసులో ఐపీఎస్ అధికారిపై వేటు) సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఈ ఘటనపై పలు కోణాల్లో లోతుగా దర్యాప్తు జరుపుతామని పోలీసులు తెలిపారు. ఎస్ఐ కర్నేల్‌సింగ్ జమ్మూ కాశ్మీర్‌లోని ఉధంపూర్‌కు చెందినవారు కాగా, ఇన్స్పెక్టర్ దశరథ్‌సింగ్ హర్యానాలోని రోహ్తక్కు చెందినవారని పోలీసులు పేర్కొన్నారు. (కోవిడ్ సెంటర్ నుంచి ఇద్దరు ఖైదీలు పరారీ) -
కష్టాల్లో సీఆర్పీలు
* చాలీచాలని వేతనాలు * అవీ మూడు నెలలుగా అందని వైనం * పెరిగిన జీతాల కోసం ఎదురుచూపులు గురజాల: వారంతా ఉపాధ్యాయ శిక్షణ పొందిన విద్యావంతులు, పరిస్థితులు కలిసిరాక ఉపాధ్యాయ పోస్టులను అందుకోలేకపోయారు. విద్యా శాఖ పరిధిలోనే పనిచేస్తున్నా కనీస వేతనానికి నోచుకోలేకపోతున్నారు. నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్ సర్వీసెస్ కింద ప్రభుత్వం 2011లో సీఆర్పీల వ్యవస్థను ప్రవేశపెట్టింది. పాఠశాలలను నిరంతరం మోనటరింగ్ చేసేందుకు ఒక వ్యవస్థ అవసరమని ప్రభుత్వం దీన్ని అమల్లోకి తీసుకువచ్చింది. అయితే ఈ వ్యవస్థను పటిష్టపరిచేందుకు అటు కేంద్రంగాని, ఇటు రాష్ట్ర ప్రభుత్వం గాని దృష్టి సారించలేదు. సీఆర్పీలు స్వతంత్రంగా పనిచేసేందుకు కేంద్ర ప్రభుత్వం క్లస్టర్ రిసోర్స్ సెంటర్ మంజూరు చేసినా రాష్ట్ర ప్రభుత్వం కనీసం పట్టించుకోవడం లేదు. పోనీ పార్ట్ టైంగా పనిచేస్తున్నారా అంటే అదీ లేదు. ఉపాధ్యాయులతో పాటుగా పూర్తి స్థాయిలో పనిచేస్తుంటారు. కాంట్రాక్టు పద్ధతిలో నియమితులైన వీరికి ప్రభుత్వం ప్రస్తుతం చెల్లిస్తోంది కేవలం రూ.8,300 మాత్రమే. ప్రస్తుత పరిస్థితుల్లో కనీసం రూ.15 వేలు ఉంటే గాని కుటుంబం గడవని పరిస్థితి. చాలీచాలని వేతనాలతో క్లస్టర్ రిసోర్సు పర్సన్ ఉద్యోగులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జిల్లాలో 279 మంది సీఆర్పీలు.. జిల్లాలో మొత్తం 279 స్కూల్ కాంప్లెక్స్‌లు ఉన్నాయి. వీటిలో పాఠశాలల మోనటరింగ్ కోసం ఒక్కో స్కూల్ కాంప్లెక్స్‌కు ఒక సీఆర్పీ చొప్పున 279 మందిని నియమించారు. ఒక్కో స్కూల్ కాంప్లెక్స్ కింద సుమారుగా 10 నుంచి 18 పాఠశాలలు మోనటరింగ్ చేయాల్సివుంటుంది. వీరు ప్రతి రోజు ఒక పాఠశాలను సందర్శించి సమాచారాన్ని సేకరించి మండల రిసోర్సు సెంటరుకు అందచేయాలి. వీరికి ప్రతినెల వచ్చే వేతనం తప్ప ప్రయాణం, ఇతర ఖర్చులను ప్రభుత్వం చెల్లించకపోవడంతో జీతం నుంచే వాటిని ఖర్చుచేయాల్సివస్తోంది. దీంతో ప్రయాణ ఖర్చుల కింద సుమారుగా రూ.2,500 వరకు పక్కన పెట్టాల్సివుంది. ప్రభుత్వం చెల్లిస్తున్న రూ.8,300ల్లో రూ.2,500 పోగా చేతికి వచ్చేది రూ.5,800 మాత్రమే. విద్యాశాఖకు ప్రధాన వనరులు వీరే... విద్యాశాఖకు సంబంధించి సకల సమాచారాన్ని సేకరించి అందించడంలో వీరు అత్యంత కీలకంగా పనిచేస్తారు. పరీక్ష పత్రాల పంపిణీ, మధ్యాహ్న భోజన బిల్లులు సేకరణ వంటి పనులను నిర్వర్తిస్తున్నారు. విద్యార్థులకు యూనిఫాం వివరాలు సేకరించడంతో పాటు అంగవైకల్యం గల పిల్లలను గుర్తించి వారి వివరాలను దగ్గరలోని ఇఇఆర్టీలకు అందచేస్తారు. ఉపాధ్యాయులకు, జిల్లా అధికారులకు మధ్య వారధిగా వ్యవహరిస్తుంటారు. జిల్లా అధికారుల అదేశానుగుణంగా వివిధ రకాల విధులు నిర్వహిస్తున్నారు. ఉద్యోగ భద్రత ప్రశ్నార్థకం... పాఠశాల ఉపాధ్యాయులతో పాటు అర్హత ఉన్నా, కాంట్రాక్టు విధానంలో సీఆర్పీలుగా పనిచేస్తున్న వీరికి ఉద్యోగ భద్రత లేకుండా పోయింది. ఈ వ్యవస్థ ఏర్పాటుచేసినప్పుడు వేతనంతో పాటుగా ఫోన్ బిల్లు, ట్రావెలింగ్ అలవెన్సులు అందించేవారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటినుంచి కేవలం వేతనం మాత్రమే ఇస్తోంది. రాష్ట్రంలో మొత్తం 4,034 క్లస్టర్లు వున్నాయి. వాటిలో 3,521 మంది విధులు నిర్వహిస్తున్నారు. 3,105 మందికి వచ్చే బడ్జెట్‌ను 3,521 మంది సీఆర్పీలకు సర్దుబాటు చేస్తున్నారు. గత మూడు నెలలుగా వేతనాలు అందించలేదు. దీంతో అప్పులు చేసి బతకాల్సి వస్తోందని పలువురు సీఆర్పీలు వాపోతున్నారు. ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి.. సీఆర్పీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి. స్కూల్ అసిస్టెంట్‌కు ఇస్తున్న కనీస వేతనం సీఆర్పీలకు ఇవ్వాలి. పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాలు అందేవిధంగా చర్యలు తీసుకోవాలి. కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ జీవో 151ని సర్వశిక్షా అభియాన్ ఉద్యోగులకు వర్తింపచేయాలి. ముఖ్యంగా సీఆర్పీలకు ఉద్యోగ భద్రతతో పాటు కుటుంబానికి భద్రత కల్పించాలి. మొబైల్ యాప్, నెట్ చార్జీలు, సెల్ బిల్లు, ప్రయాణ ఖర్చుల కింద వెయ్యి రూపాయలు అందచేయాలి. – బి.కాంతారావు,సర్వ శిక్షా అభియాన్ కాంట్రాక్టు అండ్ ఔట్ సోర్సింగ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ స్టేట్ జనరల్ సెక్రటరీ -
నేటి నుంచి వేసవి బడులు
- మే 30 వరకు కొనసాగింపు - జిల్లాలో 12 వేల మంది విద్యార్థుల ఎంపిక - బోధనకు 233 మంది సీఆర్పీలు - ప్రతిష్టాత్మకంగా తీసుకున్న విద్యాశాఖ కెరమెరి : చదువుల్లో వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక బోధన ద్వారా కనీస సామార్థ్యాలను సాధించేందుకు నిర్వహించనున్న వేసవి బడులు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఇందుకు కావాల్సిన ఏర్పాట్లల్లో సీఆర్పీలు నిమగ్నమయ్యారు. జిల్లాలో మొత్తం 12 వందల మంది సీ గ్రేడ్ విద్యార్థులను ఎంపిక చేశారు. 52 మండలాల్లో 233 మంది సీఆర్పీలు, ఎంపిక చేసిన 233 పాఠశాలల్లో వేసవి బడులు నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన శిక్షణలు ఈ నెల 15నుంచి 20 వరకు కొనసాగగా, ప్రత్యేకంగా రాష్ట్ర స్థాయి విద్యాశాఖాధికారులు ఈ నెల 21న టెలికాన్ఫరెన్స్ నిర్వహించి మరిన్ని వివరాలు తెలియజేశారు. ఇందులో కేవలం ప్రాథమిక పాఠశాలల విద్యార్థులను తీసుకున్నారు. ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొంది. దీన్ని విజయవంతం చేసేందుకు సర్వశిక్ష అభియాన్ (ఎస్ఎస్ఏ) అధికారులు పూర్తి స్థాయిలో నిమగ్నమయ్యారు. ఆటలు, పాటలు, ఓరిగామి ద్వారా బోధన పాఠశాల వాతావరణానికి పూర్తిగా భిన్నంగా వేసవి బడులు కొనసాగుతారుు. పాఠశాలల్లో పుస్తకాలతో కుస్తీపట్టి అలసిపోయిన విద్యార్థులుకు వినూత్న విధానం ద్వారా బోధించనున్నారు. ఆటలు, పాటలు, ఓరిగామి (కాగితపు బొమ్మల) ద్వారా పూర్తిగా ఆహ్లాదం, ఆనంద భరిత వాతావరణంలో వేసవి బుడులు కొనసాగుతారు. వేసవి బడులు ఎందుకు? జిల్లాలోని అన్ని మండలాల్లో గల స్కూల్ కాంప్లెక్స్ పరిధిలో ఒక్కో పాఠశాలను ఎంచుకుని వేసవి బడులు నిర్వహించనున్నారు. 2, 3, 4, 5 తరగతుల్లో చదువుతున్న విద్యార్థులు తెలుగులో చదవడం, రాయడం రానివారు, గణితంలో చతుర్విద ప్రక్రియలు చేయని వారు, ఆంగ్లంలో మాట్లాడలేని, పదాలు గుర్తించలేని, తరగతి స్థాయి లేని విద్యార్థులలో తరగతి స్థాయి లేదా కనీస అభ్యసన స్థాయిలు సాధించడమే వేసవి బడుల ముఖ్య ఉద్దేశం. - బీ, సీ గ్రేడ్ విద్యార్థుల్లో అవసరమైన సామార్థ్యాలు సాధించుట. - రాబోయే విద్యాసంవత్సరంలో అభ్యసించే తరగతికి పిల్లల్ని తయారు చేయడం. - అభ్యసనం పట్ల పిల్లలకు ఆసక్తి కలిగించే తరగతికి బోధనాభ్యాసన ప్రక్రియల్లో పాలుపంచుకోవడం. - రెగ్యులర్‌గా హాజరుకాని విద్యార్థులు అభ్యసన స్థాయి సాధించుట. - విద్యా సంవత్సరంలో అభ్యసించిన అంశాలు పునర్భలనం కోసం.. - విద్యలో సమాజం భాగస్వామ్యం కోసం.. - కేంద్ర నిర్వాహణ ద్వారా ఆశించేవి.. తెలుగులో ధారాళంగా చదవడం, మాట్లాడడం, గణితంలో చతుర్విద ప్రక్రియలు, ఆంగ్లంలో విని అర్థం చేసుకుని మాట్లాడడం, పదాలు చదవడం, రాయడం, సృజనాత్మక కృత్యాల నిర్వాహణ, కథలు, పాటలు పాడడం, అభినయ గేయాలు, బొమ్మలు గీయడం, ఓరిగామి కళను అభ్యసించడం, సరదాసైన్స్ కృత్యాలు చేయడం లాంటివాటితో విద్యార్థుల్లో ఆద్యాంతం జోష్ నింపే తరగతులు నిర్వహించనున్నారు. ఉదయం 8 నుంచి 11 గంటల వరకు వేసవి బడులు కొనసాగనున్నాయి. మూడు పరీక్షలు ఈ కార్యక్రమంలో భాగంగా ఆయా విద్యార్థులను పరీ క్షించేందుకు ఆరంభ, మధ్యమ, అంత్య పరీక్షలు నిర్వహిస్తారు. నేడు ఆరంభం పరీక్ష నిర్వహించి ఆ పరీక్షల ఆధారంగా విద్యార్థులను ఎంపిక చేసుకుని తరగతుల బోధన కొనసాగిస్తారు. పక్షం రోజుల తర్వాత మద్య మ, మే 30న అంతిమ పరీక్ష నిర్వహించి ప్రగతి నమో దు పత్రాన్ని తల్లిదండ్రులకు అందజేయనున్నారు. -
ఏజెన్సీలో ముమ్మర తనిఖీలు
కురుపాం: ఏజెన్సీలో పోలీసులు ముమ్మర తనిఖీలు చేపట్టారు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని సుక్మాజిల్లాలో సోమవారం సీఆర్పీఎఫ్ బలగాలపై మావోయిస్టులు కాల్పులు జరిపిన సంఘటనలో 13 మంది జవాన్లు మృతి చెందిన సంఘటన విదితమే. ఈ నేపథ్యంలో ఒడిశా సరిహద్దు మండలాలైన కురుపాం, కొమరాడ పోలీసులు అప్రమత్తమై మంగళవారం విస్త్రత తనిఖీలు నిర్వహించారు. ఏజెన్సీ ముఖ ద్వారమైన కురుపాం మండల కేంద్రంలో ఎస్సై ఎన్.అశోక చక్రవర్తి పోలీసు సిబ్బందితో కలిసి వాహనాలను క్షణ్ణంగా తనిఖీ చేసి అపరిచిత వ్యక్తులను ప్రశ్నించి వివరాలు సేకరించారు. గుమ్మలక్ష్మీపురంలో.. మావోయిస్టుల వారోత్సవాల సందర్భంగా గుమ్మలక్ష్మీపురం ఏజెన్సీలో మంగళవారం ఎల్విన్‌పేట పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. ఎల్విన్‌పేట సర్కిల్ ఇన్స్పెక్టర్ జి.వేణుగోపాల్ ఆదేశాల మేరకు సబ్ ఇన్స్పెక్టర్ ఐ.గోపి ఆధ్వర్యంలో పలు ప్రధాన జంక్షన్ల వద్ద ఎల్విన్‌పేట సీఆర్పీఎఫ్,సివిల్ పోలీసులు వాహన తనిఖీలు చేశారు. పార్వతీపురం,కురుపాం,ఒడిశా తదితర ప్రాంతాలనుంచి రాకపోకలు సాగించే వాహనాలను నిలుపుదల చేసి క్షుణ్ణంగా పరిశీలించారు. అనుమానిత వ్యక్తులు ఎవరైనా కనిపించినా వారి నుంచి వివరాలు సేకరిస్తున్నారు.