కష్టాల్లో సీఆర్పీలు | CRPs in troubles | Sakshi
Sakshi News home page

కష్టాల్లో సీఆర్పీలు

Published Sun, Sep 11 2016 4:45 PM | Last Updated on Mon, Sep 4 2017 1:06 PM

కష్టాల్లో సీఆర్పీలు

కష్టాల్లో సీఆర్పీలు

* చాలీచాలని వేతనాలు
అవీ మూడు నెలలుగా అందని వైనం 
పెరిగిన జీతాల కోసం ఎదురుచూపులు
 
గురజాల: వారంతా ఉపాధ్యాయ శిక్షణ పొందిన విద్యావంతులు, పరిస్థితులు కలిసిరాక ఉపాధ్యాయ పోస్టులను అందుకోలేకపోయారు. విద్యా శాఖ పరిధిలోనే పనిచేస్తున్నా కనీస వేతనానికి నోచుకోలేకపోతున్నారు. నాన్‌ ఫార్మల్‌ ఎడ్యుకేషన్‌ సర్వీసెస్‌ కింద ప్రభుత్వం 2011లో సీఆర్‌పీల వ్యవస్థను ప్రవేశపెట్టింది. పాఠశాలలను నిరంతరం మోనటరింగ్‌ చేసేందుకు ఒక వ్యవస్థ అవసరమని ప్రభుత్వం దీన్ని అమల్లోకి తీసుకువచ్చింది. అయితే ఈ వ్యవస్థను పటిష్టపరిచేందుకు అటు కేంద్రంగాని, ఇటు రాష్ట్ర ప్రభుత్వం గాని దృష్టి సారించలేదు. సీఆర్‌పీలు స్వతంత్రంగా పనిచేసేందుకు కేంద్ర ప్రభుత్వం క్లస్టర్‌ రిసోర్స్‌ సెంటర్‌ మంజూరు చేసినా రాష్ట్ర ప్రభుత్వం కనీసం పట్టించుకోవడం లేదు. పోనీ పార్ట్‌ టైంగా పనిచేస్తున్నారా అంటే అదీ లేదు. ఉపాధ్యాయులతో పాటుగా పూర్తి స్థాయిలో పనిచేస్తుంటారు. కాంట్రాక్టు పద్ధతిలో నియమితులైన వీరికి ప్రభుత్వం ప్రస్తుతం చెల్లిస్తోంది కేవలం రూ.8,300 మాత్రమే. ప్రస్తుత పరిస్థితుల్లో కనీసం రూ.15 వేలు ఉంటే గాని కుటుంబం గడవని పరిస్థితి. చాలీచాలని వేతనాలతో క్లస్టర్‌ రిసోర్సు పర్సన్‌ ఉద్యోగులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
 
జిల్లాలో 279 మంది సీఆర్‌పీలు..
జిల్లాలో మొత్తం 279 స్కూల్‌ కాంప్లెక్స్‌లు  ఉన్నాయి. వీటిలో పాఠశాలల మోనటరింగ్‌ కోసం ఒక్కో స్కూల్‌ కాంప్లెక్స్‌కు ఒక సీఆర్‌పీ చొప్పున 279 మందిని నియమించారు. ఒక్కో స్కూల్‌ కాంప్లెక్స్‌ కింద సుమారుగా 10 నుంచి 18 పాఠశాలలు మోనటరింగ్‌ చేయాల్సివుంటుంది. వీరు ప్రతి రోజు ఒక పాఠశాలను సందర్శించి సమాచారాన్ని సేకరించి మండల రిసోర్సు సెంటరుకు అందచేయాలి. వీరికి ప్రతినెల వచ్చే వేతనం తప్ప ప్రయాణం, ఇతర ఖర్చులను ప్రభుత్వం చెల్లించకపోవడంతో జీతం నుంచే వాటిని ఖర్చుచేయాల్సివస్తోంది. దీంతో ప్రయాణ ఖర్చుల కింద సుమారుగా రూ.2,500 వరకు పక్కన పెట్టాల్సివుంది. ప్రభుత్వం చెల్లిస్తున్న రూ.8,300ల్లో రూ.2,500 పోగా చేతికి వచ్చేది రూ.5,800 మాత్రమే. 
 
విద్యాశాఖకు ప్రధాన వనరులు వీరే...
విద్యాశాఖకు సంబంధించి సకల సమాచారాన్ని సేకరించి అందించడంలో వీరు అత్యంత కీలకంగా పనిచేస్తారు. పరీక్ష పత్రాల పంపిణీ, మధ్యాహ్న భోజన బిల్లులు సేకరణ వంటి పనులను నిర్వర్తిస్తున్నారు. విద్యార్థులకు యూనిఫాం వివరాలు సేకరించడంతో పాటు అంగవైకల్యం గల పిల్లలను గుర్తించి వారి వివరాలను దగ్గరలోని ఇఇఆర్‌టీలకు అందచేస్తారు. ఉపాధ్యాయులకు, జిల్లా అధికారులకు మధ్య వారధిగా వ్యవహరిస్తుంటారు. జిల్లా అధికారుల అదేశానుగుణంగా వివిధ రకాల విధులు నిర్వహిస్తున్నారు.
 
ఉద్యోగ భద్రత ప్రశ్నార్థకం...
పాఠశాల ఉపాధ్యాయులతో పాటు అర్హత ఉన్నా, కాంట్రాక్టు విధానంలో సీఆర్పీలుగా పనిచేస్తున్న వీరికి ఉద్యోగ భద్రత లేకుండా పోయింది. ఈ వ్యవస్థ ఏర్పాటుచేసినప్పుడు వేతనంతో పాటుగా ఫోన్‌ బిల్లు, ట్రావెలింగ్‌ అలవెన్సులు అందించేవారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటినుంచి కేవలం వేతనం మాత్రమే ఇస్తోంది. రాష్ట్రంలో మొత్తం 4,034 క్లస్టర్‌లు వున్నాయి. వాటిలో 3,521 మంది విధులు నిర్వహిస్తున్నారు. 3,105 మందికి వచ్చే బడ్జెట్‌ను 3,521 మంది సీఆర్పీలకు సర్దుబాటు చేస్తున్నారు. గత మూడు నెలలుగా వేతనాలు అందించలేదు. దీంతో అప్పులు చేసి బతకాల్సి వస్తోందని పలువురు సీఆర్పీలు వాపోతున్నారు.
 
ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి..
సీఆర్పీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి. స్కూల్‌ అసిస్టెంట్‌కు ఇస్తున్న కనీస వేతనం సీఆర్పీలకు ఇవ్వాలి. పీఎఫ్, ఈఎస్‌ఐ సౌకర్యాలు అందేవిధంగా చర్యలు తీసుకోవాలి. కాంట్రాక్టు అవుట్‌సోర్సింగ్‌ జీవో 151ని సర్వశిక్షా అభియాన్‌ ఉద్యోగులకు వర్తింపచేయాలి. ముఖ్యంగా సీఆర్పీలకు ఉద్యోగ భద్రతతో పాటు కుటుంబానికి భద్రత కల్పించాలి. మొబైల్‌ యాప్, నెట్‌ చార్జీలు, సెల్‌ బిల్లు, ప్రయాణ ఖర్చుల కింద  వెయ్యి రూపాయలు అందచేయాలి. 
– బి.కాంతారావు,సర్వ శిక్షా అభియాన్‌ కాంట్రాక్టు అండ్‌ ఔట్‌ సోర్సింగ్‌ ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌ స్టేట్‌ జనరల్‌ సెక్రటరీ 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement